South Africa: లూటీలతో వణికిపోతున్న దక్షిణాఫ్రికా! 

తాజా వార్తలు

Published : 13/07/2021 21:07 IST

South Africa: లూటీలతో వణికిపోతున్న దక్షిణాఫ్రికా! 

తొక్కిసలాటలో 32 మంది మృతి

జోహెన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జైలుకు వెళ్లడంతో మొదలైన ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. కీలక వాణిజ్య కేంద్రాలుగా ఉన్న ప్రావిన్సుల్లో జరుగుతోన్న ఈ ఆందోళన కార్యక్రమాలు.. చివరకు అల్లర్లు, దోపిడీలకు దారితీశాయి. దీంతో గౌటెంగ్‌, క్వాజులు-నాటాల్‌ ప్రావిన్సుల్లో చోటుచేసుకున్న తొక్కిసలాటల్లో ఇప్పటివరకు 32 మంది ప్రాణాలు కోల్పోయినట్లు దక్షిణాఫ్రికా అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఆందోళనకారులు దుకాణాలను లూటీ చేస్తోన్న సమయంలోనే ఈ తొక్కిసలాటలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు.

దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్‌ జుమా(79)కి మద్దతుగా గతవారం ప్రారంభమైన నిరసన కార్యక్రమాలు హింసాత్మకంగా మారాయి. ఇందులో పాల్గొంటున్న ఆందోళనకారులు దోపిడీలకు పాల్పడుతున్నారు. ఇదే అదునుగా భావించిన ప్రజలు, నిరసనకారులు ఆహారం, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, మద్యం, వస్త్రదుకాణాలు, షాపింగ్‌ మాల్స్‌పై దాడి చేసి వాటిని లూటీ చేస్తున్నారు. ఈ సమయంలో జరుగుతోన్న తొక్కిసలాటలో ఇప్పటివరకు 32మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం నిన్న ఒక్కరోజే 26మంది ప్రాణాలు విడిచారు. దీంతో పోలీసులు, సైన్యాన్ని రంగంలోకి దించినప్పటికీ పరిస్థితులు ఇంకా అదుపులోకి రాలేదని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలాఉంటే, 2009 నుంచి 2018 వరకు దాదాపు తొమ్మిదేళ్లపాటు దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ఉన్న జాకబ్‌ జుమాపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. వాటిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. దర్యాప్తు కమిషన్‌ ముందు హాజరు కావాలని జుమాను ఆదేశించినప్పటికీ ఆయన స్పందించలేదు. దీంతో ధిక్కరణ కింద 15నెలల జైలు శిక్ష విధించిన కోర్టు.. పోలీసుల ముందు లొంగిపోవాలని ఆదేశించింది. ఐదారు రోజుల్లో లొంగిపోకపోతే అరెస్టు చేస్తామని పోలీసులు హెచ్చరించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో జైలుకు వెళ్లి లొంగిపోవాల్సి వచ్చింది. ఒక మాజీ అధ్యక్షుడికి జైలు శిక్ష విధించడం దక్షిణాఫ్రికా దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో అక్కడ మొదలైన ఆందోళన కార్యక్రమాలు..చివరకు అల్లర్లు, లూటీలకు దారితీస్తున్నాయి.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని