Nuclear Warhead: ఆగని అణుపోటీ..!
close

తాజా వార్తలు

Published : 15/06/2021 01:13 IST

Nuclear Warhead: ఆగని అణుపోటీ..!

అణు సంపత్తిలో వెనక్కి తగ్గని అగ్ర దేశాలు

స్టాక్‌హోమ్: నాగసాకి, హిరోషిమాలపై అణుబాంబులు సృష్టించిన విధ్వంసం మానవాళికి పీడకలను మిగిల్చినప్పటికీ.. ప్రాణాంతక ఆయుధ సంపత్తి విషయంలో అగ్రదేశాలు వెనక్కి తగ్గడంలేదు. ప్రకృతి విపత్తులకు మించిన ప్రళయం తప్పదని తెలిసినప్పటికీ.. అమెరికా, రష్యా, భారత్, చైనా సహా 9 దేశాలు తమ వార్‌హెడ్‌లను పెంచుకుంటూనే ఉన్నాయి. అణ్వాయుధ నిల్వలతో పోల్చితే ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్న వార్‌హెడ్‌ల సంఖ్య ఈ ఏడాది పెరిగినట్లు స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎస్‌ఐపీఆర్‌ఐ) ప్రకటించింది.

కొవిడ్‌ సంక్షోభంలోనూ ప్రపంచ దేశాలు తమ ఆయుధ సంపత్తిని పెంచుకుంటూనే ఉన్నాయి. సైనిక సంపత్తితో పాటు అణ్వాయుధాలను సైతం అగ్ర దేశాలు పోగేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది అణు వార్‌హెడ్‌ల సంఖ్య పెరిగిందని ఎస్‌ఐపీఆర్‌ఐ వెల్లడించింది. అణ్వాయుధ సంపద గల అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్‌, చైనా, భారత్‌, పాకిస్థాన్‌, ఇజ్రాయిల్‌, ఉత్తర కొరియా దేశాల అణ్వాయుధాలు 2021 ఆరంభంలో 13,080 వరకు ఉన్నాయని తెలిపింది. అంతకుముందున్న 13,400 అణ్వాయుధాలతో పోలిస్తే.. వీటి సంఖ్య ఈ ఏడాది ఆరంభానికి కొంత తగ్గినట్లే కనిపించిందని పేర్కొంది. అయితే ఏ క్షణమైనా ప్రయోగించేందుకు సిద్ధంగా మోహరించిన అణ్వాయుధాల సంఖ్య గతేడాది 3,720 ఉండగా.. ఈ సంవత్సరం 3,825కు పెరిగినట్లు ఎస్‌ఐపీఆర్‌ఐ వివరించింది.

ప్రచ్ఛన్న యుద్ధకాలం నుంచి పోటీపడి అణ్వాయుధాలను పెంచుకున్న అమెరికా, రష్యా 2010లో కుదిరిన ఒప్పందం మేరకు వ్యూహాత్మక అణ్వాయుధ బలగాలను నిర్ణీత పరిమితి మేరకే కొనసాగిస్తున్నాయి. న్యూస్టార్ట్‌గా పిలిచే ఈ అణ్వాయుధ నియంత్రణ ఒప్పందాన్ని మరో ఐదేళ్లు పొడిగించేందుకు ఫిబ్రవరిలో అమెరికా, రష్యా అంగీకరించాయి. తద్వారా ఈ ఒప్పందం 2026 ఫిబ్రవరి 5వ తేదీ వరకు అమల్లో ఉండనుంది. ఈ ఒప్పందం ప్రకారం రెండు దేశాలు 1550 అణు వార్‌హెడ్‌లు, 800 లాంచర్లు, 700 క్షిపణులు కలిగి ఉండాలి.
న్యూస్టార్ట్‌ ఒప్పందం మేరకు 2018 నుంచి ఇరు దేశాలు అణ్వాయుధాల నిల్వ పరిమితి పాటిస్తున్నప్పటికీ అణ్వాయుధ మోహరింపులు మాత్రం ఎక్కువగానే ఉంటున్నాయని ఎస్‌ఐపీఆర్‌ఐ తెలిపింది. ఈ సంస్థ వివరాల ప్రకారం.. 2020లో అమెరికా, రష్యా తమ అణ్వాయుధాలను తగ్గించుకునే ప్రక్రియను కొనసాగించాయి. 2021 ఆరంభానికి మాత్రం రెండు దేశాల అణు వార్‌హెడ్‌ల మోహరింపులు అంతకు ముందు ఏడాదితో పోలిస్తే మరో 50 వరకు పెరిగాయని ఎస్‌ఐపీఆర్‌ఐ వెల్లడించింది.

అమెరికా, రష్యా మధ్య కుదిరిన న్యూస్టార్ట్‌ ఒప్పందం.. వాటి అణు వార్‌హెడ్‌ల సంఖ్యను ఏమాత్రం నియంత్రించలేకపోతోందని పేర్కొంది. అగ్రదేశాలకు దీటుగా కండబలాన్ని పెంచుకుంటున్న చైనా.. తన అణ్వాయుధ సంపత్తిని మరింత ఆధునికీకరించి, విస్తరించుకుంటోందని వివరించింది. చైనా బాటలోనే భారత్‌, పాకిస్థాన్‌ సైతం అణ్వస్త్రాలకు పదును పెడుతున్నాయని తెలిపింది. భారత్‌, చైనా, పాకిస్థాన్‌ కలిసి 2020లో 41 అణ్వాయుధాలను పెంచుకున్నట్లు పేర్కొంది. భారత్‌ తన అణ్వాయుధాలను 2021 జనవరి నాటికి 150 నుంచి 156కు పెంచుకున్నట్లు వెల్లడించింది. ఇదే సమయంలో చైనా తన అణు సంపత్తిని 320 నుంచి 350కు.. పాకిస్థాన్‌ 160 నుంచి 165కు పెంచుకున్నట్లు ఎస్‌ఐపీఆర్‌ఐ వివరించింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని