భూటాన్‌ భూభాగంలో చైనా హల్‌చల్‌

తాజా వార్తలు

Updated : 20/11/2020 17:04 IST

భూటాన్‌ భూభాగంలో చైనా హల్‌చల్‌

డోక్లాం’ సమీపంలో ఏకంగా గ్రామం నిర్మాణం

దిల్లీ: నియంత్రణ రేఖ వెంబడి తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్తతలు రేపి భారత్‌తో కయ్యానికి కాలు దువ్విన పొరుగుదేశం చైనా.. ఇప్పుడు మరోసారి సరిహద్దుల్లో అగ్గి రాజేసేందుకు ప్రయత్నిస్తోంది. విస్తరణవాదంతో రగిలిపోతున్న డ్రాగన్..  చిన్న దేశమైన భూటాన్‌లోకి 2 కిలోమీటర్ల మేర చొచ్చుకెళ్లిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అంతేగాక, అక్కడ ఓ గ్రామాన్ని కూడా నిర్మించినట్లు వెల్లడైంది.

భూటాన్‌ సరిహద్దు నుంచి 2 కిలోమీటర్లు లోనికి చొచ్చుకెళ్లి ఈ గ్రామాన్ని నిర్మించింది. దీనికి పంగ్డా అని పేరు కూడా పెట్టింది. చైనా అధికారిక మీడియాకు చెందిన ఓ సీనియర్‌ పాత్రికేయుడు ట్విటర్‌లో పెట్టిన లొకేషన్‌ చిత్రాలు, ఫొటోల్లో ఈ విషయం బట్టబయలైంది. అయితే ఈ ట్వీట్లు వివాదాస్పదంగా మారడంతో ఆ పాత్రికేయుడు తర్వాత వాటిని తొలగించారు. కానీ అప్పటికే ఆ ఫొటోలు, స్క్రీన్‌షాట్లు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. 


(వైరల్ అయిన ఫొటోలు ఇవే..)

2017లో భారత్‌, చైనా మధ్య ప్రతిష్టంభన ఏర్పడిన ‘డోక్లాం’ ప్రాంతానికి ఈ గ్రామం 9 కిలోమీటర్ల దూరంలో ఉండటం గమనార్హం. భారత్‌, భూటాన్‌లను ఆక్రమించుకునేందుకు డ్రాగన్‌ వ్యూహరచన చేస్తోందన్న అనుమానాలను తాజా పరిణామాలు ధ్రువపరుస్తున్నాయి. అయితే చైనా ‘సలామీ స్లైసింగ్‌’ (కొద్ది కొద్దిగా ఆక్రమించడం) భారత్‌కు మరింత ఆందోళనకరంగా మారింది.

భూటాన్‌కు ప్రపంచం అండగా ఉండాలి..
చైనా విస్తరణపై మీడియాలో వార్తలు రావడంతో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అభిషేక్‌ సింఘ్వి ట్విటర్‌ వేదికగా స్పందించారు. చైనా సలామీ స్లైసింగ్‌కు భూటాన్‌ తాజా బాధిత దేశం. సార్క్‌ సహా యావత్‌ ప్రపంచ దేశాలు ఈ విషయంలో భూటాన్‌కు అండగా ఉండాలి. ఈ ప్రాంతంలో చైనా విస్తరణ వాదాన్ని నియంత్రించాలని ఆయన ట్వీట్‌ చేశారు. 

భారత్‌-భూటాన్‌-చైనా ట్రైజంక్షన్‌ అయిన డోక్లాంపై దశాబ్దాలుగా భారత్‌, చైనా మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాంతం తమదేనంటూ డ్రాగన్‌ వాదిస్తూ వస్తోంది. ఇదే విషయమై 2017లో ఇరు దేశాల మధ్య 72 రోజుల పాటు ప్రతిష్టంభన నెలకొంది. ఆ తర్వాత దౌత్యపరమైన చర్యలతో ఆ సమస్య అప్పటికి పరిష్కారమైంది. ఇదిలా ఉండగా.. లద్దాఖ్‌ సరిహద్దుల్లోనూ డ్రాగన్‌ కవ్వింపు చర్యలకు పాల్పడిన విషయం తెలిసిందే. గాల్వాన్‌ లోయలో ఇరు దేశాల సైనికుల ఘర్షణతో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. దీంతో నియంత్రణ రేఖ వెంబడి ఐదు నెలలుగా ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. 

చిన్న దేశం, పెద్దగా ఆయుధ సంపత్తి లేని భూటాన్‌ సార్వభౌమత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత భారత్‌పైనే ఉంది. అది కీలకం కూడా. ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాలను భారత్‌తో కలిపే సిలిగురి కారిడార్‌ భూటాన్‌కు అత్యంత సమీపంలో ఉంది. అందుకే ఈ విషయంలో భారత్‌ ప్రత్యేక దృష్టిపెట్టాల్సి వస్తోంది. మరి డ్రాగన్‌ తాజా చర్యలు ఎక్కడకు దారితీస్తాయో చూడాలి..!Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని