Anand Mahindra: ఈ ధైర్యం పేరు జస్‌ప్రీత్‌.. వివరాలు చెప్పండి ప్లీజ్‌: ఆనంద్‌ మహీంద్రా

తల్లిదండ్రుల తోడు లేకపోయినా.. చదువుతో పాటు తన సోదరి బాధ్యతను మోస్తూ ముందుకెళ్తున్న పదేళ్ల కుర్రాడిపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా ప్రశంసలు కురిపించారు.

Published : 06 May 2024 17:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆడుతూపాడుతూ సంతోషంగా గడపాల్సిన తన బాల్యాన్ని.. బాధ్యతల బరువును భుజాన మోస్తున్నాడు ఓ పదేళ్ల కుర్రాడు. ఓవైపు సొంతంగా చదువుకుంటూనే, తన సోదరి బాగోగులు చూసుకుంటూ నిర్విరామంగా కాలంతో పాటు పరుగులు పెడుతున్నాడు. ఎవరిపైనా ఆధారపడకుండా స్ట్రీట్‌ ఫుడ్‌ సెంటర్‌ను నడుపుతూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. వైరల్‌గా మారిన ఈ బాలుడి వీడియోను ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లో షేర్‌ చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) ప్రశంసల జల్లు కురిపించారు.

దిల్లీకి చెందిన జస్‌ప్రీత్‌ తండ్రి అనారోగ్య కారణాల వల్ల ప్రాణాలు కోల్పోయారు. పిల్లలను చూసుకోలేనంటూ అతడి తల్లి పిల్లలను విడిచి వెళ్లిపోయింది. అయినా.. అధైర్యపడకుండా చిరునవ్వుతో కష్టాలను స్వీకరించాడు. తన అక్క బాధ్యతను తన చిన్న భుజాలకెత్తుకున్నాడు. చదువు కొనసాగిస్తూనే బతుకుతెరువు కోసం సాయంత్రం రోడ్డు పక్కన ఫుడ్‌ సెంటర్‌ నడుపుతున్నాడు. ఈ వీడియో మహీంద్రా కంటపడటంతో ఆ బాలుడిని ఆదుకునేందుకు ఆయన ముందుకొచ్చారు.

చిన్ననాటి బెత్తం దెబ్బలు మరవలేను: సీజేఐ

‘‘ఈ ధైర్యం పేరు జస్‌ప్రీత్‌. బాధ్యత కారణంగా తన చదువుకు ఎలాంటి ఆటంకం కలగకూడదు. అందుకోసం ఆ బాలుడిని చదివించేందుకు మహీంద్రా ఫౌండేషన్‌ ముందుకొచ్చింది. అతడి వివరాలు తెలిస్తే దయచేసి నాకు తెలియజేయండి’’ అని మహీంద్రా కోరారు. ఆయన పోస్టుకు స్పందించిన నెటిజన్లు.. ‘‘ఈ బాలుడి నిర్ణయం ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతోంది. జీవితంలో ఉన్నతస్థాయిలో నిలుస్తాడు’’ అని ఒకరు.. ‘‘బాలుడి చదువును ప్రోత్సహించేందుకు చొరవ చూపుతున్న మహీంద్రా గ్రూప్‌ నిర్ణయం అభినందనీయం’’ అంటూ కామెంట్లు గుప్పించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని