close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
టెన్త్‌ పరీక్షల రద్దు

ఇంటర్‌ ‘ప్రథమ’ విద్యార్థులు ప్రమోట్‌
రెండో సంవత్సరానివి వాయిదా
ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ ఉండదు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రద్దయ్యాయి. ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థుల్ని పరీక్షలు లేకుండానే రెండో ఏడాదికి ప్రమోట్‌ చేస్తారు. రెండో ఏడాది పరీక్షలను వాయిదావేశారు. ఈ మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ గురువారం ఉదయం ఇంటర్‌బోర్డు కార్యదర్శి జలీల్‌, ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు సత్యనారాయణరెడ్డి తదితరులతో సమావేశమై చర్చించారు.
ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల నేపథ్యంలో టెన్త్‌ పరీక్షల రద్దు తదితర అంశాలపై చిత్రా రామచంద్రన్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

5.21 లక్షల మంది ‘పది’ విద్యార్థుల పాస్‌
గత ఏడాది మాదిరిగానే వరుసగా రెండోసారి కూడా పదో తరగతి పరీక్షలు రద్దు అయ్యాయి. ఫలితంగా మే 17వ తేదీ నుంచి జరగాల్సిన పరీక్షలకు రుసుం చెల్లించిన 5.21 లక్షల మంది ఉత్తీర్ణులైనట్లే. ఫలితాల ప్రకటనకు తగిన నిష్పాక్షిక విధానం రూపొందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం నిర్ణయించే విధానంలో వచ్చిన గ్రేడ్లపై విద్యార్థులు సంతృప్తి చెందకుంటే భవిష్యత్తులో పరిస్థితులు అనుకూలించినప్పుడు పరీక్షలు నిర్వహిస్తామని, వాటికి హాజరుకావొచ్చని పేర్కొంది.

ఇంటర్‌ పరీక్షలపై...
*  ఇంటర్‌ తొలి సంవత్సరం విద్యార్థులను పరీక్షలు లేకుండానే ద్వితీయ సంవత్సరానికి ప్రమోట్‌ చేస్తారు. పరిస్థితులు అనుకూలించినప్పుడు పరీక్షల తేదీని ప్రకటించి వాటిని నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది.
*  ద్వితీయ సంవత్సరం పరీక్షల్ని వాయిదావేశారు. జూన్‌ మొదటి వారంలో సమీక్షించి, పరీక్షల ప్రారంభానికి 15 రోజుల ముందుగా తేదీలు ప్రకటిస్తారు.
*  ప్రస్తుతం రెండో సంవత్సరంలో ఉన్న విద్యార్థులకు బ్యాక్‌లాగ్‌లు (ప్రథమ సంవత్సరంలో తప్పినవి) ఉంటే వాటికి కనీస మార్కులు ఇచ్చి పాస్‌ చేస్తారు. ఇలాంటి వారు 1,99,019 మంది ఉన్నారు.
*  ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ఇప్పటిదాకా ర్యాంకు నిర్ణయించేవారు. ఈసారికి ఆ వెయిటేజీ ఉండదు. ఇంటర్‌ మార్కులను పరిగణనలోకి తీసుకోరు. కేవలం ఎంసెట్‌లో 160కి వచ్చిన మార్కుల ఆధారంగానే ర్యాంకులు కేటాయిస్తారు.

సాయం కోసం 2.06 లక్షల మంది ‘ప్రైవేట్‌’ అర్జీలు
ఈనాడు, హైదరాబాద్‌: ఆర్థిక సాయం కోరుతూ గురువారం రాత్రి 8 గంటల వరకు మొత్తం 2,06,345 మంది ప్రైవేట్‌ ఉపాధ్యాయులు, సిబ్బంది పాఠశాల విద్యాశాఖకు దరఖాస్తు చేశారు. వారిలో 1,53,525 మంది ఉపాధ్యాయులు, 52,820 మంది బోధనేతర సిబ్బంది ఉన్నారు.

ప్రమోట్‌ అంటే ఏమిటో?

ఇంటర్‌ పరీక్షలకు సంబంధించి ప్రభుత్వ తాజా ప్రకటనలో స్పష్టత లోపించింది. పరీక్షలు లేకుండానే ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులను ద్వితీయ సంవత్సరానికి ప్రమోట్‌ చేస్తున్నట్లు ప్రకటించిన సర్కారు భవిష్యత్తులో పరిస్థితులు అనుకూలిస్తే పరీక్షలు పెడతామని తెలిపింది. మామూలుగా అయితే మొదటి సంవత్సరం విద్యార్థులు.. అన్ని సబ్జెక్టుల్లో ఫెయిలైనా లేక అసలు పరీక్షలకు హాజరు కాకపోయినా ద్వితీయ సంవత్సరం చదవడానికి ఆటంకం ఉండదు. ఈ పరిస్థితుల్లో ప్రథమ సంవత్సరం విద్యార్థులను ప్రమోట్‌ చేస్తున్నట్టు ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనతో గందరగోళం నెలకొంది.

ప్రయోగ పరీక్షలు కూడా వాయిదా?
ప్రయోగ పరీక్షలను మే 29వ తేదీ నుంచి జూన్‌ 7వ తేదీ వరకు నిర్వహిస్తామని ఇటీవల ఇంటర్‌బోర్డు ప్రకటించింది. తాజాగా రెండో ఏడాది వార్షిక పరీక్షలను వాయిదా వేయడంతో మే 29 నుంచి అయినా జరుగుతాయా అన్నది అనుమానమే. దీనిపై ఇంటర్‌బోర్డు ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

పదిలో గ్రేడింగ్‌కు ఎఫ్‌ఏ-1 కీలకం!
టెన్త్‌లో గ్రేడింగ్‌కు నిష్పాక్షిక విధానం తెస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అంటే అంతర్గత పరీక్షలుగా పిలిచే ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌-1(ఎఫ్‌ఏ-1) ఇప్పటికే పూర్తయినందున వాటి ఆధారంగా గ్రేడ్‌లు ఇవ్వొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘‘ఒక్కో సబ్జెక్టులో అంతర్గత పరీక్షలకు 20 మార్కులుంటాయి. ఉదాహరణకు 20కి 18 మార్కులు వస్తే దాన్ని 100కి 90గా లెక్కించి గ్రేడ్‌లు ఇవ్వొచ్చు’’ అని విశ్లేషించారు.



ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు