కరోనా కేసుల్లో.. చైనాను దాటేసిన భారత్‌!

తాజా వార్తలు

Updated : 16/05/2020 12:49 IST

కరోనా కేసుల్లో.. చైనాను దాటేసిన భారత్‌!

దిల్లీ: ప్రపంచదేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారికి కేంద్రబిందువైన చైనాలో తాజాగా వైరస్‌ తీవ్రత గణనీయంగా తగ్గింది. ఈ సమయంలో భారత్‌లో మాత్రం ఈ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. తాజాగా నిన్న ఒక్కరోజే దేశంలో 3970 పాజిటివ్‌ కేసులు నమోదుకావడంతో కరోనా కేసుల సంఖ్యలో భారత్‌.. చైనాను దాటేసింది. ప్రస్తుతం చైనాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 82,900కే పరిమితం కాగా భారత్‌లో మాత్రం 85,940కి చేరింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదైన దేశాల్లో భారత్ 11వ స్థానానికి ఎగబాకగా..చైనా 13వ స్థానంలో నిలిచింది. అయితే వైరస్‌ కారణంగా సంభవించిన మరణాల్లో మాత్రం చైనా కంటే తక్కువగా ఉండటం కాస్త ఊరటనిచ్చే విషయం. భారత్‌లో ఇప్పటివరకు కొవిడ్‌ సోకి 2753మంది మరణించగా..చైనాలో 4633మంది ప్రాణాలు కోల్పోయారు.

గత సంవత్సరం డిసెంబరు నెలలో బయటపడిందని బావిస్తోన్న కరోనా వైరస్‌ చైనాలో విలయతాండవం చేసింది. తక్కువ సమయంలోనే వుహాన్‌ నగరాన్ని అతలాకుతలం చేసి వేల సంఖ్యలో బాధితులుగా మార్చింది. ముఖ్యంగా ఫిబ్రవరి నెలలో ఊహించని విధంగా విజృంభించింది. అక్కడ ప్రతిరోజు సరాసరి 2400పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇలా మార్చి మొదటివారానికే చైనాలో 80వేల కేసుల మార్కును దాటింది. మార్చి చివరినాటికి మాత్రం పాజిటివ్‌ కేసులు పదుల సంఖ్యకు పడిపోయాయి. ఆ సమయంలో(మార్చి రెండో వారం) ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌-19 విజృంభించడం ప్రారంభించింది. అప్పుడు భారత్‌లో ఈ కేసుల సంఖ్య దాదాపు 100 మాత్రమే. ఇలా చైనాతో పోల్చుకుంటే 80వేలు దాటడానికి భారత్‌కి దాదాపు రెండు నెలల సమయం పట్టింది.

లాక్‌డౌన్‌తో కట్టడి..

భారత్‌లో కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో దీన్ని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులు రెట్టింపు కావడానికి 11రోజులు పడుతోంది. లాక్‌డౌన్‌ విధించక ముందు పాజిటివ్‌ కేసుల సంఖ్య మూడున్నర రోజులకే రెట్టింపు అయ్యింది. లాక్‌డౌన్‌ సహాయంతో వైరస్‌ వ్యాప్తిని చాలావరకూ అరికట్టగలిగినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్‌లో ప్రస్తుతం 85,940 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 30,153మంది కోలుకున్నారు. భారత్‌లో రికవరీ రేటు 35శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ వెల్లడించారు. కరోనా వైరస్‌ను గుర్తించడం, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, ఐసోలేషన్‌ వంటి చర్యలతో వైరస్‌ తీవ్రతను తగ్గించడానికి ఈ లాక్‌డౌన్‌ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నట్లు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. చైనాలో అక్కడి అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 80వేల మంది కోలుకోగా ఇది 94శాతంగా ఉంది. ఇక కొవిడ్‌-19 మరణాల రేటు చైనాలో 5.5శాతం ఉండగా భారత్‌లో 3.2గా ఉండటం ఊరట కలిగిస్తోంది.

ఇప్పటికే దేశంలో మూడుసార్లు లాక్‌డౌన్‌ పొడగించగా.. మే 17నాటికి ఇది ముగియనుంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ కొనసాగింపు మరోసారి ఉంటుందని భారత ప్రధాని నరేంద్రమోదీ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే ఈ సమయంలో లాక్‌డౌన్‌ నిబంధనలను సడలిస్తూనే వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ సడలింపులు ఇస్తున్న తరుణంలో భారత్‌లో కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని