బెంగాల్‌లోని ముగ్గురు ఐపీఎస్‌లకు.. కేంద్ర హోంశాఖ హుకుం

ప్రధానాంశాలు

బెంగాల్‌లోని ముగ్గురు ఐపీఎస్‌లకు.. కేంద్ర హోంశాఖ హుకుం

దిల్లీ డిప్యుటేషన్‌పై పనిచేయాలని సమన్లు
ససేమిరా అంటున్న మమత సర్కారు

దిల్లీ/కోల్‌కతా: కేంద్రంలోని భాజపా - పశ్చిమబెంగాల్‌లోని తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ)ల మధ్య అగ్గి మరింత రాజుకుంది. ఈనెల 10న భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా వాహనశ్రేణిపై దాడి అనంతరం వరుస పరిణామాలు ఒక్కొక్కటిగా వేడిని పెంచుతూనే ఉన్నాయి. తాజాగా పశ్చిమబెంగాల్‌కు చెందిన ముగ్గురు ఐపీఎస్‌ అధికారులపై కేంద్ర హోంశాఖ చర్యలకు ఉపక్రమించింది. నడ్డా పర్యటన సందర్భంగా భద్రతపరమైన విధులను సరిగా నిర్వర్తించని కారణంగా వారిని కేంద్ర డిప్యుటేషన్‌లో పనిచేయాలంటూ శనివారం ఆదేశాలిచ్చింది. ఈమేరకు పశ్చిమబెంగాల్‌లోని డైమండ్‌ హార్బర్‌ ఎస్పీ భోలానాథ్‌ పాండే, ప్రెసిడెన్సీ రేంజి డీఐజీ ప్రవీణ్‌ త్రిపాఠీ, దక్షిణ బెంగాల్‌ ఏడీజీ రాజీవ్‌ మిశ్రాలపై చర్యలు చేపట్టింది. సాధారణంగా అఖిల భారత సర్వీసు అధికారులను కేంద్ర డిప్యుటేషన్‌కు పిలిస్తే సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారాన్ని తీసుకుంటారు. బెంగాల్‌ ప్రభుత్వాన్ని పట్టించుకోకుండా కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అఖిల భారత సర్వీసు అధికారులకు సంబంధించిన నిబంధనల ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోంశాఖ అధికారి ఒకరు తెలిపారు. దీనిపై టీఎంసీ మండిపడింది. రాష్ట్ర అధికార యంత్రాంగాన్ని, పోలీసులను కేంద్రం బెదిరించేందుకు ప్రయత్నిస్తోందని ఆ పార్టీ ఎంపీ కల్యాణ్‌ బెనర్జీ ధ్వజమెత్తారు. ‘‘ఇక రాష్ట్రం చివరిగా చెప్పేది ఒకటే.. కేంద్రం ఆదేశాలకు తలొగ్గేది లేదు’’ అని విలేకరులతో చెప్పారు. అఖిల భారత సర్వీసు అధికారులను కేంద్ర డెప్యుటేషన్‌ కోసం పంపించడం రాష్ట్రాలకు చెందిన ఐచ్ఛికమని టీఎంసీ ఎంపీ సౌగతరాయ్‌ అన్నారు. పశ్చిమబెంగాల్‌ క్యాడర్‌కు చెందిన ఈ ముగ్గురు అధికారులూ రాష్ట్ర ప్రభుత్వానికి సన్నిహితంగా ఉంటారన్న ప్రచారం ఉంది. వీరిని దిల్లీకి పంపించడానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా లేదని తెలుస్తోంది. అయితే కేంద్ర హోంశాఖ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పాటించక తప్పదని నిబంధనలు చెబుతున్నాయి.

కేంద్ర హోంమంత్రికి మా ప్రభుత్వం జవాబుదారీ కాదు : టీఎంసీ
నడ్డా వాహనశ్రేణిపై దాడి ఘటన నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై వివరణ ఇచ్చేందుకు ఈనెల 14న దిల్లీ రావాలంటూ పశ్చిమబెంగాల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు కేంద్ర హోంశాఖ శుక్రవారం సమన్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై తృణమూల్‌ సీనియర్‌ నేత, లోక్‌సభలో టీఎంసీ చీఫ్‌ విప్‌ కల్యాణ్‌ బెనర్జీ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లాకు శనివారం ఘాటుగా లేఖ రాశారు. ‘‘శాంతిభద్రతల అంశం ఏడో షెడ్యూల్‌ కింద రాష్ట్రాల జాబితాలోనిది. అలాంటప్పుడు ఈ విషయమై వివరణ కోసం ఇద్దరు రాష్ట్ర అధికారులను మీరెలా పిలుస్తారు?’’ అని లేఖలో ప్రశ్నించారు. ‘‘ఇది రాజకీయ ఉద్దేశంతో.. భాజపాకే చెందిన రాజకీయ నేత అయిన మీ మంత్రి అమిత్‌ షా ప్రేరణతో చేసినట్లుగా కనిపిస్తోంది. రాజకీయ ప్రతీకారంతో పశ్చిమబెంగాల్‌ అధికారులను బెదిరించేందుకు ప్రయత్నిస్తున్నారు. శాంతిభద్రతలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శాసనసభకు జవాబుదారీ తప్ప.. మీకు, మీ హోంమంత్రికి కాదు. మీ చర్య ద్వారా చట్టాలను నదిలోకి విసిరేశారు. పశ్చిమబెంగాల్‌లో అత్యవసర పరిస్థితిని విధించేందుకు పరోక్షంగా ప్రయత్నాలు జరుగుతున్నాయనిపిస్తోంది’’ అని కల్యాణ్‌ పేర్కొన్నారు. ఈ లేఖపై భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాస్‌ విజయ్‌వర్గియా స్పందించారు. ఈనెల 10న ఏం జరిగిందో.. నడ్డా వాహనశ్రేణిపై టీఎంసీకి చెందినవారు ఎలా దాడి చేశారో ప్రతి ఒక్కరూ చూశారన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని