వాంఖడేపై దర్యాప్తు షురూ

ప్రధానాంశాలు

వాంఖడేపై దర్యాప్తు షురూ

 ఆయన వాంగ్మూలం నమోదు  

కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న విజిలెన్స్‌ బృందం

ముంబయి: బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ నిందితుడిగా ఉన్న డ్రగ్స్‌ కేసులో దర్యాప్తునకు నేతృత్వం వహిస్తున్న మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్‌సీబీ) ముంబయి జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే మరిన్ని చిక్కుల్లో కూరుకుపోతున్నట్లు కనిపిస్తోంది. ఆర్యన్‌ విడుదల కోసం రూ.25 కోట్ల ముడుపులు డిమాండ్‌ చేశారంటూ ప్రత్యక్ష సాక్షి ప్రభాకర్‌ సాయీల్‌ ఆరోపణలు చేసిన వ్యవహారంలో వాంఖడే సహా మరికొందరు అధికారులపై ఎన్‌సీబీ విజిలెన్స్‌ బృందం దర్యాప్తును ప్రారంభించింది. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది.

ముడుపుల ఆరోపణలకు సంబంధించి వాంఖడే, ఇతర అధికారులపై దర్యాప్తు కోసం ఐదుగురు సభ్యులతో కూడిన ఎన్‌సీబీ విజిలెన్స్‌ బృందం బుధవారం ముంబయికి చేరుకుంది. దక్షిణ ముంబయిలోని తమ కార్యాలయం నుంచి పలు పత్రాలు, రికార్డింగులను స్వాధీనం చేసుకుంది. దర్యాప్తు బృందం ఎదుట వాంఖడే నాలుగున్నర గంటల పాటు తన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అవసరమైతే ఆయనతో మళ్లీ మాట్లాడతామని, మరికొన్ని పత్రాలు తెప్పించుకుంటామని దర్యాప్తు బృందానికి నేతృత్వం వహిస్తున్న ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ (నార్తర్న్‌ రీజియన్‌) జ్ఞానేశ్వర్‌ సింగ్‌ తెలిపారు.  

 నాతోనూ సంతకాలు చేయించుకున్నారు

వాంఖడేపై ఆరోపణల పర్వం కొనసాగుతోంది. ఆయన, మరికొందరు ఎన్‌సీబీ అధికారులు తనతో 10-12 ఖాళీ పేపర్లపై సంతకాలు చేయించుకున్నారంటూ మరో డ్రగ్స్‌ కేసులోని సాక్షి శేఖర్‌ కాంబ్లి తాజాగా ఆరోపించారు. ఈ ఏడాది ఆగస్టులో ముంబయిలోని ఖర్గార్‌ ప్రాంతంలో డ్రగ్స్‌ కేసులో ఓ నైజీరియన్‌ను అరెస్టు చేసినప్పుడు ఈ పరిణామం చోటుచేసుకుందన్నారు. వాస్తవానికి నాడు ఇద్దరు నైజీరియన్లు పట్టుబడినా.. ఒకర్ని అధికారులు వదిలేశారని ఆరోపించారు. అరెస్టు చేసినప్పుడు నిందితుడి వద్ద మాదకద్రవ్యాలు లేకున్నా ఉన్నట్లు తర్వాత చూపించారని పేర్కొన్నారు.

పదవికి రాజీనామా చేస్తా: మాలిక్‌

సమీర్‌ వాంఖడే జన్మతః ముస్లిం అని మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ పునరుద్ఘాటించారు. ఈ మేరకు తాను ఆన్‌లైన్‌లో పోస్ట్‌ చేసిన వాంఖడే జనన ధ్రువీకరణ పత్రం తప్పని తేలితే మంత్రి పదవికి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకొంటానని పేర్కొన్నారు.  ముంబయిలో బుధవారం విలేకర్ల సమావేశంలో ఈ మేరకు పలు అంశాలపై మాట్లాడారు. వాంఖడే, ఆయన డ్రైవర్‌, డ్రగ్స్‌ కేసులో సాక్షులుగా ఉన్న కె.పి.గోసావి, ప్రభాకర్‌ సాయీల్‌ల కాల్‌ డీటెయిల్‌ రికార్డు (సీడీఆర్‌)లను పరిశీలించాలని   కోరారు. డ్రగ్‌ డీలర్‌ శామ్‌ డిసౌజాతో వాంఖడే సంబంధాలపై నిగ్గు తేల్చాలని డిమాండ్‌ చేశారు.

 నా భర్త మతం మారలేదు: క్రాంతి రెడ్కర్‌

వాంఖడే జన్మతః హిందువని ఆయన భార్య క్రాంతి రెడ్కర్‌ ఉద్ఘాటించారు. ఆయన ఎప్పుడూ మతం మారలేదని స్పష్టం చేశారు. వాంఖడే 2006లో తొలి వివాహం ముస్లిం ఆచారం ప్రకారం చేసుకున్నమాట వాస్తవమేనని, అయితే తల్లి (ముస్లిం) కోరిక మేరకే అప్పుడలా చేశారని వివరించారు.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని