‘నా భార్య చచ్చిపోతోంది.. అడ్మిట్‌ చేసుకోండి ప్లీజ్‌’ 
close

తాజా వార్తలు

Published : 22/04/2021 18:20 IST

‘నా భార్య చచ్చిపోతోంది.. అడ్మిట్‌ చేసుకోండి ప్లీజ్‌’ 

ఆస్పత్రి సిబ్బందిని ప్రాధేయపడిన భర్త

దిల్లీ: కరోనా సృష్టించిన విలయంతో దేశవ్యాప్తంగా అనేకచోట్ల చోటుచేసుకుంటున్న హృదయవిదారక దృశ్యాలు అందరినీ కలచివేస్తున్నాయి. ఆస్పత్రుల్లో సరిపడా పడకల్లేక, ఆక్సిజన్‌ కొరతతో సకాలంలో వైద్యం అందక కొవిడ్‌ రోగులు, వారి కుటుంబ సభ్యులు పడుతున్న నరకం వర్ణనాతీతం. దిల్లీలో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వైద్య సదుపాయాల కొరతకు తోడు కరోనా రోగుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో మరింత దయనీయ పరిస్థితులు తలెత్తుతున్నాయి. దేశ రాజధాని నగరంలో గురువారం లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ (ఎల్‌ఎన్‌జేపీ) ఆస్పత్రి వద్ద గుండెల్ని పిండేసే ఘటన చోటుచేసుకుంది. అస్లాంఖాన్‌ అనే వ్యక్తి కరోనా సోకిన తన భార్య రుబీఖాన్‌ (30)ని బైక్‌పై ఆస్పత్రికి తీసుకొచ్చారు. అప్పటికే మూడు ఆస్పత్రులకు తీసుకెళ్లినా చేర్చుకోలేదు. దీంతో ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రికి తీసుకొచ్చాడు. తీవ్రంగా అలసిపోయిన అస్లాం నిస్సహాయతతో  ‘నా భార్య చచ్చిపోతోంది.. దయచేసి ఆమెను ఆస్పత్రిలో చేర్చుకోండి’’ అంటూ ఆస్పత్రి సిబ్బందిని ప్రాధేయపడిన దృశ్యాలు అక్కడున్నవారిని కలచివేశాయి.  

మరోవైపు, మెడికల్‌ ఆక్సిజన్‌, వ్యాక్సిన్లు, ఆస్పత్రుల్లో పడకలకు సంబంధించి ప్రభుత్వం నుంచి హామీలు వస్తున్నా.. నానాటికీ పెరిగిపోతున్న కొత్త రోగులతో కొత్త ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రి వద్ద కొవిడ్ రోగులతో అంబులెన్స్‌లు, ప్రైవేటు వాహనాలు భారీగా క్యూకట్టాయి. ఈ రద్దీ మధ్య రోగులు అత్యవసర వైద్యసాయం కోరుతూ అడ్మిషన్‌ కోసం ఎదురుచూపులు చూస్తుండటంతో అక్కడ దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఆస్పత్రిలో పడకలన్నీ నిండిపోయాయని సిబ్బంది చెప్పడంతో కొవిడ్‌ రోగులు, వారి బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని