close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఏపీలో కర్ఫ్యూ.. బస్సుల నిలిపివేత

రెండు రాష్ట్రాల మధ్య 2,500 వరకు అంతర్రాష్ట్ర సర్వీసులకు బ్రేక్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీపై ఆంధ్రప్రదేశ్‌ కర్ఫ్యూ పిడుగు పడింది. ఆ రాష్ట్రంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం అయిదు గంటల వరకు అమల్లో ఉంటుంది. బుధవారం నుంచి కర్ఫ్యూ సమయంలో ఆర్టీసీ బస్సులను కూడా నిలిపివేస్తున్నట్లు ఆ ప్రభుత్వం ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే పడిపోయిన తెలంగాణ ఆర్టీసీ ఆదాయం మరింత తగ్గనుంది. తెలంగాణ సర్వీసులను కూడా కర్ఫ్యూ సమయంలో ఆపేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించటంతో ఇక్కడి నుంచి వెళ్లిన బస్సులు రాత్రికి తిరిగి వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఉదయం వేళలో సర్వీసులు నడిపినా ప్రయోజనం ఉండదని నిర్ణయించి బస్సులను నిలిపివేయాలని ఇక్కడి ఆర్టీసీ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌కు సరిహద్దున ఉన్న నల్గొండ, ఖమ్మం జిల్లాలకు సంబంధించి 20 నుంచి 30 బస్సులు మధ్యాహ్నం వరకు నడపాలని అధికారులు భావిస్తున్నారు. ఆక్యుపెన్సీ పరిశీలించి సర్వీసుల సంఖ్య హెచ్చుతగ్గులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కరోనా తొలిదశ తర్వాత ప్రయాణికుల సంఖ్యతోపాటు ఆదాయం కూడా పెరిగింది. ఆదాయం పుంజుకుంటున్న తరుణంలో కొవిడ్‌ రెండో దశతో పరిస్థితి మళ్లీ మొదటికి వస్తోంది. రోజువారీగా సుమారు రూ.11.5 కోట్లు వచ్చే ఆదాయం ప్రస్తుతం రూ.5 కోట్లకు పడిపోయింది. ఆక్యుపెన్సీ కూడా 40 శాతం లోపే ఉంది.
డిపోలకు, షెడ్లకు పరిమితం
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నిర్ణయంతో రెండు రాష్ట్రాల మధ్య సుమారు 2,500 వరకు బస్సులకు బ్రేకులు పడినట్లు అయింది. తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీవి, ప్రయివేటువి రాత్రిళ్లు పెద్ద సంఖ్యలో తిరుగుతాయి. మధ్యాహ్నం నుంచి కూడా నిలిపివేయాలని నిర్ణయించటంతో బస్సులు డిపోలకు, షెడ్లకు పరిమితం కానున్నాయి. రెండు రాష్ట్రాల ఆర్టీసీలు కలిపి రోజూ 1,400 నుంచి 1,500 వరకు నడుపుతున్నాయి. మరో తొమ్మిది వందల నుంచి వెయ్యి వరకు ప్రయివేటువి ఉంటాయి. ‘‘కరోనా రెండో ఉద్ధృతితో ప్రయాణికుల సంఖ్య కొంత మేరకు తగ్గింది. రానున్న రోజుల్లో మరింత తగ్గే ప్రమాదం ఉందనటంలో సందేహం లేదు’’ అని ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సునీల్‌శర్మ మంగళవారం ‘ఈనాడు’తో అన్నారు. రాత్రి సర్వీసులు నిలిపివేయటం ద్వారా రోజువారీగా రూ.60 లక్షల నుంచి రూ.80 లక్షల ఆదాయం తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు