భారత్‌లో 5కోట్ల మంది హ్యాండ్‌వాష్‌కు దూరం..!
close

తాజా వార్తలు

Published : 22/05/2020 01:40 IST

భారత్‌లో 5కోట్ల మంది హ్యాండ్‌వాష్‌కు దూరం..!

దిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కొనేందుకు భౌతిక దూరంతోపాటు వ్యక్తిగత పరిశుభ్రతే కీలకమని ప్రపంచవ్యాప్తంగా నిపుణులు సూచిస్తున్నారు. ఈ సందర్భంలో సబ్బు, స్వచ్ఛమైన నీరు అందుబాటులో లేనికారణంగా అల్ప, మధ్యఆదాయ దేశాల్లోని దాదాపు 200కోట్ల మందిపై వైరస్‌ ప్రభావం ఉండే అవకాశం ఉందని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ హెల్త్‌ మెట్రిక్స్, ఎవాల్యూవేషన్‌ (ఐహెచ్‌ఎంఈ) నివేదించింది. ముఖ్యంగా ఆఫ్రికా, ఓషియానా ప్రాంతాల్లోని 50శాతానికి పైగా ప్రజలు చేతులు శుభ్రతకు దూరంగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. ఈ సమయంలో భారత్‌లో దాదాపు 5కోట్ల మంది వ్యక్తిగత పరిశుభ్రతకు దూరంగా ఉన్నట్లు తాజా నివేదిక పేర్కొంది. వీరికి కనీసం చేతులు శుభ్రపరుచుకునే వీలులేదని తెలిపింది.

కొవిడ్‌-19 వ్యాప్తి నివారణలో చేతుల శుభ్రత ఎంతో ముఖ్యం. అయినప్పటికీ చాలా దేశాల్లో ఆరోగ్య రక్షణ వ్యవస్థలు స్వల్ప స్థాయిలో ఉన్నాయని ఐహెచ్‌ఎంఈ ప్రొఫెసర్‌ మైఖేల్‌ బ్రేయర్‌ స్పష్టం చేశారు. దాదాపు 46దేశాల్లో జరిపిన తాజా పరిశోధనలో దాదాపు సగం మంది ప్రజలు సబ్బు, స్వచ్ఛమైన నీటికి దూరంగా ఉన్నారని తెలిపారు. ముఖ్యంగా భారత్‌, పాకిస్థాన్‌, చైనా, బంగ్లాదేశ్‌, నైజీరియా, ఇథియోపియా, కాంగో, ఇండోనేషియాలలోనూ ఒక్కో దేశంలో  దాదాపు 5కోట్లకుపైగా ప్రజలకు చేతులు శుభ్రం చేసుకునే అవకాశం లేదని నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం వాడుతున్న హ్యండ్‌ శానిటైజర్లు, నీటి ట్యాంకులు తాత్కాలికమేనని బ్రేయర్‌ అన్నారు. చేతులు శుభ్రతకు నోచుకోని కారణంగా ప్రతి సంవత్సరం దాదాపు 7లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని.. ఇలాంటి సందర్భంలో కొవిడ్‌ నుంచి రక్షించుకునేందుకు శాశ్వత ప్రణాళికలు అవసరమని స్పష్టం చేశారు.

1990 నుంచి 2019 వరకు చాలా దేశాల పరిస్థితిలో మెరుగైన మార్పు వచ్చినప్పటికీ.. ఇంకా ప్రపంచంలోని దాదాపు 25శాతం మంది వీటికి దూరంగా ఉన్నట్లు బ్రేయర్‌ పేర్కొన్నారు. సౌదీ అరేబియా, మొరాకో, నేపాల్‌, టాంజానియీ దేశాలు పారిశుద్ధ్యంలో మెరుగైన ఫలితాలు సాధించాయని నిపుణులు వెల్లడించారు. అయితే వ్యక్తిగత పరిశుభ్రత గురించి మాత్రమే ఈ నివేదిక దృష్టి సారించగా.. పాఠశాలలు, పనిచేయు ప్రదేశాలు, మార్కెట్లు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, బహిరంగ ప్రదేశాలలో చేతుల శుభ్రతకు ఉన్న వసతుల గురించి ఈ నివేదిక దృష్టిసారించలేదు.

ఇదిలా ఉంటే, ఆఫ్రికా ఖండంలోనే దాదాపు నాలుగున్నర కోట్ల మంది కొవిడ్‌-19 బారినపడతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) అంచనా వేసింది. వీరిలో దాదాపు 1,90,000 మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉన్నట్లు గతనెల డబ్ల్యూహెచ్‌ఓ అంచనాలను శాస్త్రవేత్తలు గుర్తుచేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని