18 నుంచి 1400 కేంద్రాల్లో టీకా
close

ప్రధానాంశాలు

18 నుంచి 1400 కేంద్రాల్లో టీకా

పంపిణీకి 1200 ఆసుపత్రుల ఎంపిక
16న గాంధీ ఆసుపత్రి, నార్సింగి ఆరోగ్య కేంద్రంలో ప్రధాని మాటామంతికి ఏర్పాట్లు
ఈనాడు - హైదరాబాద్‌

రాష్ట్రంలో ఈ నెల 18వ తేదీ నుంచి కొవిడ్‌ టీకా పంపిణీ కేంద్రాలను పెంచనున్నారు. ఈనెల 16న టీకాల పంపిణీ ప్రారంభం రోజున 139 కేంద్రాలను ఎంపిక చేయగా.. అందులో ప్రైవేటు ఆసుపత్రుల్లో 40, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 99 కేంద్రాలున్నాయి. తొలిరోజు మొత్తం కేంద్రాల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనివే ఎక్కువ. వీటిలో హైదరాబాద్‌(13), మేడ్చల్‌(11), రంగారెడ్డి(9) జిల్లాల్లో కలుపుకొని 33 టీకా కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఈ నెల 16న ప్రధాని నరేంద్రమోదీ.. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి, రంగారెడ్డి జిల్లా నార్సింగిలోని గ్రామీణ ఆరోగ్య కేంద్రంలోని వైద్యసిబ్బందితో దృశ్యమాధ్యమం ద్వారా నేరుగా మాట్లాడనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 17వ తేదీన టీకాల పంపిణీకి సెలవు. 18న మళ్లీ ప్రక్రియ మొదలవుతుంది. ఈ రోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా 1200 ఆసుపత్రుల్లో 1400 కేంద్రాల ద్వారా టీకాలను అందజేయనున్నారు. గాంధీ, ఉస్మానియా, ఎంజీఎం వరంగల్‌ తదితర పెద్దాసుపత్రుల్లో ఒకటి కంటే ఎక్కువగా.. అంటే సుమారు 4 వరకు కేంద్రాలను పెంచుతారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో 170 కేంద్రాలు ఉంటాయని వైద్యవర్గాలు తెలిపాయి. ప్రధానంగా 100 మందికిపైగా వైద్యసిబ్బంది ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల్లోనే టీకా పంపిణీ కేంద్రాల్ని ఏర్పాటు చేయనున్నారు. 500 మందికి పైగా వైద్యసిబ్బంది ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల్లో కేంద్రాల సంఖ్యను పెంచుతారు.

ఫిబ్రవరి 1 తర్వాత ఇతర కొవిడ్‌ యోధులకు..
వారంలో సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లోనే టీకాలను పంపిణీ చేస్తారు. ఆది, బుధ, శనివారాల్లో, ప్రభుత్వ సెలవు రోజుల్లో పంపిణీ నిలిపేస్తారు. ఈ లెక్కన రాష్ట్రంలో 2.90 లక్షల వైద్యసిబ్బందికి కొవిడ్‌ టీకాలను పంపిణీ చేయడానికి కనీసం 2 వారాల సమయం పడుతుందని వైద్యశాఖ అంచనా వేస్తోంది. ఈ సమయంలోగా టీకా తీసుకోని వైద్యసిబ్బందికి తర్వాత మళ్లీ అవకాశం కల్పిస్తారని వైద్యవర్గాలు తెలిపాయి. పోలీసు, రెవెన్యూ, పురపాలక శాఖలకు చెందిన సుమారు 2 లక్షల మంది సిబ్బందికి ఫిబ్రవరి 1 తర్వాత టీకా తొలిడోసు ఇచ్చే అవకాశాలున్నాయి. వీరికి కూడా టీకా ఇవ్వడానికి 2 వారాల సమయం పడుతుందని వైద్యశాఖ అంచనా వేస్తోంది. ఆ తర్వాతే సుమారు 64 లక్షలున్న 50 ఏళ్లు పైబడినవారికి, సుమారు 6 లక్షలున్న 18-50 ఏళ్ల లోపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకూ టీకాలిచ్చే అవకాశాలున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ఈలోగా ఆయా కేటగిరీలకు చెందిన లబ్ధిదారుల సమాచార సేకరణ మొదలవుతుందని పేర్కొన్నాయి.

పోలియో టీకా పంపిణీ వాయిదా

ఈ నెల 17న నిర్వహించతలపెట్టిన పోలియో టీకా పంపిణీ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. తొలిరోజు(16) టీకా పంపిణీ కార్యక్రమంలో నిమగ్నమయ్యే వైద్యసిబ్బంది మరుసటి రోజు(17న) పోలియో టీకా పంపిణీలో పాల్గొనాల్సి ఉంది. 18న మళ్లీ కొవిడ్‌ టీకా పంపిణీ చేస్తుండటంతో.. ఆ ప్రభావం పనితీరుపై పడుతుందన్న ఉద్దేశంతో కేంద్ర ఆరోగ్యశాఖ పోలియో టీకా పంపిణీని నిలిపేసింది. తిరిగి ఎప్పుడు నిర్వహించేది వెల్లడించలేదు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని