Corona: 5లక్షల ICU బెడ్లు.. లక్షన్నర డాక్టర్లు కావాలి 

తాజా వార్తలు

Updated : 29/04/2021 20:43 IST

Corona: 5లక్షల ICU బెడ్లు.. లక్షన్నర డాక్టర్లు కావాలి 

పలు సూచనలు చేసిన నారాయణ హెల్త్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ దేవీ ప్రసాద్‌ శెట్టి

దిల్లీ: భారత్‌పై కరోనా మహమ్మారి విశ్వరూపం చూపిస్తోంది. నానాటికీ పెరుగుతున్న కేసుల కారణంగా ఆసుపత్రులన్నీ కరోనా బాధితులతో నిండిపోతున్నాయి. పడకలు దొరక్క.. వైద్యులు అందుబాటులో లేక వైరస్‌ బాధితులు అల్లాడిపోతున్నారు. అయితే రానున్న వారాల్లో ఈ పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారే అవకాశముందని అంటున్నారు ప్రముఖ సర్జన్‌, నారాయణ హెల్త్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ దేవీ ప్రసాద్‌ శెట్టి. మహమ్మారి సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్‌కు అదనంగా మరో 5లక్షల ఐసీయూ పడకలు, 3.5లక్షల వైద్య సిబ్బంది అవసరమని చెప్పారు. ఇటీవల పుణెలోని సింబయాసిస్‌ గోల్డెన్‌ జూబ్లీ లెక్చర్‌ సిరీస్‌లో వర్చువల్‌గా పాల్గొన్న ఆయన.. దేశంలో కరోనా విలయంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహమ్మారిపై పోరులో వైద్య సిబ్బంది కొరతను అధిగమించేందుకు కొన్ని విలువైన సూచనలు కూడా చేశారు. అది ఆయన మాటల్లోనే..

నర్సులు లేక చనిపోయే రోజు వస్తోంది..

‘‘ఆక్సిజన్‌ కొరతతో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న వార్తలు ఇప్పుడు చూస్తున్నాం. కానీ, అతి త్వరలోనే ఐసీయూలో డాక్టర్లు, నర్సులు లేక రోగులు చనిపోతున్నారనే వార్తలు కూడా వినాల్సి వస్తుందనే ఆలోచన రాగానే నా మనసు విలవిల్లాడుతోంది. కానీ, రాబోయే రోజుల్లో అదే జరగనుంది. అందులో నాకు ఎలాంటి అనుమానం లేదు. ప్రస్తుతం ప్రతి పాజిటివ్‌ వ్యక్తి వల్ల మరో 5 నుంచి 10 మంది వైరస్‌ బారిన పడుతున్నారు. వారు టెస్టులు చేయించుకోకపోవడంతో అది బయటపడట్లేదు. అంటే ఈ లెక్కన రోజుకు 15 నుంచి 20లక్షల మంది వరకు కరోనాకు గురవుతున్నారు. సాధారణంగా పాజిటివ్‌ రోగుల్లో కనీసం 5 మందికి ఐసీయూ అవసరం ఉంటుంది. సగటున ఒక రోగి 10 రోజుల పాటు ఐసీయూలో ఉంటారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 75వేల నుంచి 90వేల ఐసీయూ పడకలు ఉంటే అవన్నీ దాదాపు నిండిపోయాయి. రెండో దశలో కరోనా తీవ్ర స్థాయికి చేరుకున్నప్పుడు.. రోజువారీ కేసులు మరింతగా పెరిగే అవకాశముంది. అప్పుడు ఐసీయూల అవసరం భారీగా పెరుగుతుంది. ఆ లెక్కన దాదాపు 5లక్షల ఐసీయూ పడకలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.’’ 

లక్షల మంది ప్రాణదాతలు కావాలి..

‘‘దురదృష్టవశాత్తూ ఐసీయూ పడకలు కాపాడవు. అందులో డాక్టర్లు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది ఉండాలి. మనదేశంలో మహమ్మారి రాకముందే ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యుల కొరత విపరీతంగా ఉండేది. ఇప్పుడు కూడా పరిస్థితిలో పెద్ద తేడా లేదు. ప్రస్తుత ఉద్ధృతి దృష్ట్యా రాబోయే రోజుల్లో 2లక్షల నర్సులు, 1.5లక్షల మంది డాక్టర్ల అవసరం ఉంది. వీరంతా ఏడాదిపాటు కొవిడ్‌పై పోరు సాగించాలి. ఎందుకంటే ప్రస్తుత దశ మరో 4 నుంచి 5 నెలలు ఉండే అవకాశముంది. దాని తర్వాత మూడో దశకు కూడా సిద్ధమవ్వాలి’’

శాంతి కాదు.. యుద్ధం చేయాల్సిన సమయం

‘‘ఇది శాంతంగా ఉండాల్సిన సమయం కాదు.. యుద్ధం చేయాల్సిన సమయం. శత్రుదేశంతో యుద్ధం కోసం సాయుధ బలగాలు ఎలా సిద్ధమవుతాయో.. ప్రభుత్వం కూడా అలా సన్నద్ధమవ్వాలి. మన దేశంలో దాదాపు 2.20లక్షల మంది నర్సింగ్‌ విద్యార్థులు తమ కోర్సులు పూర్తిచేసుకుని పరీక్షల కోసం సిద్ధమవుతున్నారు. వారిని కొవిడ్‌ ఐసీయూ వార్డుల్లో ఏడాది పాటు విధుల్లోకి తీసుకుని ఆ తర్వాత గ్రాడ్యుయేషన్‌ సర్టిఫికేట్లు ఇవ్వాలి. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో వీరికి ప్రాధాన్యమివ్వాలి. ఎందుకంటే ప్రస్తుతం కరోనాపై పోరులో యువ వైద్య సిబ్బంది అవసరమే ఎక్కువగా ఉంది. వారంతా కొవిడ్‌ను ధైర్యంగా ఎదుర్కోగలరు. ఇక 1.30లక్షల మంది యువ డాక్టర్లు వృత్తి చేపట్టకుండా పీజీ కోర్సుల కోసం నీట్‌కు సిద్ధమవుతున్నారు. వెంటనే ఆన్‌లైన్‌లో నీట్‌ పరీక్ష పెట్టి ఫలితాలు ప్రకటించాలి. అందులో ఓ 35లక్షల మంది ఎంపికైనా.. మిగతా దాదాపు లక్ష మంది డాక్టర్లు ఉంటారు. వారికి కొవిడ్‌ ఐసీయూల్లో పనిచేస్తే వచ్చే ఏడాది పీజీ ఎంపిక ప్రక్రియలో ప్రత్యేక అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వాలి. ఇక 90వేల మంది డాక్టర్లు విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసినవారున్నారు. వారిలో కొంతమంది ప్రతిభావంతులను ఎంపిక చేసి కొవిడ్‌ వార్డుల్లో పనిచేస్తే శాశ్వత రిజిస్ట్రేషన్‌ కల్పిస్తామని చెప్పాలి. రాబోయే వారాల్లో ఈ ప్రక్రియను పూర్తిచేసి నర్సులను, వైద్యులను అందుబాటులోకి తీసుకొస్తే కొవిడ్‌ యుద్ధంలో మనం తప్పకుండా గెలుస్తాం’’ అని డాక్టర్‌ శెట్టి విశ్వాసం వ్యక్తం చేశారు.

లేదంటే పరిస్థితి మరింత తీవ్రంగా మారే ప్రమాదముందని హెచ్చరించారు. కేవలం రోగులను ఆసుపత్రిలో చేర్చుకుని వారిని ఆక్సిజన్‌ ఇచ్చినంత మాత్రాన వారి ప్రాణాలను కాపాడలేమని, రోగులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వారి ఆరోగ్య సంరక్షణ చేపట్టేందుకు జూనియర్‌ వైద్యులు చాలా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని