ఐటీ, పారిశ్రామిక రంగాల్లో ఎనలేని పురోగతి

ప్రధానాంశాలు

ఐటీ, పారిశ్రామిక రంగాల్లో ఎనలేని పురోగతి

కేసీఆర్‌ సారథ్యంలో అన్నింటా అభివృద్ధి
శాసనసభలో అక్బరుద్దీన్‌
ఈనాడు, హైదరాబాద్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో దూసుకెళుతోందని ఎంఐఎం శాసనసభ్యులు అక్బరుద్దీన్‌ ఒవైసీ కొనియాడారు. మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలో పరిశ్రమలు, ఐటీ రంగాల్లో ఎనలేని పురోగతి కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు, ఐటీ రంగాల్లో అభివృద్ధిపై శాసనసభలో సోమవారం జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా అక్బరుద్దీన్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు విపరీతమైన విద్యుత్తు అంతరాయాలు, పవర్‌ హాలీడేలుండేవని, కాని కొద్దిరోజుల్లోనే ఈ పరిస్థితి మారిపోయిందన్నారు. ఇక కాళేశ్వరం, మిషన్‌ కాకతీయ వంటి పథకాలు రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశాయన్నారు. కార్యాలయ స్థల వినియోగంలో మొదటిసారి హైదరాబాద్‌.. బెంగళూరును అధిగమించిందని, ఐటీ అభివృద్ధిలో జాతీయ సగటు కంటే రెండింతలు నమోదవుతోందని అక్బర్‌ వెల్లడించారు. ఆన్‌లైన్‌ బోధన జరుగుతున్నందున నగరంలోని మురికివాడల్లోని విద్యార్థులకు ఉపయోగపడేలా ప్రతి రోజూ నాలుగైదు గంటలు ఉచిత వైఫై సదుపాయం కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అగ్రవర్ణ పేదలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని సూచించారు.


దేశంలోనే అగ్రస్థానం: వివేకానంద

తెరాస శాసనసభ్యులు వివేకానంద మాట్లాడుతూ ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో రాష్ట్రం ఎప్పుడూ దేశంలోనే అగ్రస్థానంలో ఉంటోందన్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 1973 నుంచి 2013 వరకూ 23,653 ఎకరాల్లో పారిశ్రామిక పార్కులు స్థాపిస్తే తెలంగాణ వచ్చిన తర్వాత ఏడేళ్లలో 19,961 ఎకరాల్లో 56 పార్కులు స్థాపించారని, ఇంకా 15,620 ఎకరాల్లో ప్రతిపాదనలు సిద్ధం చేశారన్నారు. ఆనంద్‌ మహీంద్ర లాంటి పారిశ్రామిక వేత్తలు, శశిథ]రూర్‌, కార్తి చిదంబరం వంటి వారు కూడా రాష్ట్ర పారిశ్రామిక విధానాలను కొనియాడారన్న విషయం గుర్తుంచుకోవాలని వివేకానంద వెల్లడించారు. తెరాస ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ పరిశ్రమల్లో స్థానికులకు ఉపాధి కల్పించేందుకు తెరాస ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయన్నారు.


ప్రత్యేకంగా చర్చిద్దాం: రాజాసింగ్‌

రాష్ట్రానికి కేంద్రం ఏమీ చేయడంలేదని తెరాస నేతలు పదే పదే మాట్లాడుతున్నారని ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అందించిన తోడ్పాటుపై శాసనసభలో ప్రత్యేకంగా చర్చిస్తే అన్ని వివరాలు తెలియజేస్తామని భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌ అన్నారు. వర్క్‌ఫ్రం హోం వల్ల ఐటీ సంస్థలపై పరోక్షంగా ఆధారపడిన క్యాబ్‌డ్రైవర్ల ఉపాధి పోయిందని, వారికి అండగా నిలిచేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. అనంతరం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఐటీ పురోభివృద్ధిపై మంత్రి కేటీఆర్‌ ఎమ్మెల్యేలకు ఇచ్చిన డాక్యుమెంట్‌ పత్రాల్లోనివన్నీ అబద్ధాలేనని విమర్శించారు. రూ.6,165 కోట్ల కేంద్ర నిధులతో ప్రారంభమైన రామగుండం ఎరువుల పరిశ్రమను ప్రధాని మోదీ ప్రారంభించారని చెప్పేందుకు దేనికి వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. కేంద్రం నుంచి రాష్ట్రంలో ఏయే శాఖలకు ఎన్ని నిధులొచ్చాయో చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సవాల్‌ విసిరితే.. కేటీఆర్‌ చర్చకు ఒప్పుకున్నారని చెబుతూ ఒకట్రెండు రోజుల్లో సమయం, వేదిక ఖరారు చేయాలని మంత్రిని కోరారు.


 

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని