ఎకరా రూ. 60 కోట్లు

ప్రధానాంశాలు

ఎకరా రూ. 60 కోట్లు

కాసులు కురిపించిన కోకాపేట భూములు

‘నియో పొలిస్‌’ పేరిట భారీ లేఅవుట్‌

49.94 ఎకరాలకు రూ.2,000 కోట్ల ఆదాయం

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరంలోని కోకాపేట భూములు ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపించాయి. అంచనాకు మించి భారీ ధర పలికాయి. గురువారం నిర్వహించిన ఈ-వేలానికి భారీ స్పందన వచ్చింది. కీలకమైన ప్రాంతం కావడంతో ప్లాట్లను దక్కించుకునేందుకు ప్రముఖ సంస్థలు పోటాపోటీగా ధర పెంచుకుంటూ పోయాయి. ముఖ్యంగా 1.65 ఎకరాల ప్లాట్‌కు తీవ్ర పోటీ నెలకొంది. మొత్తం 49.94 ఎకరాలను అమ్మకానికి పెట్టగా రూ. 2 వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. అత్యధికంగా ఎకరా రూ. 60.2 కోట్లకు అమ్ముడుపోవడం విశేషంం. ఒక్కో ఎకరా సరాసరి రూ. 40.05 కోట్లకు విక్రయించినట్లు హెచ్‌ఎండీఏ అధికారులు వెల్లడించారు.

కోకాపేటలోని మొత్తం 719 ఎకరాల భూమిని విక్రయించే బాధ్యతను ప్రభుత్వం గతంలో హెచ్‌ఎండీఏకు అప్పగించింది. ‘గోల్డెన్‌ మైల్‌’ పేరిట లేఅవుట్‌ను అభివృద్ధి చేసి 166 ఎకరాలను రూ. 1,755 కోట్లకు హెచ్‌ఎండీఏ విక్రయించింది. వివిధ సంస్థలకు కేటాయింపులు పోను మిగిలిన 110 ఎకరాల్లో ‘నియో పొలిస్‌’ పేరిట ఇంకో భారీ లేఅవుట్‌ను అభివృద్ధి చేసింది. మొత్తం 14 ప్లాట్లుగా విభజించి ఎకరా కనీస ధర రూ. 25 కోట్లుగా పెట్టింది. ఔత్సాహికులను ఆకర్షించేందుకు ఈ లేఅవుట్‌ను మల్టీపర్పస్‌ జోన్‌గా నోటిఫై చేసి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసింది. ఇక్కడి నుంచి నేరుగా ఓఆర్‌ఆర్‌పైకి చేరుకునేలా నార్సింగి సమీపంలో రాకపోకల సదుపాయాన్ని ఏర్పరచింది. ఈ ప్లాట్లకు గురువారం రెండు దశల్లో ఈ-వేలం నిర్వహించారు. తొలిదశలో 4 ప్లాట్లను అమ్మకానికి పెట్టారు. ప్రముఖ కంపెనీలు, ఔత్సాహికుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇవి రూ. 1,222.22 కోట్లకు అమ్ముడయ్యాయి. మధ్యాహ్నం మరో నాలుగు ప్లాట్లను వేలంలో ఉంచగా ఉదయం కంటే మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా గోల్డెన్‌ మైల్‌లోని 1.65 ఎకరాల ప్లాట్‌ను దక్కించుకునేందుకు ఔత్సాహికులు తీవ్రంగా పోటీ పడ్డారు. ఆ ప్లాట్‌ ఎకరాకు రూ. 60.2 కోట్ల చొప్పున రూ. 99.33 కోట్లకు అమ్ముడైంది. ఈ సెషన్‌లో రూ. 778.15 కోట్ల ఆదాయం సమకూరింది.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని