ఏడాదికి 24 తేజస్‌ యుద్ధవిమానాల తయారీ

ప్రధానాంశాలు

ఏడాదికి 24 తేజస్‌ యుద్ధవిమానాల తయారీ

హెచ్‌ఏఎల్‌ ఛైర్మన్‌ ఆర్‌.మాధవన్‌

ఈనాడు, హైదరాబాద్‌: ప్రైవేట్‌ సంస్థల భాగస్వామ్యంతో తేలికపాటి యుద్ధవిమానం తేజస్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని భవిష్యత్తులో ఏడాదికి 24కి పెంచగలమని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌) ఛైర్మన్‌ ఆర్‌.మాధవన్‌ ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రస్తుతం 8 తేజస్‌ విమానాల ఉత్పత్తి సామర్థ్యం ఉందని, వెంటనే 16కి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. తేజస్‌ విమానాల్లో కీలకమైన మధ్యభాగం తొలి యూనిట్‌ను సోమవారం హైదరాబాద్‌లో హెచ్‌ఏఎల్‌కు వెమ్‌ టెక్నాలజీస్‌ సంస్థ అందజేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాధవన్‌ మాట్లాడారు. ప్రైవేట్‌ సంస్థలు ముందుకురావడంతో స్పెషల్‌ ప్రాసెసర్స్‌ నుంచి కీలక భాగాల తయారీ వరకు ఔట్‌సోర్సింగ్‌కి ఇస్తున్నామని చెప్పారు.

విపత్తుల వేళ వాడేందుకు..: తేజస్‌ మార్క్‌-2 డిజైన్‌ వచ్చే ఏడాది ఆఖరు నాటికి సిద్ధమవుతుందని ఆర్‌.మాధవన్‌ అన్నారు. 2026-27 నాటికి పరీక్షించడం పూర్తవుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. తేలికపాటి యుద్ధ హెలికాప్టర్‌(ఎల్‌సీహెచ్‌), లైట్‌ యుటిలిటీ హెలికాప్టర్‌(ఎల్‌యూహెచ్‌) డిజైన్ల అభివృద్ధి తుది దశలో ఉందన్నారు. ఇండియన్‌ మల్టీరోల్‌ హెలికాప్టర్‌ (ఐఆర్‌ఎంహెచ్‌) 2028 నాటికి అందుబాటులోకి వస్తుందని చెప్పారు. వైద్య అత్యవసరాల్లో, విపత్తుల సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు హెలికాప్టర్ల వాడకానికి మొగ్గుచూపడంతో వీటికి డిమాండ్‌ ఉందని తెలిపారు. కార్యక్రమంలో హెచ్‌ఏఎల్‌ తేజస్‌ విభాగం అధిపతి జయదేవ, హైదరాబాద్‌లోని హెచ్‌ఏఎల్‌ ఏవియానిక్స్‌ విభాగం డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ సర్కాటీ, వెమ్‌ టెక్నాలజీస్‌ సీఎండీ వి.వెంకటరాజు మాట్లాడారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని