విశిష్టతల సమాహారం.. ప్రజాస్వామ్య సౌధం

ప్రధానాంశాలు

విశిష్టతల సమాహారం.. ప్రజాస్వామ్య సౌధం

10న కొత్త భవన నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన
 వారసత్వ సంపదగా పాత భవనం : లోక్‌సభ స్పీకర్‌

ఈనాడు, దిల్లీ: ప్రజాస్వామ్య మందిరమైన పార్లమెంటు నూతన భవన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. దేశ రాజధాని దిల్లీలో ఉన్న ప్రస్తుత పార్లమెంటు భవనం నూరేళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో కొత్త భవన నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది. ఈనెల 10వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా శనివారం దిల్లీలో విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ఎన్నో విశిష్టతల సమాహారంగా.. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రతిబింబంగా నిలిచే ఈ సౌధాన్ని ప్రపంచంలోని అన్ని చట్టసభల కంటే మిన్నగా తీర్చిదిద్దనున్నారు. నూతన భవానానికి సంబంధించిన అనేక విశిష్టతలను ఓం బిర్లా వివరించారు. ‘‘వర్తమాన అవసరాలకు ప్రస్తుత భవనం సరిపోవడం లేదు. సభ నిర్వహణకు ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానం చాలడం లేదు. అధునాతన సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో కొత్త భవనం నిర్మించాలని పార్లమెంటు ఉభయ సభాపతులం కలిసి చేసిన విజ్ఞప్తిని ప్రధాని అంగీకరించారు. భారతీయ శిల్ప కళాకారుల చేతులమీదుగా కొత్త భవనం నిర్మించుకోవడం 130 కోట్ల ప్రజలకు గర్వకారణం. ఆత్మనిర్భర్‌ భారత్‌కు ప్రతీకగా, దేశంలోని విభిన్న ప్రాంతాల వైవిధ్యాన్ని ఒకచోట కలబోసి కొత్త భవనాన్ని నిర్మించబోతున్నాం. కొత్త భవనంలోనే 75వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోనున్నాం. వచ్చే 100 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొత్త భవనం నిర్మించాలని నిర్ణయించాం.’’ అని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా చెప్పారు. పాత భవనాన్ని వారసత్వ సంపదగా అలాగే ఉపయోగించుకుంటామన్నారు. కొవిడ్‌ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఎవరెవర్ని శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించాలన్న దానిపై చర్చిస్తున్నామని, కొందరు ప్రత్యక్షంగా, కొందరు వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొంటారని తెలిపారు.

విశిష్టతలెన్నో..
* 64,500 చదరపు మీటర్ల పరిధిలో రూ. 971 కోట్లతో కొత్త భవనం రూపుదాల్చనుంది. ప్రస్తుత భవనం కంటే ఇది 17 వేల చదరపు మీటర్లు పెద్దది. ఎలాంటి భూకంపాలకు చెక్కుచెదరని రీతిలో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు.
* నూతన భవనం రూపు ప్రస్తుత భవనాన్ని పోలి ఉంటుంది. గ్రౌండ్‌, మొదటి, రెండు అంతస్తులుంటాయి. ఎత్తు కూడా ప్రస్తుత భవనం అంతే ఉంటుంది.
* గుజరాత్‌కు చెందిన హెచ్‌సీపీ సంస్థ ఆకృతి (డిజైన్‌)ని రూపొందించగా, టాటా సంస్థ నిర్మాణం చేపడుతుంది. నిర్మాణంలో 2 వేల మంది ప్రత్యక్షంగాను, 9 వేల మంది పరోక్షంగాను పాలుపంచుకుంటారు. 200 మందికిపైగా దేశవ్యాప్తంగా ఉన్న హస్తకళాకారులు ఇందులో పాల్గొంటారు.
* ఒకేసారి 1,224 మంది ఎంపీలు కలిసి కూర్చోవడానికి అనుగుణంగా నూతన పార్లమెంటు భవనాన్ని నిర్మిస్తున్నారు.
* లోక్‌సభలో 888 మంది, రాజ్యసభలో 384 మంది కూర్చునేందుకు వీలైన సామర్థ్యంతో కొత్త భవనం నిర్మితం కానుంది.
* భారత ప్రజాస్వామ్య వైభవాన్ని చాటిచెప్పే ప్రత్యేక రాజ్యాంగ మందిరం; సభపతులు, మంత్రులకు ప్రత్యేక కార్యాలయాలు, పార్లమెంటు సభ్యుల కోసం విశాలమైన లాంజ్‌, గ్రంథాలయం, బహుళ కమిటీల గదులు, భోజనశాలలు వంటివి ఏర్పాటు చేస్తారు.
* 2022 అక్టోబరు నాటికి భవన నిర్మాణం పూర్తి చేయాలన్నది లక్ష్యం.
* పార్లమెంటుకు కాస్త దూరంలో ఇప్పుడున్న శ్రమశక్తిభవన్‌ స్థానంలో ఎంపీల కోసం 2024 నాటికల్లా 40 చదరపు మీటర్ల విస్తీర్ణంతో ప్రత్యేక కార్యాలయాలు నిర్మించి ఇస్తారు. పార్లమెంటు, ఎంపీల కార్యాలయ భవనానికి మధ్య భూగర్భమార్గం ఏర్పాటు చేస్తారు.

 

వందేళ్ల చరితం

ప్రస్తుత పార్లమెంటు భవనానికి వందేళ్ల చరిత్ర ఉంది. బ్రిటిష్‌ హయాంలో నిర్మించిన ఈ సుందర కట్టడం విశేషాలివి..
శంకుస్థాపన: 1921 ఫిబ్రవరి 12
నిర్మాణానికి పట్టిన కాలం: 6 సం.లు
నిర్మాణ వ్యయం: రూ. 83 లక్షలు
ప్రారంభోత్సవం: 1927 జనవరి 18
ప్రారంభించింది: అప్పటి గవర్నర్‌ జనరల్‌ ఇర్విన్‌
రూపం: 560 అడుగుల వ్యాసంతో కూడిన వృత్తాకార కట్టడం
ఆకృతి, ప్లానింగ్‌, నిర్మాణ బాద్యతలు చేపట్టింది: ఎడ్విన్‌ లుటెన్స్‌, హెర్బెర్ట్‌ బేకర్‌


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని