close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రుణగ్రహీతలకు దసరా బహుమతి

రూ.6,500 కోట్ల వడ్డీ రాయితీ
రూ.2 కోట్ల వరకు రుణాలపై మారటోరియం కాలానికి చక్రవడ్డీ రద్దు
ఈఎంఐలు చెల్లించినా పథకం వర్తింపు..
సరళ, చక్రవడ్డీ మధ్యనున్న వ్యత్యాస మొత్తం వారి బ్యాంకు ఖాతాల్లో జమ
కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల జారీ

ఈనాడు, దిల్లీ: పండగల సీజన్‌లో రుణ గ్రహీతలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) ప్రకటించిన మారటోరియం విధానానికి లోబడి రూ.2కోట్ల వరకు ఉన్న రుణాలపై చక్రవడ్డీని రద్దు చేసింది. ఫిబ్రవరి 29 నాటికి ఉన్న రుణాలకు దీనిని వర్తింపజేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ శుక్రవారం రాత్రి ఉత్తర్వులిచ్చింది. దీని వల్ల దేశ వ్యాప్తంగా రుణ గ్రహీతలకు రూ.6,500 కోట్ల మేర ప్రయోజనం కలుగనుందని అంచనా. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న ఎనిమిది రకాల రుణాలకు ఇది వర్తిస్తుంది.

ఈ ఏడాది మార్చి 1 నుంచి ఆగస్టు 31 వరకు రుణ గ్రహీతలు మారటోరియం వెసులుబాటును  ఉపయోగించుకున్నా, ఉపయోగించుకోకపోయినా ఈ ప్రయోజనం పొందటానికి అర్హులవుతారు. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరి 29 నాటికి ఆ రుణాలు మొండిబకాయిలుగా మారకుండా ఉంటనే పథకం వర్తించేలా షరతు విధించారు.

అర్హులు ఎవరంటే..
1. చిన్న,మధ్యతరహా పరిశ్రమలు,
2. విద్య,
3. గృహ,
4. వినియోగ వస్తువులు,
5. క్రెడిట్‌కార్డు బకాయిలు,
6. ఆటోమొబైల్‌,
7. వ్యక్తిగత, వృత్తిగత,
8. వినియోగ రుణాలు తీసుకున్నవారు.

రాయితీ అమలయ్యే ఆర్థిక సంస్థలు
* బ్యాంకులు, సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ఆల్‌ ఇండియా ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్‌, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, గృహరుణాల సంస్థలు, మైక్రో ఫైనాన్స్‌ కంపెనీలు మంజూరు చేసిన రుణాలకు వడ్డీ రాయితీ వర్తిస్తుంది.


పథకంలోని ప్రధాన విశేషాలు..

* ఈ ఏడాది మార్చి ఒకటో తేదీ నుంచి ఆగస్టు 31వరకు ఉన్న రుణ బకాయిలపై సరళ, చక్రవడ్డీల మధ్య ఉన్న తేడాను పరిహారం (ఎక్స్‌గ్రేషియా) రూపంలో  కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది.
* ఆర్‌బీఐ మార్చి 27న ప్రకటించిన మారటోరియంను రుణ గ్రహీతలు పూర్తిగా ఉపయోగించుకున్నారా? పాక్షికంగా ఉపయోగించుకున్నారా? అన్న దానితో సంబంధం లేకుండా రుణం ఇచ్చిన సంస్థలు సరళ వడ్డీ, చక్రవడ్డీకి మధ్య తేడా మొత్తాన్ని అర్హులైన రుణ గ్రహీతల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది.
* మారటోరియం ప్రకటించిన కాలంలో రుణ వాయిదా(ఈఎంఐ)లను యథావిథిగా చెల్లిస్తూ వచ్చిన వారి క్కూడా ఈ పథకం వర్తిస్తుంది.
* రుణాలు ఇచ్చిన సంస్థ చక్రవడ్డీ, సరళ వడ్డీ మధ్య తేడా ఉన్న మొత్తాన్ని రుణ గ్రహీతల ఖాతాల్లో జమ చేసిన తర్వాత ఆ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి తిరిగి రాబట్టుకోవచ్చు.
* రుణం తీసుకొనేటప్పుడు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారమే వడ్డీ రేటు వర్తిస్తుంది. విద్య, గృహ, ఆటోమొబైల్‌, వ్యక్తిగత, వినియోగ రుణాలపై మాత్రం ఫిబ్రవరి 29నాటికున్న వడ్డీరేటు వర్తిస్తుంది.
* రుణదాతలు సరళ, చక్రవడ్డీల మధ్య తేడా మొత్తాన్ని నవంబర్‌ 5వ తేదీలోపు అర్హులైన రుణగ్రహీతల ఖాతాల్లో జమ చేయాలి.
* రుణాలపై (క్యాష్‌ క్రెడిట్‌)సరళ వడ్డీని ఫిబ్రవరి 29నాటికున్న వడ్డీ రేటు ఆధారంగా రోజువారీగా లెక్కిస్తారు. చక్రవడ్డీని నెలవారీగా గణిస్తారు. ఆ రెండింటి మధ్య తేడాను వినియోగదారుల ఖాతాల్లో జమచేస్తారు.


ఎందుకీ రాయితీ..

కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్‌ కారణంగా వ్యాపారాలు స్తంభించడంతో ఆదాయలు లేక నెలవారీ వాయిదాలు చెల్లించలేని పరిస్థితి నెలకొనడంతో ఆర్‌బీఐ మారటోరియం ప్రకటించింది. మారటోరియం కాలంలో ఎలాంటి వడ్డీ విధించకుండా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం వడ్డీ రాయితీ పథకాన్ని ప్రకటించినా దానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయకపోవడంపై జస్టిస్‌ అశోక్‌భూషణ్‌, జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డి, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాతో కూడిన ధర్మాసనం ఈనెల 14న విచారం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను నవంబర్‌ 2కి వాయిదావేస్తూ ‘దీపావళి పండగ మీ చేతుల్లో ఉంది’ అని కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ న్యాయవాదులను ఉద్దేశించి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలోనే సరళ వడ్డీ, చక్రవడ్డీ మధ్య ఉన్న తేడాను ‘ఎక్స్‌గ్రేషియా’ రూపంలో చెల్లించడానికి కేంద్రం అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.