సగం మందికి కరోనా వచ్చిపోయింది

ప్రధానాంశాలు

సగం మందికి కరోనా వచ్చిపోయింది

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరంలో సగానికిపైగా జనాభాకు కరోనా వచ్చిపోయిందని.. 54 శాతం మందిలో కొవిడ్‌ ప్రతిరక్షకాలు (యాంటీబాడీలు) ఉత్పత్తి అయినట్లు గుర్తించామని కేంద్ర పరిశోధన సంస్థ సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) ప్రకటించింది. వారిలో దాదాపు 75 శాతం మందికి కరోనా వచ్చిందనే విషయం కూడా తెలియదని.. ఎలాంటి లక్షణాలు లేకుండానే వైరస్‌ వచ్చి పోయిందని వెల్లడించింది. రాజధాని పరిధిలో సీసీఎంబీ, జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌), భారత్‌ బయోటెక్‌ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సీరో అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడైనట్లు సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా వెల్లడించారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు నాలుగు సార్లు జీహెచ్‌ఎంసీ పరిధిలో ఈ సీరో అధ్యయనం నిర్వహించామన్నారు. ఈసారి అత్యధికంగా 150 వార్డులకు గాను 30 వార్డుల నుంచి 9 వేల మందితో అతిపెద్ద సమూహ అధ్యయనం నిర్వహించినట్లు తెలిపారు. వైరస్‌ ఇంకా మన చుట్టూనే ఉందని, నిర్లక్ష్యం చేస్తే లెక్కలన్నీ మారే అవకాశముందని ఆయన హెచ్చరించారు. నగరంలో సర్వే నిర్వహించేందుకు ఎన్‌ఐఎన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ హేమలత, భారత్‌ బయోటెక్‌ ఛైర్మన్‌, ఎండీ కృష్ణ ఎల్ల సానుకూలంగా స్పందించి సహకరించడంతోనే అతి తక్కువ సమయంలో ఇంత పెద్ద సర్వే సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఐఎన్‌ సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ ఆవుల లక్ష్మయ్య, సీసీఎంబీ అటల్‌ ఇంక్యుబేషన్‌ కేంద్రం సీఈవో మధుసూదన్‌రావు, భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వి కృష్ణమోహన్‌ పాల్గొన్నారు.

రీ-ఇన్‌ఫెక్షన్‌ ఉండటం లేదు
నగరంలో ఇప్పటికే కరోనా సోకి కోలుకున్న వారిలో రీఇన్‌ఫెక్షన్‌ కనిపించడం లేదని రాకేశ్‌ మిశ్రా తెలిపారు. దేశంలోని ఇతర ప్రాంతాలతో పోల్చితే ఇక్కడ వైరస్‌ విస్తృతి, తీవ్రత రెండూ తక్కువగా ఉన్నాయన్నారు. దాదాపు 80 శాతం మందికి తట్టుకునే సామర్థ్యం వచ్చిందన్నారు. ప్రస్తుతం ఉన్న యాంటీబాడీల శాతం టీకాలతో రెట్టింపు అయ్యే అవకాశముందని రాకేశ్‌ మిశ్రా తెలిపారు.

ఎలా చేశారు..? ఏం తేలింది..?
* జనవరి మొదటి వారం నుంచి రెండు దఫాలుగా సీసీఎంబీ, జాతీయ పోషకాహార సంస్థ, భారత్‌ బయోటెక్‌ సంస్థలు ఈ అధ్యయనం చేశాయి. 15 బృందాలకు చెందిన 75 మంది సిబ్బంది ఇందులో పాల్గొన్నారు.
* 10 -  90 ఏళ్ల వయసున్న వారి నుంచి శాంపిళ్లను సేకరించి పరీక్షించారు.
* కొన్ని వార్డుల్లో అత్యధికంగా 70 శాతం, అత్యల్పంగా 30 శాతం మందిలో యాంటీబాడీల ఉత్పత్తి ఉంది.
* చిన్న గదుల్లో ఉంటున్న వారిలో ఎక్కువ మందికి, విశాల ప్రాంతాల్లో ఉంటున్న వారిలో తక్కువ మందికి వైరస్‌ సోకినట్లు తేలింది.
* కుటుంబాల ద్వారా సోకిన వారిలో 78 శాతం మందికి, బయట సమూహాల ద్వారా సోకిన వారిలో 68 శాతం మందిలో ఈ ప్రతిరక్షకాలు సమృద్ధిగా ఉన్నాయి.
* మహిళల్లో 56 శాతం మందిలో యాంటీబాడీలు ఉండగా.. పురుషుల్లో 53 శాతం మందిలో ఉన్నాయి.
* 70 ఏళ్ల వయసు పైబడిన వారిలో 49 శాతం మాత్రమే యాంటీబాడీలున్నట్లు తేలింది.

ఎక్కువ వార్డులో ఒకేలా...

తేడాది మే నెలలో నిర్వహించిన అధ్యయనంలో 0.25 శాతం మందిలో మాత్రమే యాంటీబాడీలు ఉండగా, ఆగస్టు నెలలో చేసిన అధ్యయనంలో 12.5 శాతం మందిలో యాంటీబాడీలు ఉత్పత్తి అయినట్లు తేలింది. ఈసారి అత్యధికంగా 54 శాతం మందికి పెరిగింది. దాదాపు ఎక్కువ వార్డుల్లో ఒకే రకంగా వ్యాప్తి కనిపించింది.

- డాక్టర్‌ లక్ష్మయ్య, ఎన్‌ఐఎన్‌


తీవ్రత తెలుసుకునేందుకే..

వైరస్‌ తీవ్రత, భవిష్యత్తు పరిణామాల్ని తెలుసుకునేందుకు ఇలాంటి అధ్యయనం అవసరం ఉంది. అందుకే సంస్థ ఛైర్మన్‌ డాక్టర్‌ కృష్ణ ఎల్లా ఈ సర్వేలో భాగమయ్యేందుకు అంగీకరించారు. సీసీఎంబీ, ఎన్‌ఐఎన్‌తో కలిసి తక్కువ కాలంలోనే ప్రయోజనకర అధ్యయనం తీసుకురాగలిగాం.

- డాక్టర్‌ కృష్ణమోహన్‌, భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని