దార్శనికుడు.. న్యాయప్రదాత

ప్రధానాంశాలు

దార్శనికుడు.. న్యాయప్రదాత

భారత 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్‌.వి.రమణ
సవాళ్లను స్వీకరిస్తూ నేడు పదవీ ప్రమాణం

ఈనాడు, దిల్లీ: దేశంతో పాటు, న్యాయవ్యవస్థ మునుపెన్నడూ లేనివిధంగా ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించే బాధ్యతలను స్వీకరిస్తూ.. తెలుగు తేజం జస్టిస్‌ నూతలపాటి వెంకటరమణ శనివారం 48వ భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేయనున్నారు. కరోనా మహమ్మారి ఉద్ధృతి నేపథ్యంలో.. రాష్ట్రపతి భవన్‌లో ఉదయం 11 గంటలకు నిరాడంబరంగా జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆయన చేత పదవీ ప్రమాణం చేయించనున్నారు. ఊహించని వేగంతో కరోనా విస్తరిస్తున్న కారణంగా ఓవైపు కోర్టులు భౌతికంగా నడవని స్థితి.. మరోవైపు జిల్లాస్థాయి నుంచి ఉన్నత న్యాయస్థానాల వరకు భారీగా పెండింగ్‌ కేసులు పెరిగిపోయిన పరిస్థితుల మధ్య ఆయన బరువైన బాధ్యతలను భుజస్కంధాలపై ఎత్తుకుంటున్నారు. కరోనా రెండో ఉద్ధృతి సమయంలో న్యాయవ్యవస్థలు ఆగకుండా కొనసాగిస్తూ న్యాయం అందించడం కొత్త ప్రధాన న్యాయమూర్తికి పెద్ద సవాల్‌. తనకన్నా ముందున్న ప్రధాన న్యాయమూర్తులకు మాదిరే ఆయనకూ పెండింగ్‌ కేసులు, న్యాయమూర్తుల పోస్టుల ఖాళీలు, సిబ్బంది కొరత, భవనాలు, మౌలిక వసతుల లోటు వారసత్వ ఆస్తిగా వస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ వీటన్నింటినీ సమకూర్చుకోవాల్సిన బృహత్తర బాధ్యత ఇప్పుడు ఆయనపై పడింది. మహమ్మారి కారణంగా గతేడాది దేశవ్యాప్తంగా న్యాయస్థానాలు పనిచేయక పోవడంతో కేసులు కొండల్లా పెరిగిపోయాయి. ఈ కొండను విజయవంతంగా కరిగించడం జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ముందున్న మరో సవాల్‌. న్యాయవ్యవస్థలో మౌలికవసతులు విస్తరించడం ఇంకో సవాల్‌. ఈ విషయాన్ని ముందుగా గ్రహించే ఆయన ఇటీవల గోవాలో బాంబే హైకోర్టు భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ నేషనల్‌ జ్యుడీషియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ ఏర్పాటును ప్రతిపాదించారు. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని పిలుపునిచ్చారు.

వాస్తవికవాది..
జస్టిస్‌ ఎన్‌.వి.రమణకు వాస్తవికవాదిగా పేరుంది. ప్రతి అంశాన్నీ వాస్తవిక కోణంలో చూసి, అర్థం చేసుకొని పరిష్కరించే తత్వమే ఆయన బలమని న్యాయ కోవిదులు చెబుతుంటారు. ఆయన ఇప్పుడు న్యాయమూర్తులు, సిబ్బంది ఆరోగ్యంతోపాటు, న్యాయవాదుల ఆర్థిక పరిస్థితులను సమతౌల్యం చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. కోర్టులు సరిగా నడవక యువ న్యాయవాదులు ఆర్థికంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను సానుభూతితో పరిష్కరించాల్సిన బృహత్కార్యం ఆయన భుజాలపై ఉంది. వ్యవస్థ ఆగకుండా సాగాలంటే కిందినుంచి పైస్థాయివరకు డిజిటలీకరణను మరింత వేగంగా విస్తరించాల్సిన అవసరం ఉంది. సంక్షోభ సమయంలో ప్రపంచంలో అతిపెద్ద న్యాయవ్యవస్థకు నేతృత్వం వహించబోతున్న జస్టిస్‌ ఎన్‌.వి.రమణ న్యాయవిద్వత్తును ప్రదర్శిస్తూనే వ్యవస్థల మధ్య సున్నితమైన సమతౌల్యాన్ని పాటిస్తూ ముందుకెళ్లాల్సి ఉందని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుత మహమ్మారి కాలంలో ప్రజలను రక్షించి, వారి ప్రాణాలు కాపాడటమే ప్రధాన న్యాయమూర్తి ప్రధాన బాధ్యత అని మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ వెంకటాచలయ్య పేర్కొన్నారు. డిజిటల్‌ జస్టిస్‌ విధానం అమలవుతున్న అత్యంత క్లిష్టమైన సమయంలో జస్టిస్‌ రమణ బాధ్యతలు స్వీకరిస్తున్నారని, ఈ విధానాన్ని మరింత సమర్థŸంగా ముందుకు తీసుకెళ్లాలని ప్రొఫెసర్‌ ఉపేంద్ర భక్షి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లన్నింటినీ ఎదుర్కొనే సమాయత్తత జస్టిస్‌ రమణ సొంతమని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాతో సహా పలువురు న్యాయకోవిదులు వివిధ సమావేశాలు, చర్చావేదికల సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఇన్ని సమస్యలు, సవాళ్ల మధ్య బాధ్యతలు చేపడుతున్న ఆయన కేసుల విచారణ, తీర్పులు, పేదలకు న్యాయసాయం అందించడంతోపాటు పరిపాలనపైనా అధికంగా దృష్టిసారించి అన్నింటినీ సరిదిద్దాల్సిన పరిస్థితి నెలకొంది.

ఖాళీల భర్తీకి కృషి చేయాలి..

నేను పదేళ్లుగా జస్టిస్‌ రమణను సుప్రీంకోర్టు, దిల్లీ హైకోర్టుల్లో చూస్తున్నాను. ఆయన చాలా వాస్తవికంగా, గొప్ప వివేకవంతంగా వ్యవహరించే న్యాయమూర్తి. తనకంటే ముందు కుటుంబంలో న్యాయవాదులెవరూ లేకపోయినా చిన్న గ్రామం నుంచి హైదరాబాద్‌కు వచ్చి న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించారు. ఇది ఆయన పేదల సమస్యలను లోతుగా అర్థం చేసుకోవడానికి దోహదపడింది. అదే ఆయన్ను అందరికీ న్యాయం అందుబాటులో ఉండాలన్న దిశగా నడిపించగలిగింది. కిందిస్థాయి కోర్టుల్లో పేదలకు న్యాయం అందుబాటులో ఉండటం చాలా ముఖ్యం. కొవిడ్‌కు ముందువరకూ కేసులను భౌతికంగా దాఖలు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు మహమ్మారి కొన్ని దారులు చూపింది. ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న వ్యక్తి టీం కెప్టెన్‌గా వ్యవహరించాలి. బృందాన్ని తనతోపాటు తీసుకెళ్లాలి. జస్టిస్‌ బోబ్డే నిరంతరం సున్నితంగా వ్యవహరిస్తూ మధ్యేమార్గాన్ని అనుసరించారు. ఆయన కాలంలో న్యాయమూర్తుల నియామకాలు జరగలేదు. దానివల్ల పెండింగ్‌ కేసులు పెరిగిపోయాయి. సుప్రీంకోర్టులోని 31 న్యాయమూర్తుల పోస్టుల్లో 5 ఖాళీగా ఉన్నాయి. హైకోర్టుల్లో 300 పోస్టులకుపైగా ఖాళీగా ఉన్నాయి. అందువల్ల నూతన ప్రధాన న్యాయమూర్తి ఈ నియామక ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలి. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వంతో స్నేహపూర్వకమైన సున్నితమైన సంబంధాలు కొనసాగించాలి. స్వతంత్రంగా ఉంటూనే న్యాయమూర్తుల నియామకాన్ని సమన్వయంతో చేపట్టాలి. జస్టిస్‌ రమణకున్న దార్శనికత వల్ల దీన్ని ముందుకు తీసుకెళ్తారని భావిస్తున్నాను. ఆయన ముందున్న అత్యంత ముఖ్యమైన ప్రాధాన్యం ఇదే. ప్రభుత్వం, ఇతర భాగస్వామ్య పక్షాలతో మంచి సంప్రదింపులు జరిపి సమస్యలు పరిష్కరించాలి.

- ముకుల్‌ రోహత్గి, మాజీ అటార్నీ జనరల్‌

సమస్యల పరిష్కర్త..

జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ప్రాక్టికల్‌గా.. ఫలితాల ఆధారంగా నడుచుకొనే వ్యక్తి. ప్రతి సమస్యకూ పరిష్కారం కనుగొనాలన్నదే ఆయన ప్రధాన ఉద్దేశం. దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన అనుభవం ఉండటం ఆయనకు పెద్ద బోనస్‌. మరోవైపు న్యాయస్థానంలో ఆయన వ్యవహరించే తీరు, ప్రవర్తన చాలా హుందాగా ఉంటుంది. ఆయనున్న కోర్టులో చుట్టుపక్కల వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఇటీవల తలెత్తిన వివాద సమయంలో ఆయన అత్యంత గౌరవపూర్వకంగా నిశ్శబ్దం పాటించారు. దానివల్ల ఆయన పట్ల విపరీతమైన గౌరవం పెరిగింది. కొలీజియంలోనూ ఆయన సహచరులుగా అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు. అందరూ సంస్కరణాభిలాషులే. స్వతఃసిద్ధంగా అది ఆయనకు కలిసొచ్చే అంశం. న్యాయమూర్తుల ఖాళీల భర్తీయే అన్ని సమస్యలకు పరిష్కారం కాదు. స్వతంత్ర దేశంలో ఎప్పుడు చూసినా హైకోర్టుల్లో 1/3వ వంతు పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. కొలీజియం ఎన్నిపేర్లు సిఫార్సు చేసినా అందులో కొన్ని వెనక్కి వస్తూనే ఉంటాయి. కొలీజియం రెండోసారి తిప్పి పంపిన తర్వాత కూడా న్యాయమూర్తుల పోస్టులు ఎందుకు భర్తీ కావడం లేదో చూడాలి. మన న్యాయవ్యవస్థకున్న సమీక్షాధికారం వల్ల కొన్నిసార్లు ప్రధాన న్యాయమూర్తి అధికార కేంద్రంగా మారుతున్నారు. ఈ సవాల్‌ను ఎదుర్కొవాలంటే ఆయన అధికారాలను వికేంద్రీకరించాలి. బ్యాటన్‌ సిస్టం ఏర్పాటు చేసి దాన్ని కొలీజియంలో ఒకరి తర్వాత ఒకరికి చేరేలా చూడాలి. మధ్యంతర దిద్దుబాటు చర్యలే కాకుండా నాలుగైదు అంశాలతో ఎజెండా రూపొందించుకొని అయిదేళ్లలో దాన్ని అమలు చేయడానికి శ్రీకారం చుట్టాలి. కొలీజియం సభ్యులందరి సమ్మతితో దాన్ని మొదలుపెడితే మూడేళ్లలోనే ఫలితాలు కనిపిస్తాయి.

- అభిషేక్‌ మను సింఘ్వీ, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది

మహిళలు, పేదల పక్షపాతి..

భారత ప్రధాన న్యాయమూర్తి అంటే ప్రపంచంలో శక్తిమంతమైన న్యాయమూర్తి అని అర్థం. సుప్రీంకోర్టు కేవలం రాజ్యాంగ వ్యవహారాలు చూసే కోర్టు ఒక్కటే కాదు. కేవలం చట్టాలనే కాకుండా రాజ్యాంగ సవరణలను కూడా కొట్టేసే శక్తి దానికుంది. స్వతఃసిద్ధంగా ప్రధాన న్యాయమూర్తికున్న అధికారాలు ఇతర న్యాయమూర్తుల కంటే భిన్నం. ఆయన బెంచ్‌లను ఏర్పాటు చేయొచ్చు. కేసులను కేటాయించవచ్చు. అవే ఆ పదవిని ప్రపంచంలో అతి శక్తిమంతమైనదిగా మార్చాయి. ఇంతటి శక్తిమంతమైన పదవికి మిగతావారి కంటే భిన్నంగా ఏం అర్హతలున్నాయన్న అంశంపై నాకు నాలుగు ఆలోచనలున్నాయి. ఆ నాలుగింటికీ ఆయన సరిగ్గా సరిపోతారని భావిస్తున్నాను. న్యాయస్థానాలను ఏ గమ్యానికి తీసుకెళ్లాలన్న స్పష్టమైన ఆలోచన ప్రధాన న్యాయమూర్తికి ఉండాలన్నది నా భావన. ఆయన వివిధ సందర్భాల్లో మాట్లాడిన మాటలు, ఇచ్చిన తీర్పుల్లో అది స్పష్టంగా కనిపించింది. ఆయన మహిళలు, పేదల పక్షపాతి అని.. అట్టడుగున ఉన్నవారికి సులభంగా న్యాయం అందాలని కోరుకుంటారని.. ఆయన తీర్పులే స్పష్టం చేస్తున్నాయి. సీజేఐగా 16 నెలల సమయం ఉంది కాబట్టి తనదైన ప్రభావం చూపడానికి దండిగా అవకాశాలున్నాయి.

- రయాన్‌ కరంజెవాలా, సీనియర్‌ న్యాయవాది


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని