Top Ten News @ 5PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 06 May 2024 16:59 IST

1. ఏపీ నూతన డీజీపీగా హరీశ్‌కుమార్‌ గుప్తా

ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీగా 1992 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన హరీశ్‌కుమార్‌ గుప్తాను ఎన్నికల సంఘం నియమించింది. తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా సీఎస్‌ జవహర్‌రెడ్డికి సమాచారం అందించింది. ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌పై ఆదివారం కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. మీ ఆస్తులు కొట్టేసేవాడు కావాలా? పెంచేవాడు కావాలా?: చంద్రబాబు

సైకో జగన్‌ను నమ్మి మరోసారి మోసపోవద్దని.. రాష్ట్ర ప్రభుత్వంపై కోపాన్ని, ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో చూపించాలని ప్రజలకు తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) పిలుపునిచ్చారు. ఈనెల 13న జరిగే ఎన్నికల్లో వైకాపాను చిత్తుచిత్తుగా ఓడించాలన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాల జిల్లా పాణ్యంలో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. అణ్వాయుధాల కసరత్తు మొదలుపెట్టండి - సైన్యానికి పుతిన్‌ ఆదేశం

ఉక్రెయిన్‌పై సుదీర్ఘకాలంగా యుద్ధం కొనసాగిస్తోన్న రష్యా (Russia).. తమ లక్ష్యం నెరవేరేవరకూ దాడులు చేస్తామని చెబుతోంది. ఈ క్రమంలో అణ్వాయుధాల ప్రయోగానికీ వెనకాడబోమని హెచ్చరిస్తోంది. ఈనేపథ్యంలో మరింత దూకుడు పెంచిన అధ్యక్షుడు పుతిన్‌.. ఉక్రెయిన్‌ సమీపంలో అణ్వాయుధాల విన్యాసాలు మొదలుపెట్టాలని తన సైన్యాన్ని ఆదేశించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. వైకాపా పాలనలో అభివృద్ధి సున్నా.. అవినీతి వందశాతం: మోదీ

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందాలంటే డబుల్‌ ఇంజిన్‌ సర్కారు ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ (PM Modi) అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ‘గోదావరి మాతకు ప్రణామాలు.. ఈ నేల మీదే ఆదికవి నన్నయ్య తొలి కావ్యం రాశారు. ఇక్కడి నుంచే ఇప్పుడు కొత్త చరిత్ర లిఖించబోతున్నాం’ అంటూ మోదీ తెలుగులో తన ప్రసంగం ప్రారంభించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. రూ.15వేల జీతగాడి ఇంట్లో రూ.25 కోట్లు.. ఎవరీ మంత్రి అలంఘీర్‌ ..?

సార్వత్రిక ఎన్నికల వేళ రాంచీలో గుట్టలుగా డబ్బులు బయటపడటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే లెక్కలో చూపని రూ.25 కోట్లను ఓ హౌస్‌ కీపర్‌ ఇంటి నుంచి స్వాధీనం చేసుకొన్నారు. సదరు వ్యక్తికి ఆ రాష్ట్ర మంత్రి అలంఘీర్‌ ఆలం(Alamgir Alam)తో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. రహదారిపై గుంతలకు NHAI కొత్త టెక్నిక్‌.. వాటంతట అవే పూడుకునేలా.!

దేశంలో రహదారులు రోజురోజుకూ విస్తరిస్తున్నా.. గుంతల సమస్య మాత్రం ఇప్పటికీ వాహనదారులను వేధిస్తూనే ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు గుంతలతో అధ్వానంగా దర్శనమిస్తున్నాయి.  దీనికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) పరిష్కారం కనుక్కునేందుకు సిద్ధమైంది. రహదారిపై గుంత ఏర్పడినప్పుడు దానంతట అదే పూడుకుపోయే సాంకేతికతతో పని చేస్తోంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. సిరా గుర్తు వేసే వేలు లేకపోతే..?

పోలింగ్ రోజు ఓటరు ఓటేసినట్లు తెలిసేందుకు, అదే ఓటరు మళ్లీ ఓటు వేయకుండా ఉండేందుకు సిబ్బంది ఓటరు ఎడమ చేతి చూపుడు వేలికి సిరా గుర్తు పూస్తారు. ఈ సంగతి అందరికీ తెలిసిందే. కానీ, ఓటరుకు ఎడమ చేతికి చూపుడు వేలు లేకపోతే ఏ వేలికి సిరా గుర్తు వేయాలో కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. బీజేడీ హయాంలోనూ దోపిడీ.. నవీన్‌ పట్నాయక్‌పై మోదీ విమర్శలు

పలు సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపిన బిజూ జనతాదళ్‌పై (BJD) ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. సార్వత్రిక ఎన్నికల వేళ ఈ అరుదైన పరిణామం చోటుచేసుకుంది. ఒడిశా అభివృద్ధి కాకపోవడానికి లోపాలను ఎత్తి చూపుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌, బీజేడీ హయాంలో ఒడిశా దోపిడీకి గురైందని ఆరోపించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. రోజంతా ఒడుదొడుకుల్లో.. చివరికి ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు (stock market) ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. రోజంతా ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. ఆస్ట్రేలియాలో కత్తి దాడిలో భారత విద్యార్థి మృతి

 కత్తి పోట్లకు గురై ఆస్ట్రేలియా (Australia)లో భారత విద్యార్థి నవ్‌జీత్ సంధు మృతి చెందారు. భారత విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో అతడు ప్రాణాలు కోల్పోయాడని మృతుడి బంధువు యష్‌వీర్ వెల్లడించారు. మెల్‌బోర్న్‌లో శనివారం రాత్రి జరిగిన ఘటనలో మరో విద్యార్థి గాయాలపాలయ్యారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని