శాంతి ఒప్పందాలకు చైనా తూట్లు: భారత్
close

తాజా వార్తలు

Published : 26/06/2020 17:48 IST

శాంతి ఒప్పందాలకు చైనా తూట్లు: భారత్

ద్వైపాక్షిక సబంధాలను దిగజారుస్తోందని ఆరోపణ

దిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో తన దుందుడుకు సైనిక చర్యల ద్వారా చైనా వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి యుద్ధ పరిస్థితులు కల్పించి, ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను దిగజారుస్తోందని భారత్ ఆరోపించింది. చైనా అధ్యక్షుడు, పీపుల్స్‌ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ షి జిన్‌పింగ్ 1993 నాటి శాంతి ఒప్పందానికి తూట్లు పొడిచారని పేర్కొంది. అందుకే భారత ప్రభుత్వం ఇరు దేశాల ద్వైపాక్షిక సబంధాలపై జిన్‌పింగ్‌కు దౌత్యపరమైన అల్టిమేటం విధించినట్లు సమాచారం. 1993 ఒప్పందం అప్పటి భారత్ ప్రధాని పీవీ నరసింహా రావు, చైనా అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ హయాంలో జరిగింది. అందులో భాగంగా ఇరు దేశాలు ఎల్‌ఏసీ వెంబడి సైనిక బలగాలను తక్కువ స్థాయిలో మోహరించేందుకు అంగీకరించాయి. కానీ చైనా మాత్రం అప్పటి నుంచి సరిహద్దుల విషయలో భారత్‌తో గిల్లికజ్జాలకు దిగుతూనే ఉంది. 

ఎల్ఏసీ వెంట చైనా తన సైన్యాన్ని ఉపసంహరించుకోకుంటే అది గత మూడు దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య ఉన్న  ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని భారత్ గురువారం చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘‘ఎల్‌ఏసీ వెంబడి సైనిక చర్యల ద్వారా బదులివ్వగలిగే సత్తా, సామర్థ్యం భారత్‌కు ఉన్నాయి. పీఎల్ఏ వెనక్కి తగ్గకపోతే ఆర్థిక సంబంధాలు కూడా పూర్తిగా దెబ్బతినే  అవకాశం ఉంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే చైనాతో ఎప్పటిలా వ్యాపారం చేయలేం. దీన్ని షీ జిన్‌పింగ్ పరిగణనలోకి తీసుకోవాలి’’ అని భారత ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

 

ఇప్పటి వరకు చైనా వైమానిక దళానికి చెందిన ఒక్క విమానం కూడా ఎల్ఏసీ వెంబడి ఎగరలేదు. కేవలం ఫిరంగులు, క్షిపణులతో మాత్రమే సైన్యాన్ని మోహరించింది. దాని ద్వారా 1,597 కి.మీ. ఎల్ఏసీ వెంబడి తమ బలగాలు యుద్ధానికి సిద్ధం అనే పరోక్ష  సంకేతాలను చైనా పంపేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ భారత్‌ మాత్రం తన ఫైటర్‌ జెట్లు, హెలికాప్టర్లను సరిహద్దుల్లో మోహరించింది. గల్వాన్ ఘటన, దౌలత్‌ బేగ్ ఓల్దీ(డీబీఓ) ప్రాంతంలో భారత సైన్యానికి చెందిన 16 బిహార్ రెజిమెంట్ జవాన్ల ప్రదర్శించిన తెగువకు చైనా ఒకింత ఆందోళనకు గురైందట.

ఇక దర్బాక్-షోయక్-డీబీఓ (డీఎస్‌డీబీఓ) ప్రాంతంలో రోడ్డు నిర్మాణం పూర్తి చేసి కారకోరం కనుమ ప్రాంతానికి టి-90 ట్యాంకులు, రష్యాకు చెందిన బీఎంపీ యుద్ధ వాహనాలు, అమెరికాకు చెందిన ఎమ్‌-777 155ఎమ్ఎమ్ శతఘ్నులను తరలించి చైనా అంచనాలను తలకిందులు చేస్తూ భారత్ తన యుద్ధ సన్నదతను చాటింది. అలా భారత్ తన అత్యాధునిక ఆయుధ సంపత్తిని డీబీఓ ప్రాంతానికి తరలించడం, మైదానాల్లో ముందస్తు ల్యాండిగ్‌కు ఏర్పాట్లు చేసుకోవడంతో యుద్ధానికి దిగితే తమకు భారీ ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని చైనా భావిస్తోందట.

అలానే డీఎస్‌డీబీఓ రోడ్డును సియాచిన్‌తో అనుసంధానించడం ద్వారా లద్దాఖ్‌ను ఆక్రమించాలన్న చైనా దురాలోచనకు భారత్‌ చెక్ పెట్టినట్లయింది. గతంలో జరిగిన శాంతి చర్చల ప్రకారం సియాచిన్‌ నుంచి భారత్ సైన్యానికి వెనక్కి రప్పించి అక్కడ పార్కు నిర్మించాలి. అలా చేసుంటే చైనా ప్రణాళికలు అమలయ్యేవి. ఎల్ఏసీ వెంట చైనా దుందుడుకు చర్యలను మరి కొంత కాలం కొనసాగిస్తే, భారత్‌తో ఆ దేశం ద్వైపాక్షిక సంబంధాలు ప్రమాదంలో ఉన్నట్లేనని, మరి కొద్ది వారాల్లో బీజింగ్ ఆర్థిక స్థితిపై భారత్ దెబ్బకొట్టినా ఆశ్చర్యపోనవసరం లేదని నిపుణుల అభిప్రాయం. ఇప్పటికే చైనా వస్తువుల వాడకాన్ని స్వచ్ఛందంగా బహిష్కరించాలనే నినాదం భారత్‌లో గట్టిగా వినిపిస్తోంది.     


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని