తూర్పు లద్దాఖ్‌కు పార్లమెంటరీ కమిటీ!

తాజా వార్తలు

Published : 13/02/2021 10:19 IST

తూర్పు లద్దాఖ్‌కు పార్లమెంటరీ కమిటీ!

బృందంలో రాహుల్, పవార్‌, సంజయ్‌రౌత్‌..

దిల్లీ: తూర్పు లద్దాఖ్‌ సరిహద్దుల్లో పాంగాంగ్‌ సరస్సు వద్ద బలగాల ఉపసంహరణ కోసం భారత్, చైనా మధ్య జరిగిన ఒప్పందం రాజకీయ వివాదానికి తెరలేపిన నేపథ్యంలో పార్లమెంటరీ కమిటీ ఒకటి సరిహద్దు ప్రాంతాలను సందర్శించేందుకు సిద్ధమైంది. ఉద్రిక్తతలు చోటుచేసుకున్న గల్వాన్‌ లోయ, పాంగాంగ్‌ సరస్సు ప్రాంతాల్లో పర్యటించాలని రక్షణశాఖపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ నిర్ణయించింది. అయితే దీనికి ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉంది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. 

భాజపా సీనియర్‌ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి జువల్‌ ఒరామ్‌ అధ్యక్షతన 30 మందితో కూడిన ఈ స్టాండింగ్‌ కమిటీలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ తదితరులు కూడా సభ్యులుగా ఉన్నారు. ఈ ఏడాది మే నెల చివరివారం లేదా జూన్‌లో ఈ కమిటీ తూర్పు లద్దాఖ్‌లో పర్యటించే అవకాశముందని సదరు వర్గాలు తెలిపాయి. ఇటీవల జరిగిన స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో ఈ పర్యటనపై నిర్ణయం తీసుకోగా.. ఆ సమావేశానికి రాహుల్‌ గాంధీ హాజరు కాలేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తేనే ఈ కమిటీ లద్దాఖ్‌ వెళ్తుందని తెలిపింది. 

భారత్‌, చైనా మధ్య దాదాపు 9 నెలల ప్రతిష్టంభనకు తెరపడేలా ఇటీవల రెండు దేశాల మధ్య కీలక ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. పాంగాంగ్‌ సరస్సు ఉత్తర, దక్షిణ భాగాల నుంచి దశలవారీగా రెండు దేశాల బలగాల ఉపసంహరణ చేపట్టాలని భారత్‌, చైనా ఒప్పందానికి వచ్చాయి. దీనిపై రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ గత గురువారం పార్లమెంట్‌లో ప్రకటన చేశారు. అయితే ఈ ఒప్పందాన్ని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. భారత భూభాగాన్ని నరేంద్రమోదీ ప్రభుత్వం చైనాకు వదులుకుందని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై ప్రధాని పార్లెమంట్‌లో ఎందుకు ప్రకటన చేయలేదని ప్రశ్నించిన ఆయన.. రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రకటన బేలగా ఉందని విమర్శించారు. 

అయితే రాహుల్‌ వ్యాఖ్యలను కేంద్రం తీవ్రంగా ఖండించింది.  చైనాతో ఒప్పందంలో భాగంగా భారత భూభాగాన్ని ఏమాత్రం వదులుకోలేదని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం స్పష్టంచేసింది. సైనిక దళాల సామర్థ్యంపై ప్రభుత్వం పూర్తి విశ్వాసాన్ని ఉంచడం వల్లే తూర్పు లద్దాఖ్‌లో దేశ ప్రయోజనాలు, భూభాగాన్ని సమర్థంగా పరిరక్షించగలిగామని పేర్కొంది. 

ఇవీ చదవండి..

సర్కారు.. రాహుల్‌.. సరిహద్దు యుద్ధం!

చైనాకు అడ్డుకోలేరు.. రైతుల్ని బెదిరిస్తారు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని