ముంబయిలో మూడురోజుల బిడ్డకు కరోనా
close

తాజా వార్తలు

Updated : 02/04/2020 16:29 IST

ముంబయిలో మూడురోజుల బిడ్డకు కరోనా

ముంబయి: భారత్‌లో రోజురోజుకి పెరుగుతున్న కరోనా మహమ్మారి కట్టడికి ప్రభుత్వం తీవ్ర కృషి చేస్తున్నప్పటికీ కొందరి నిర్లక్ష్యం కారణంగా వైరస్‌ బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా ముంబయిలోని ఒక మహిళకు, మూడు రోజుల క్రితం జన్మించిన ఆమె బిడ్డకు కరోనా సోకింది. వారివురిని కరోనా వైరస్‌ బారి నుంచి రక్షించాలని ముంబయికి చెందిన సదరు మహిళ భర్త ప్రధాని మోదీని, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను అభ్యర్థించాడు. ముంబయిలోని చెంబూర్‌ సబర్బన్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి గత వారం తన భార్యను డెలివరీ కోసం స్థానిక ఆస్పత్రిలో చేర్పించాడు. అక్కడ ఆమె ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవానంతరం వారిని ప్రైవేట్‌ గదికి తరలించారు. కొద్ది సేపటి తర్వాత అదే గదిలో మరో రోగిని కూడా ఉంచారు. అయితే ఆ రోగికి కరోనా సోకిందనే విషయాన్ని ఆస్పత్రి వర్గాలు దాచి పెట్టాయని మహిళ భర్త ఆరోపించాడు. 

‘‘నా భార్యకు, మూడు రోజుల బిడ్డకు పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. ఆస్పత్రిలో మేం ఉన్న గదిలోనే కరోనా సోకిన వ్యక్తిని కూడా ఉంచారు. అతనికి కరోనా ఉందనే విషయాన్ని ఆస్పత్రి వర్గాలు మాకు చెప్పలేదు. అంతేకాకుండా కదల్లేని పరిస్థితుల్లో ఉన్న నా భార్యను ఆస్పత్రి నుంచి వెళ్లిపొమ్మన్నారు. కారణం అడిగితే బృహన్‌ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశాల మేరకు ఖాళీ చేయిస్తున్నామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అయితే పరీక్షల్లో నా భార్యకు, మూడు రోజుల బిడ్డకు కరోనా పాజిటివ్‌ అని తేలడంతో వారిని కస్తుర్బా ఆస్పత్రిలోని కరోనా వార్డుకు తరలించారు. కేవలం ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా వారికి వైరస్ సోకింది. నాలా మరెవరికి జరగకూడదు. ప్రభుత్వం నా భార్య, బిడ్డలకు మెరుగైన వైద్యం అందించి వారిని కాపాడాలి’’ అని వీడియో ద్వారా అభ్యర్థించాడు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే  ఇప్పటి వరకు మహారాష్ట్రలో 335 మందికి కరోనా సోకింది. వీరిలో 42 మంది వైరస్‌ నుంచి కోలుకోగా, 13 మంది మృత్యువాతపడ్డారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని