వన్నూరమ్మా.. మీ సంకల్పం గొప్పది
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వన్నూరమ్మా.. మీ సంకల్పం గొప్పది

అనంత జిల్లా మహిళా రైతుకు ప్రధాని మోదీ ప్రశంస

ఈనాడు, దిల్లీ: ‘బంజరు భూమిని.. బంగారు భూమిగా మార్చిన ఈ సంకల్పం గొప్పది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగంలో స్ఫూర్తి నింపుతుంది’ అని అనంతపురం జిల్లాకు చెందిన మహిళా రైతు వన్నూరమ్మను ప్రధాని మోదీ అభినందించారు. 8వ విడత ‘రైతు సమ్మాన్‌ నిధి’ విడుదల కార్యక్రమం సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్న వివిధ రాష్ట్రాల రైతులతో ప్రధాని మాట్లాడారు. కళ్యాణదుర్గం మండలం దురదకుంట గ్రామానికి చెందిన వన్నూరమ్మ అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ఆమె చెప్పిన తీరును ప్రశంసించారు.
ప్రధాని మోదీ: మీరు ఉత్సాహం, కష్టంతో బంజరు భూమిలో బంగారు పంటలు పండించినట్లు నాకు చెప్పారు. అది ఎలా సాధ్యమైందో చెప్పండి. మీ అనుభవం దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఉపయోగపడుతుంది.  
వన్నూరమ్మ: నాకు రాష్ట్ర ప్రభుత్వం 4 ఎకరాల భూమి ఇచ్చింది. పదేళ్లుగా బంజరుగా ఉన్న ఆ భూమిని వ్యవసాయ యోగ్యంగా మార్చుకున్నాను. అందులో రెండెకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేశాను. ఎకరాలో నవధాన్యాలు, వేరుశనగ, కూరగాయలు... ఇలా మూడు పంటలు పండించాను. వీటన్నింటికీ పెట్టుబడి రూ.27 వేలు అయింది. ఎకరాకు రూ.1.07 లక్షల లాభం వచ్చింది. ఇక్కడ వర్షపాతం తక్కువగా ఉండటంతో ప్రకృతి వ్యవసాయం ద్వారా భూమిని అభివృద్ధి చేసుకున్నాం.
ప్రధాని: మీ మాటల్లో అనుభవం కనిపిస్తోంది. ఎక్కడా ఆగకుండా సూపర్‌ఫాస్ట్‌గా అనుభవాలను చెప్పుకుంటూ పోతున్నారు. స్వీయ అనుభవమే అందుకు కారణం.  చాలా ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు.  మీరు ఎంతో మంది ఆదివాసీ మహిళలను తోడు తీసుకెళ్తున్నట్లు నాకు చెప్పారు.  
వన్నూరమ్మ: నేను ఒంటరి ఎస్సీ మహిళను. పక్క తండాలో 170 మంది గిరిజన మహిళలకు ప్రకృతి వ్యవసాయాన్ని నేర్పించి.. ఆ దారిలో తీసుకెళ్లాను.
ప్రధాని: వన్నూరమ్మ గారూ.. ప్రకృతి వ్యవసాయంలో మన ఆదివాసీ మహిళలను జోడించేందుకు ప్రయత్నించడం గొప్ప విషయం. ఇందుకు మీకు, మిగతా మహిళా రైతులకు ఆదరపూర్వక నమస్సులు చెబుతున్నా.
ఏపీకి రూ.943 కోట్లు, తెలంగాణకు రూ.724 కోట్లు
ప్రధాన్‌ సమ్మాన్‌ నిధి 8వ విడతలో ఆంధ్రప్రదేశ్‌లోని 43,01,882 మంది రైతులకు రూ.943,78,54,000, తెలంగాణలోని 35,42,673 మంది రైతులకు రూ.724,43,20,000 దక్కింది. దేశవ్యాప్తంగా ఈ ఫలితం పొందిన 9.50 కోట్ల మంది రైతుల్లో ఏపీ రైతులు 4.52%, తెలంగాణ రైతులు 3.72% మంది కాగా, అందరికీ కలిపి విడుదల చేసిన రూ.20,667 కోట్లలో ఏపీ రైతులకు 4.56%, తెలంగాణ రైతులకు 3.50% మొత్తం దక్కింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు