మహావీరుడు మన సంతోష్‌

ప్రధానాంశాలు

మహావీరుడు మన సంతోష్‌

కర్నల్‌ సంతోష్‌కు మహావీర్‌చక్ర అవార్డు
21 ఏళ్ల తర్వాత తెలుగు వీరుడికి ప్రతిష్ఠాత్మక అవార్డు

ఈనాడు, నల్గొండ: భారత్‌ - చైనా సరిహద్దు లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయలో చైనా సైనికుల దాడిని వీరోచితంగా తిప్పికొడుతూ అమరుడైన తెలుగుతేజం కర్నల్‌ బిక్కుమళ్ల సంతోష్‌బాబుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక మహావీర్‌ చక్ర పురస్కారాన్ని ప్రకటించింది. ఆర్మీలో ‘పరమ్‌వీర్‌ చక్ర’ తర్వాత ఇదే రెండో అత్యున్నత స్థాయి పురస్కారం కావడం విశేషం. సంతోష్‌బాబు పేరు చిరస్థాయిలో నిలిచిపోయేలా ఇప్పటికే దిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకంపై చెక్కగా.. తాజాగా కేంద్రం ఈ అవార్డు ప్రకటించింది. 16వ బిహార్‌ రెజిమెంట్‌లో విధులు నిర్వర్తించిన సంతోష్‌బాబు స్వస్థలం తెలంగాణలోని సూర్యాపేట. ఆయనకు తండ్రి ఉపేందర్‌, తల్లి మంజులతో పాటు భార్య సంతోషి, కుమార్తె అభిజ్ఞ (9), కొడుకు అనిరుధ్‌(4) ఉన్నారు. సంతోష్‌బాబు మరణం అనంతరం ఆయన భార్య సంతోషికి తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ శాఖలో ఉద్యోగం ఇచ్చింది. ఆమె ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా అసిస్టెంట్‌ ట్రైనీ కలెక్టరుగా పనిచేస్తున్నారు. సంతోష్‌ ఆరో తరగతి నుంచి విజయనగరం జిల్లా కోరుకొండ సైనిక్‌ స్కూల్‌లో చదువుకున్నారు. 2004లో లెఫ్టినెంట్‌ హోదాలో జమ్ములో సైన్యంలో చేరారు.  శ్రీనగర్‌, కుప్వారా, లద్దాఖ్‌లలో పనిచేశారు. అంచెలంచెలుగా ఎదిగి 15 ఏళ్ల సర్వీసులో నాలుగు పదోన్నతులతో కర్నల్‌ హోదాలో అమరుడయ్యారు. కొన్నాళ్లు కాంగోలో మనదేశం తరఫున విధులు నిర్వహించిన ఆయనకు 37 ఏళ్ల వయసులోనే కర్నల్‌ హోదా రావడం విశేషం.
రాష్ట్ర ప్రభుత్వం రూ. 1.25 కోట్లు
గ్యాలెంట్రీ అవార్డులు ప్రకటించిన వారికి తెలంగాణ ప్రభుత్వం తనవంతుగా నగదు పురస్కారాలు అందజేస్తోంది. అలా రూ. 1.25 కోట్ల నగదును రాష్ట్ర ప్రభుత్వం సంతోష్‌బాబు కుటుంబానికి ఇవ్వనుంది.
చాన్నాళ్లకు తెలుగు వీరుడికి పురస్కారం
రెండు దశాబ్దాల సుదీర్ఘ విరామం అనంతరం తెలుగు వీరుడికి ‘మహావీర్‌ చక్ర’ అవార్డు దక్కింది. గతంలో 1999 జూన్‌ 28న కార్గిల్‌ యుద్ధంలో శత్రువులకు ఎదురొడ్డి నిలిచి అమరుడైన హైదరాబాద్‌కు చెందిన పద్మపాణి ఆచార్యకు కేంద్రం 2000 సంవత్సరంలో అవార్డును ప్రకటించింది.

గర్వంగా ఉంది

- బిక్కుమళ్ల సంతోషి, కర్నల్‌ సంతోష్‌బాబు భార్య
అత్యున్నత స్థాయి పురస్కారం రావడం ఆనందంగా ఉన్నా.. ఆయన లేని లోటు పూడ్చలేనిది. ఈ అవార్డు రావడానికి కారణమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు.. గత ఏడు నెలలుగా అండగా ఉంటున్న ప్రజలందరికీ నా కృతజ్ఞతలు.

నిరుత్సాహపరిచారు

- సంతోష్‌బాబు తల్లిదండ్రులు ఉపేందర్‌, మంజుల
సంతోష్‌బాబు చేసిన త్యాగానికి ప్రభుత్వం ‘మహవీర్‌ చక్ర’ ప్రకటించడం నిరుత్సాహపరిచింది. తుపాకులైనా లేకుండా ఎంతో ధైర్య సాహసాలతో శత్రు దేశానికి చెందిన 43 మంది సైనికులను తన బృందంతో కలిసి మట్టుపెట్టారు. ఏ సైనికాధికారీ ఇలాంటి ధైర్య సాహసాలు చూపలేదు. అలాంటి మా కుమారుడికి ‘పరమ్‌వీర్‌ చక్ర’ ఇవ్వకపోవడాన్ని మేము అవమానంగానే భావిస్తున్నాం.

తెలుగువాడికి దక్కడం గర్వంగా ఉంది

- శ్రీనేష్‌కుమార్‌ నోరి, ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి, హైదరాబాద్‌  
శత్రువులతో వీరోచితంగా పోరాడి అసువులు బాసిన కర్నల్‌కు ప్రతిష్ఠాత్మక అవార్డు రావడం ఆనందంగా ఉంది.

మరో ఐదుగురు గల్వాన్‌ యోధులకు ‘వీర్‌ చక్ర’

ద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయలో చైనా సైనికుల దురాగతాన్ని వీరోచితంగా తిప్పికొట్టి, దేశ సరిహద్దులను రక్షించిన కర్నల్‌ సంతోష్‌బాబు సైనిక బృందంలోని ఐదుగురు జవాన్లకు ‘వీర్‌ చక్ర’ను ప్రభుత్వం ప్రకటించింది. వీరిలో నాయబ్‌ సుబేదార్‌ నుదురామ్‌ సొరెన్‌, హవల్దార్‌ కె.పళని, నాయక్‌ దీపక్‌ సింగ్‌, సిపాయి గుర్తేజ్‌ సింగ్‌, హవల్దార్‌ తేజీందర్‌ సింగ్‌ ఉన్నారు. తేజీందర్‌ మినహా మిగతా నలుగురికీ మరణానంతరం ఈ పురస్కారం దక్కనుంది.  
లద్దాఖ్‌లో స్మారకం
గల్వాన్‌ వీరులను స్మరించుకుంటూ భారత సైన్యం ఇప్పటికే తూర్పు లద్దాఖ్‌లోని ‘పోస్ట్‌ 120’ వద్ద ‘గ్యాలంట్స్‌ ఆఫ్‌ గల్వాన్‌’ పేరుతో ఒక స్మారకాన్ని నిర్మించింది. చైనా సైనికులను ఆ ప్రాంతం నుంచి తొలగించడానికి సంతోష్‌ బాబు నేతృత్వంలోని బృందం ‘ఆపరేషన్‌ స్నో లెపర్డ్‌’ పేరుతో సాగించిన పోరాటం గురించి దానిపై లిఖించారు.
సుబేదార్‌ సంజీవ్‌ కుమార్‌కు కీర్తి చక్ర
గత ఏడాది ఏప్రిల్‌లో జమ్మూ-కశ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరాడుతూ వీరమరణం పొందిన ప్రత్యేక బలగాల కమాండో సుబేదార్‌ సంజీవ్‌ కుమార్‌కు మరణానంతరం కీర్తి చక్రను ప్రభుత్వం ప్రకటించింది.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని