మృతదేహాల తరలింపు అలాగా?.. గవర్నర్‌ ఆగ్రహం

తాజా వార్తలు

Updated : 12/06/2020 13:51 IST

మృతదేహాల తరలింపు అలాగా?.. గవర్నర్‌ ఆగ్రహం

కోల్‌కతా: దక్షిణ కోల్‌కతాలోని ఓ శ్మశాన వాటిక నుంచి మృతదేహాలను మున్సిపల్ సిబ్బంది వ్యాన్‌లోకి తరలించిన తీరును వెల్లడిచేసే వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది.  శ్మశాన వాటిక వద్ద స్థానికులు ఆందోళన చేయడంతో పూడ్చిపెట్టడానికి తీసుకువచ్చిన శవాలను పట్టకారు లాంటి దానితో ఈడ్చుకుంటూ వ్యాన్‌లోకి ఎక్కించిన విధానం పశ్చిమ బెంగాల్ గవర్నర్‌ జగదీప్‌ ధనకర్ ఆగ్రహానికి కారణమైంది.

13 శవాలతో దక్షిణ కోల్‌కతాలోని గరియా ఆది మహాశ్మశానం వద్దకు మున్సిపల్ వ్యాన్ రావడంతో అక్కడి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తోన్న సమయంలో ఆ వీడియో తీసినట్లు సమాచారం. దాంతో ఆ మృతదేహాలను ఒక పట్టకారు లాంటిదాంతో ఈడ్చుకుంటూ శ్మశానవాటిక నుంచి తిరిగి వ్యాన్‌లోకి ఎక్కిస్తున్నట్లు అందులో కనిపిస్తోంది. అనంతరం వాటిని మరో శ్మశాన వాటికలో పూడ్చిపెట్టినట్లు కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది. అయితే మృతదేహాలను ఈడ్చుకెళ్లిన దృశ్యాలు ఆ రాష్ట్ర గవర్నర్‌ దృష్టికి వచ్చాయి. తీవ్ర ఆగ్రహానికి గురైన ఆయన ఆ ఘటనపై ప్రభుత్వాన్ని నివేదిక కోరారు. ‘ఆ మృతదేహాల పట్ల వ్యవహరించిన తీరు వర్ణించలేని విధంగా ఉంది. మన సమాజంలో మృతదేహాలకు అత్యంత గౌరవం ఇస్తాం. వెంటనే ఈ ఘటనపై నివేదిక ఇవ్వండి’ అని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అయితే ఆ మృతదేహాలు కరోనాతో మరణించిన వ్యక్తులవని స్థానికులు చేసిన ఆరోపణలను అధికారులు కొట్టిపారేశారు. అలాగే ఆ వీడియో నకిలీదని, అది నెట్టింట్లో చక్కర్లు కొట్టడానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ‘ఆ మృతదేహాలు కొవిడ్ బాధితులవి కాదని పశ్చిమ బెంగాల్ వైద్య విభాగం సమాచారం ఇచ్చింది. అవి మోర్గ్ ఆసుపత్రిలో ఉన్న గుర్తు తెలియని మృతదేహాలు. ఈ తప్పుడు వార్తలను వ్యాప్తి చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం’ అని కోల్‌కతా పోలీసు విభాగం ట్వీట్ చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని