oxygen : దిల్లీ 4 రెట్లు అదనంగా అడిగింది..! 
close

తాజా వార్తలు

Updated : 25/06/2021 14:08 IST

oxygen : దిల్లీ 4 రెట్లు అదనంగా అడిగింది..! 

* ఫలితంగా 12 రాష్ట్రాలకు కోత
* సుప్రీం ఆడిట్‌ కమిటీ నివేదిక

ఇంటర్నెట్‌డెస్క్‌: కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ సమయంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఆడిట్‌ కమిటీ కీలక విషయాలను వెల్లడించింది. దిల్లీ ప్రభుత్వం తన అవసరాలకు మించి నాలుగు రెట్లు ఎక్కువగా ఆక్సిజన్‌ను కోరినట్లు తేల్చింది. ఏప్రిల్‌-మే నెలల్లో ఆక్సిజన్‌ సరఫరాలో విపరీతమైన కొరత ఏర్పడింది. దీంతో చాలా ఆస్పత్రుల్లో  ప్రాణవాయువు అందక రోగులు కన్నుమూసిన ఘటనలు చోటు చేసుకొన్నాయి. దీంతో దిల్లీ ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఆ సమయంలో హైకోర్టు జోక్యం చేసుకోవడంతో కేంద్రం దిల్లీకి ఆక్సిజన్‌ కేటాయింపులను పెంచింది. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాలకు కేటాయింపులను తగ్గించింది. తాజాగా వచ్చిన ఆడిట్‌ రిపోర్టు ప్రకారం అప్పట్లో దిల్లీకి నిత్యం 300 టన్నుల ప్రాణవాయువు అవసరం కాగా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 1200 టన్నులు డిమాండ్‌ చేసింది. దిల్లీ అదనపు ఆక్సిజన్‌ తీసుకోవడంతో 12 రాష్ట్రాలు తీవ్ర కొరతను ఎదుర్కొన్నట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు.

ఆక్సిజన్‌ ట్యాంకర్లను అన్‌లోడ్‌ చేయకుండా..

దిల్లీ భారీగా ఆక్సిజన్‌ కోరుతుండటంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, ఎం.ఆర్‌.షా ధర్మాసనం 12మంది నిపుణులతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఇది ఆక్సిజన్‌ ఆడిట్‌ నిర్వహించింది. ఈ కమిటీ మే 13వ తేదీన దిల్లీ చేరుకొన్న చాలా ఆక్సిజన్‌ ట్యాంకర్లను ఎక్కడా అన్‌లోడ్‌ చేయకుండా ఉంచేసినట్లు గుర్తించింది. అప్పటికే ఆస్పత్రుల్లోని ట్యాంకులు 75శాతం కంటే అదనంగా ఆక్సిజన్‌తో నిండి ఉన్నాయి. ఎల్‌ఎన్‌జేపీ, ఎయిమ్స్‌లో ఆక్సిజన్‌ ట్యాంకర్లు పూర్తిగా నిండి ఉన్నట్లు గుర్తించింది.

టాస్క్‌ఫోర్స్‌ మరో భారీ లోపాన్ని గుర్తించింది. ఏప్రిల్‌ 29 నుంచి మే 10వ తేదీ మధ్యలో దిల్లీ ఆస్పత్రుల ఆక్సిజన్‌ వినియోగ లెక్కను సవరించాల్సి ఉందని పేర్కొంది. దీనిలో ఆస్పత్రులు ఇచ్చిన నివేదికలో లోపాలు ఉన్నాయని తెలిపింది. సవరించని నివేదిక ప్రకారం రోజు 1140 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అవసరం.. కానీ, సవరించిన లెక్కల ప్రకారం అది రోజుకు 289 మెట్రిక్‌ టన్నులకు తగ్గినట్లు వెల్లడించింది.

దిల్లీలో వినియోగించినట్లు చెబుతున్న ఆక్సిజన్‌ లెక్కల్లో.. వాస్తవంగా అందుబాటులో ఉన్న పడకల ఆధారంగా లెక్కిస్తే వినియోగంలో చాలా తేడా ఉన్నట్లు ఆడిట్‌ కమిటీ గుర్తించింది. డిమాండ్‌ను అంచనా వేయడంలో చురుగ్గా వ్యవహరించకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని పేర్కొంది.

కమిటీ కీలక సూచనలు..

ఈ మొత్తం వ్యవహారాన్ని అధ్యయనం చేసిన ఆడిట్‌ కమిటీ కీలక సూచనలు చేసింది. భవిష్యత్తులో వచ్చే ముప్పులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని పేర్కొంది.

* పెద్ద నగరాల అవసరాల్లో కనీసం 50శాతం ఆక్సిజన్‌ స్థానికంగా లేకపోతే చుట్టుపక్కల తయారు చేసుకొనేలా ప్లాంట్లు ఏర్పాటు చేయాలి.

* జనసాంద్రతను దృష్టిలో పెట్టుకొని దిల్లీ, ముంబయి నగరాలకు ఇది చాలా ముఖ్యం.18 మెట్రో నగరాలు ఆక్సిజన్‌ కోసం ఇతరులపై ఆధారపడకుండా కనీసం 100 మెట్రిక్‌ టన్నుల నిల్వలు ఉంచుకొనేలా ఏర్పాట్లు చేసుకోవాలి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని