close

తాజా వార్తలు

Updated : 05/05/2021 12:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

Corona: కరవు రాష్ట్రమే కట్టడి చేస్తోంది..!

  కొవిడ్‌ను సమర్థంగా నియంత్రిస్తున్న ఒడిశా

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

వరదలు.. తుపాన్లు.. కరవు.. సునామీ ఇలా ఆ రాష్ట్రం ఎదుర్కోని కష్టం లేదు. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందంటే అక్కడి ప్రజలకు గండమే.. దేశంలో కరవు వస్తోందంటే తొలుత  పలుకరించే ప్రాంతాల్లో అది కూడా ఒకటి. ఏటా ఏదో ఒక ప్రకృతి సమస్య వేధిస్తూనే ఉంటుంది. ఇవన్నీ కలిపి ఆ రాష్ట్రాన్ని ముప్పులు ఎదుర్కొనేలా.. ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండేట్లు మార్చేశాయి. తాజా మహమ్మారి కొవిడ్‌కు ప్రస్తుతం అప్రమత్తతే సరైన మందు కూడా. దీంతో ఆ రాష్ట్రం ఇప్పటి వరకు కొవిడ్‌ ఆసుపత్రుల్లో సదుపాయాల కొరతను సమర్థంగా ఎదుర్కొంది. అదే ఒడిశా. కరోనా కేసుల కట్టడికి ముందుచూపుతోనే నిర్ణయాలు తీసుకొంటూ.. దేశంలోని ఆక్సిజన్‌ సరఫరా కొరత తీర్చేందుకు వీలైనంత సాయం చేస్తోంది.

దేశ వ్యాప్తంగా ఆక్సిజన్‌ సరఫరాకు కొరత ఏర్పడినప్పుడు ఒడిశా నేనున్నాంటూ ముందుకొచ్చింది. ఏప్రిల్‌ 22 నుంచి మే2 వతేదీ వరకు 3,964 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను 214 కంటైనర్లలో ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, హరియాణా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో కలిపి 10 రాష్ట్రాలకు అందించింది. ఈ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో స్టీల్‌ కర్మాగారాలు ఉన్నాయి. దీంతో ఇక్కడ రోజువారి 350 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం ఉంది. దీనిని మరో 129 మెట్రిక్‌ టన్నుల వరకు పెంచవచ్చని ఆ రాష్ట్ర సీఎస్‌ సురేష్‌ చంద్ర మహాపాత్ర వెల్లడించారు.

‘మొదటి’ నుంచి అప్రమత్తతే...

* దేశంలో కరోనా ఫస్ట్‌ వేవ్‌ సమయంలో ఒడిశా తొందరగానే స్పందించింది. బయట రాష్ట్రాల నుంచి వచ్చేవారిని క్వారంటైన్‌ చేసి పరీక్షలు నిర్వహించి మరీ రాష్ట్రంలోకి వదిలింది. ఇందుకోసం దాదాపు 8,00,000 పడకల సామర్థ్యంతో క్వారంటైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది.

* కొవిడ్‌ సోకితే పేదలు కూడా ప్రొటోకాల్‌ పాటించాలి. ఆ సమయంలో స్వీయనిర్బంధంలో ఉండటంతో ఉపాధి కోల్పోయేవారు. అలాంటి వారికి ఒడిశా ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. దీంతో ప్రజలు స్వచ్ఛందంగానే ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు.

* మాస్కులు పెట్టుకోకుండా.. భౌతిక దూరాలు పాటించకుండా కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకొంది. ఫలితంగా ఆ రాష్ట్రం రూ.25 కోట్లు అపరాధ రుసం వసూలు చేసిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇందులో కూడా ఆర్థిక స్థోమతను బట్టి ఫైన్లు వసూలు చేయడం విశేషం.

‘రెండో’ ముప్పును ముందే పసిగట్టి..

ఇక సెకెండ్‌ వేవ్‌ను అత్యంత వేగంగా పసిగట్టిన రాష్ట్రం ఒడిశానే అని చెప్పవచ్చు. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచే పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నుంచి వచ్చే మార్గాలను సీల్‌ చేసేసింది. బయట ప్రదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చేవారు ఆర్టీపీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్టు తీసుకురావాలన్న నిబంధన విధించింది. లేకపోతే రాష్ట్రంలో అడుగుపెట్టిన వెంటనే ఈ నివేదికలు ఇవ్వని వారిని సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ సెంటర్లకు తరలించింది. ఫలితంగా ఇక్కడ కేసుల సంఖ్య 10 వేల లోపే నమోదవుతోంది.

* సెంకడ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు 50 కొవిడ్‌ డెడికేటెడ్‌ ఆస్పత్రులను సిద్ధం చేసింది. వీటిల్లో 30 ప్రైవేటు ఆసుపత్రులు. వ్యాప్తి ముప్పు ఎక్కువగా ఉండటంతో ఇక్కడ సాధారణ జబ్బులకు చికిత్స చేయరు. దీంతో 11,000 పడకలు అందుబాటులోకి వచ్చాయి. ఏప్రిల్‌లో 27నాటికి కేవలం 35శాతం మాత్రమే వీటిల్లో భర్తీ అయ్యాయి.  ప్రభుత్వం ఐసీయూలకు రూ.5,000, సాధారణ పడకకు రూ.3,000 ఆసుపత్రులకు చెల్లిస్తోంది. ప్రజలకు అత్యవసరాల్లో వినియోగించడానికి ఒక నిధిని కూడా ఏర్పాటు చేసింది.  ఫస్ట్‌వేవ్‌లో కూడా ఒడిశా 40,000 మందిని ఆసుపత్రుల్లో ఉంచి చికిత్సను అందించింది.

లాక్‌డౌన్‌ విషయంలో కూడా తగ్గలేదు..

మే1వ తేదీ నుంచి 10వేల కేసులు నమోదవుతుండటంతో ప్రభుత్వం లాక్‌డౌన్‌పై దృష్టిపెట్టింది. ఏప్రిల్‌ 5వ తేదీ నుంచి 14 రోజుల లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు  2వ తేదీనే ప్రకటించింది. వైద్య నిపుణులు అందరూ ఇప్పుడు లాక్‌డౌన్‌ వైపు మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే.

అంతేకాదు టీకాల విషయంలో కేంద్రంపై ఆధారపడటం  కాలయాపనకు దారితీస్తుందని భావించింది. దీంతో రూ. 2,000 కోట్లు వెచ్చించి 18-45ఏళ్ల మధ్య వారికి టీకా వేయించాలని నిర్ణయించింది.

ప్రకృతి విపత్తులు వచ్చిన ప్రతిసారి ఒడిశా తిరిగి నిలదొక్కుకుంది. 1999లో తుపాను 10,000 మందిని పొట్టనపెట్టుకుంది. 2001లో వరదలు రాష్ట్రంలోని 30 జిల్లాల్లో 25 జిల్లాలను అతలాకుతలం  చేశాయి.  ఆ తర్వాత కరవు కాటకాలు.. ఇలా రాష్ట్రం వరుసగా ప్రకృతితో పోరాడుతూ నిలదొక్కుకుంటోంది. తాజాగా ఆ అనుభవల నుంచి నేర్చుకొన్న పాఠాలే ఒడిశాను ముందుచూపుతో వ్యవహరించేట్లు చేస్తున్నాయి.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని