పార్లమెంటులో తెలంగాణ సమాచారం

ప్రధానాంశాలు

పార్లమెంటులో తెలంగాణ సమాచారం


బ్లాక్‌ఫంగస్‌ కేసుల్లో ఏడో స్థానంలో తెలంగాణ

ఈనాడు, దిల్లీ: జులై 28వ తేదీ నాటికి 2,578 బ్లాక్‌ఫంగస్‌ కేసులతో తెలంగాణ 7వ స్థానంలో నిలిచింది. శుక్రవారం లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి భారతీ ప్రవీణ్‌ ఈ సమాధానమిచ్చారు. కొవిడ్‌కు వైద్యసేవలు అందిస్తూ కన్నుమూసిన వైద్య సిబ్బంది కోసం అమలుచేస్తున్న ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన ప్యాకేజీ బీమాలో భాగంగా తెలంగాణ నుంచి పాత పథకం కింద 47 క్లెయిమ్‌లు రాగా, 36 చెల్లించామని, 2 పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. కొత్త పథకం కింద 17 క్లెయిమ్‌లు వస్తే అన్నీ చెల్లించామని వివరించారు. తెలంగాణలోని భద్రాచలం, కరీంనగర్‌, ఖమ్మం, గచ్చిబౌలి, గాంధీ ఆసుపత్రుల్లో పీఎస్‌ఏ ఆక్సిజన్‌ ప్లాంట్లు ప్రారంభమైనట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.


పోక్సో కేసుల్లో శిక్షలు తక్కువే..

చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించి పోక్సో చట్టం కింద నమోదైన కేసుల్లో తెలంగాణలో పెద్దగా శిక్షలు పడటం లేదు. జాతీయ స్థాయిలో గత అయిదేళ్లలో సగటున 10.30% కేసుల్లో శిక్షలు పడగా, తెలంగాణలో 3.22%కి పరిమితమైంది. కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి స్మృతి ఇరానీ శుక్రవారం రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలను వెల్లడించారు. 2015-19 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా పోక్సో చట్టం కింద 1,90,297 కేసులు నమోదవగా.. తెలంగాణలో 7,847(4.12%) నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో సగటున 87% కేసుల్లో ఛార్జిషీట్లు దాఖలు అయితే.. తెలంగాణలో 79.97% కేసుల్లో మాత్రమే ఛార్జిషీట్లు దాఖలయ్యాయి.


రాష్ట్రంలో రైల్వే పనుల వేగం పెరిగింది

ఈనాడు, దిల్లీ: గడిచిన ఏడేళ్లలో తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల నిర్మాణ పనులు వేగవంతమయ్యాయని ఆ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. శుక్రవారం రాజ్యసభలో తెరాస సభ్యుడు బండ ప్రకాశ్‌ తెలంగాణ ప్రాజెక్టులపై అడిగిన ప్రశ్నకు ఆయన ఈ సమాధానమిచ్చారు. 2014-21 మధ్యకాలంలో 321 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయినట్లు వివరించారు. 2018 నుంచి 2021 వరకు కేవలం తెలంగాణకే రెండు రైళ్లను మంజూరు చేశామన్నారు. ప్రస్తుతం తెలంగాణలో రూ.31,281 కోట్ల విలువైన 16 రైల్వే ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని వివరించారు.

* బీబీనగర్‌ ఎయిమ్స్‌ నిర్మాణానికి గత అయిదేళ్లలో రూ.23.85 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవ్య తెలిపారు. రూ.1,028 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిధులు ఇవ్వలేదని పేర్కొన్నారు. బీబీనగర్‌ ఎయిమ్స్‌లో 2019-20 విద్యాసంవత్సరం నుంచి ఎంబీబీఎస్‌ తరగతులు, 2020, జూన్‌ 2 నుంచి ఓపీడీ సేవలు ప్రారంభమైనట్లు వివరించారు.

* శ్యామప్రసాద్‌ ముఖర్జీ రూర్బన్‌ మిషన్‌ కింద తెలంగాణ ప్రభుత్వం 17 క్లస్టర్లను గుర్తించినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి సాధ్వీ నిరంజన్‌ జ్యోతి తెలిపారు. శుక్రవారం రాజ్యసభలో తెరాస సభ్యుడు కేఆర్‌ సురేష్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆమె ఈ సమాధానమిచ్చారు. వీటికి రూ.1,885.12 కోట్ల పెట్టుబడి అవుతుందని, ఇందులో సీజీఎఫ్‌ కింద రూ.434 కోట్లు సమకూర్చడానికి అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. కేంద్ర వాటా రూ.260 కోట్లు కాగా, ఇప్పటివరకు రూ.132.30 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు.


రహదారులకు నిధులు మంజూరు చేయండి

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి తెరాస ఎంపీల వినతి

ఈనాడు, దిల్లీ: తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన రహదారుల నిర్మాణానికి కేంద్ర రహదారి మౌలికవసతుల నిధి (సీఆర్‌ఐఎఫ్‌) నుంచి నిధులు విడుదల చేయాలని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి తెరాస లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఆయన నేతృత్వంలోని ఆ పార్టీ ఎంపీల బృందం శుక్రవారం కేంద్ర మంత్రిని కలిసింది. రాష్ట్రంలో పలు రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించినా నంబర్లు కేటాయించలేదని, కేటాయించిన రహదారుల పనులు ప్రారంభించలేదని తెలిపారు. 1,138 కి.మీ. రోడ్లను జాతీయ రహదారులుగా గుర్తించాలని కోరారు. చౌటుప్పల్‌-షాద్‌నగర్‌-కంది (ఆర్‌ఆర్‌ఆర్‌) రహదారి (186 కి.మీ.), కరీంనగర్‌-సిరిసిల్ల-కామారెడ్డి-ఎల్లారెడ్డి-పిట్లం (165 కి.మీ.), కొత్తకోట-గూడూరు-మంత్రాలయం (70 కి.మీ.), జహీరాబాద్‌-బీదర్‌-డెగ్లూర్‌ (25 కి.మీ.) రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి 2021 సంవత్సరానికి సంబంధించి రావల్సిన సెంట్రల్‌ రోడ్డు ఫండ్స్‌ (సీఆర్‌ఎఫ్‌) నిధులు రూ.620 కోట్లను విడుదల చేయాలని కోరారు. మిర్యాలగూడలోని రెండు వరుసల రహదారిని నాలుగు వరుసలకు విస్తరించాలని కేంద్ర మంత్రిని కోరారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని