వెలుగుపూలు పూస్తాయి.. మొక్కలై మొలుస్తాయి

ప్రధానాంశాలు

వెలుగుపూలు పూస్తాయి.. మొక్కలై మొలుస్తాయి

మార్కెట్లో పర్యావరణహిత బాణసంచా

భారీ శబ్దాలు, పొగ, ఉద్గారాలు ఉండవు

విత్తనాలు అమర్చిన సీడ్‌ క్రాకర్స్‌ కూడా..

ఈనాడు, హైదరాబాద్‌: బాణసంచా అంటే చెవులు చిల్లులు పడే శబ్దాలు.. ఉక్కిరిబిక్కిరి చేసే పొగ.. ఇవి ఒకప్పటి మాట. కాలంతోపాటే వీటిలోనూ ట్రెండ్‌ మారుతోంది. వాతావరణ కాలుష్యాన్ని శబ్దాన్ని తగ్గించే పటాకులు అందుబాటులోకి వచ్చాయి.. పండగరోజు బాణసంచా కాల్చే అనవాయితీని కొనసాగిస్తూనే ప్రమాదకరమైన కాలుష్య ఉద్గారాలను తగ్గించేలా గ్రీన్‌ కాకర్స్‌ మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. రాడిష్‌ రాకెట్‌.. మెంతీ బాంబ్‌.. మేరీగోల్డ్‌ చక్రీ.. బేసిల్‌ బాంబ్‌.. కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కల పేర్లతో వస్తున్న ఇవన్నీ పర్యావరణహిత టపాసులు. మామూలు పటాకుల్లాగా వీటివల్ల అంత ఎక్కువ కాలుష్యం వెలువడదు. ఇలాంటి విత్తన టపాసులు కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. వీటిని కాల్చితే వెలుగులు విరజిమ్మడంతోపాటు విత్తనాలు బయటపడతాయి. అవి పడినచోట మొక్కలు పెరుగుతాయని అంటున్నారు తయారీదారులు. బాణసంచా కాల్చడం వల్ల పర్యావరణానికి భారీగా కాలుష్యపు సెగ తగులుతోంది. మొక్కలను విస్తారంగా పెంచడం వల్ల కొంతవరకైనా నష్ట నివారణ చర్యలు చేపట్టవచ్చనే ఉద్దేశంతో టపాసుల తయారీదారులు కొత్తగా ‘సీడ్‌ క్రాకర్స్‌’ను తీసుకొచ్చారు.

అలాగే దీపావళికి వినియోగించే సంప్రదాయ బాణసంచా అధిక శబ్దాలతో పాటూ పెద్దఎత్తున కాలుష్యాన్ని వెదజల్లుతుంటాయి. వాతావరణంలో ఒక్కసారిగా పెరిగే వాయు కాలుష్యంతో జనం ఉక్కిరిబిక్కిరవుతుంటారు. ప్రజారోగ్యంపై, పర్యావరణంపై కూడా తీవ్ర ప్రభావితం పడుతోంది. ధూళి కణాలతో రాగి, జింక్‌, సోడియం, సీసం, మెగ్నీషియం, కాడ్మియం, సల్ఫర్‌, నైట్రోజన్‌ ఆక్సైడ్‌ వంటి కాలుష్య కారకాలు పెరిగిపోతుంటాయి. దీని నివారణకు కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రీయల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌)కు చెందిన ‘నీరి’ సంస్థ ప్రత్యామ్నాయ ముడిపదార్థాలను ఉపయోగించి గ్రీన్‌ కాకర్స్‌ను అభివృద్ధి చేసింది. వీటి వల్ల కాలుష్యం తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

పొగ, ధూళిని తగ్గించేలా..

సంప్రదాయ బాణసంచా పేల్చగానే దట్టమైన పొగ, ధూళి కణాలు అలుముకుంటాయి. గ్రీన్‌ క్రాకర్స్‌ వల్ల అవి 30 శాతం తగ్గుతాయి. సల్ఫర్‌డైఆక్సైడ్‌, నైట్రస్‌ ఆక్సైడ్‌ ఉద్గారాలు 20 శాతం తగ్గుతాయి. వీటిలో పొటాషియం నైట్రెట్‌, సల్పర్‌, అల్యూమినియం వాడకాన్ని బాగా తగ్గిస్తారు. 

చెవులకు చిల్లులు పడవు

లక్ష్మీబాంబులో 33శాతం అల్యూమినియం, 9 శాతం సల్ఫర్‌, 57శాతం పొటాషియం నైట్రెట్‌ వినియోగిస్తారు. పేల్చినప్పుడు పరిసరాలు దద్దరిల్లుతాయి. గ్రీన్‌ కాకర్స్‌లో వాటిని సగానికి తగ్గిస్తారు.

చిచ్చుపెట్టని బుడ్లు..

చిచ్చుబుడ్లు, ఇతరత్రా కాంతిని వెదజల్లే టపాసుల్లో 32.5 శాతం అల్యూమినియం పౌడర్‌, 10 శాతం అల్యూమినియం చిప్స్‌, 15 శాతం సల్ఫర్‌, 32.5 శాతం బేరియం నైట్రేట్‌, 10 శాతం పీవీసీ ఉంటాయి. గ్రీన్‌ కాకర్స్‌లో బేరియం నైట్రెట్‌, పీవీసీని అసలు వాడరు. సూక్ష్మ ధూళికణాలు 20-25 శాతానికి తగ్గిపోతాయి.

విత్తన టపాసులు..

ఈసారి దీపావళికి కొత్తగా విత్తన టపాసులు వచ్చాయి. రాకెట్‌, బాంబ్‌, చిచ్చుబుడ్డి, భూచక్రం, సేవెన్‌ షాట్‌ కలిపి ఒక బాక్స్‌లో విక్రయిస్తున్నారు. ఈ టపాసుల్లో విత్తనాలు ఉంటాయి. కాల్చిన అనంతరం వాటిలోంచి వెలువడే విత్తనాలు పడినచోట మొక్కలు మొలకెత్తుతుతాయి. అంటే రయ్‌మని దూసుకుపోయే రాకెట్‌ పడినచోట అందులో ఉండే విత్తనం పడి మొలకెత్తుతుందన్నమాట. అలాగే భూచక్రం, చిచ్చుబుడ్డి వంటి వాటిలో కూడా విత్తనాలను ఉంచుతున్నారు. మంటకు అవి కాలిపోకుండా ఏర్పాటు చేస్తున్నారు. ఈ టపాసుల్ని కాగితాలు, కార్డ్‌బోర్డుతో తయారు చేస్తారు. అవి పూర్తిగా భూమిలో కలిసిపోతాయి. పర్యావరణహితం కావడంతో బాక్స్‌ ధర రూ.600 వరకు చెబుతున్నారు. టపాసుల తయారీలో పేరొందిన సంస్థలన్నీ గ్రీన్స్‌ క్రాకర్స్‌ తయారు చేస్తున్నాయి. సంప్రదాయ టపాసులతో పోలిస్తే వీటి ధరల్లో పెద్దగా తేడాలేదు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని