ట్రంప్‌ కోసం ముస్తాబవుతోన్న తాజ్‌మహల్‌

తాజా వార్తలు

Published : 19/02/2020 00:55 IST

ట్రంప్‌ కోసం ముస్తాబవుతోన్న తాజ్‌మహల్‌

ట్రంప్‌ సందర్శన నేపథ్యంలో ముస్తాబవుతోన్న తాజ్‌ పరిసరాలు

లక్నో: మొదటిసారిగా భారత్‌ పర్యటనకు రానున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కోసం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తాజ్‌మహల్‌ ముస్తాబవుతోంది. భారత ప్రధాని నరేంద్రమోదీ ఆహ్వానం మేరకు ఈ నెల 24, 25 తేదీల్లో రెండు రోజుల పాటు అమెరికా అధ్యక్షుడు భారత్‌లో పర్యటించనున్నారు. ట్రంప్ దంపతులు తాజ్‌మహల్‌ను సందర్శించనున్నట్లు సమాచారం. దీనికోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. వీరి రాక నేపథ్యంలో ఆగ్రా పరిసర ప్రాంతాలను ముస్తాబుచేస్తున్నారు. ఇప్పటికే సుందరీకరణ పనులు చేపట్టిన అధికారులు పట్టణంలోని ప్రముఖ కూడళ్లను అందంగా తీర్చిదిద్దడంతోపాటు, రోడ్ల మధ్య విభాగినిలకు రంగులు వేసే కార్యక్రమం చేపట్టారు. స్థానిక పోలీసులకు కూడా సెలవులను రద్దు చేశారు.  విమానాశ్రయం నుంచి తాజ్‌మహల్‌ వరకు ఉన్న రోడ్డు మార్గాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతున్నారు. తాజ్‌మహల్‌ చుట్లూ ఉన్న గోడలపై కళాకారులతో పెయింటింగ్‌లతో వేయిస్తున్నారు. సందర్శన సమయంలో తాజ్‌మహల్‌ సమీపంలో ఉన్న కళాకృతి ఆడిటోరియంలో ‘మొహబ్బత్‌-తాజ్‌’ అనే కళా ప్రదర్శనను తిలకించే అవకాశం ఉంది. భద్రతా చర్యల్లో భాగంగా ఇప్పటికే అమెరికా భధ్రతా దళాలు తాజ్‌మహల్‌ను సందర్శించాయి. 

అహ్మదాబాద్‌లో నూతనంగా నిర్మించిన మొటెరా క్రికెట్‌ స్టేడియంలో భారీ సభ అనంతరం డొనాల్డ్‌ ట్రంప్‌ తాజ్‌ మహల్‌ను సందర్శించే అవకాశం ఉంది. భారత్‌-అమెరికా దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో ఈ పర్యటన మరింత దోహదం చేస్తుందని ఇరు దేశాల అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా 2015లో భారత్‌ పర్యటనకు వచ్చిన అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తాజ్‌మహల్‌ను సందర్శించేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ చివరిక్షణంలో రద్దయిన సంగతి తెలిసిందే. 
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని