Modi: మోదీ గొప్ప దార్శనికుడు.. కోట్లాది మంది నాయకుడు

తాజా వార్తలు

Updated : 17/09/2021 12:18 IST

Modi: మోదీ గొప్ప దార్శనికుడు.. కోట్లాది మంది నాయకుడు

ప్రధాని పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షల వెల్లువ

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, సినీ, క్రీడా ప్రముఖులు ఆయనకు సామాజిక మాధ్యమ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, పలువురు కేంద్రమంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు ట్విటర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని, దేశ ప్రజలకు మరిన్ని సేవలందించాలని కోరుకున్నారు. 

> ప్రధాని మోదీకి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని, ఎంతో మందికి స్ఫూర్తి కలిగిస్తూ దేశానికి మరింత సేవ చేయాలని కోరుకుంటున్నా - రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

> ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. అసాధారణ దృక్పథం, ఆదర్శవంతమైన నాయకత్వం, అంకితభావంతో మీరు చేస్తున్న సేవతో ఈ దేశం నలుదిశలా అభివృద్ధి చెందుతోంది. మీరు ఎల్లప్పుడూ సంపూర్ణ ఆరోగ్యంతో, సంతోషంతో ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా - ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

> హ్యాపీ బర్త్‌డే మోదీ జీ - రాహుల్ గాంధీ

> ప్రధాని మోదీ కోట్లాది మంది నాయకుడు ఎందుకంటే ఆయనకు అన్నింటికంటే దేశమే ముందు. దేశం కోసం నిస్వార్థంగా సేవ చేసే వ్యక్తి - భాజపా ఎంపీ గౌతమ్‌ గంభీర్‌

తెలంగాణ గవర్నర్‌, సీఎం శుభాకాంక్షలు..

ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘భారత ప్రధాని నరేంద్రమోదీకి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవుణ్ని ప్రార్థిస్తున్నాను. మీ దార్శనిక నాయకత్వంలో భారత్‌ మరింత అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నా’’ అని గవర్నర్‌ తమిళసై ట్వీట్‌ చేశారు.

మోదీ దార్శనికుడు: పవన్‌ కల్యాణ్‌

మోదీ పుట్టిరోజును పురస్కరించుకుని జనసేన అధినేత, నటుడు పవన్‌ కల్యాణ్‌ ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘ప్రధాని మోదీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మన దేశానికి ధృడ చిత్తం కలిగిన నాయకుడు అవసరమని నేను నిత్యం పరితపించేవాడిని. ఆ నాయకుడు మన విశాల భారత సంస్కృతి సంప్రదాయాలు తెలిసిన రాజనీతిజ్ఞుడై ఉండాలని కోరుకునేవాణ్ణి. ముఖ్యంగా భిన్న మతాలు, భిన్న జాతులు, భిన్న సంస్కృతులు, భిన్న ఆచార వ్యవహారాలు కలిగిన ఒక బిలియన్ ప్రజల భూమిని పాలించడం అంటే.. కత్తి మీద సాము లాంటిదే. ఆ స్థానంలో ఉండటం ఎంతటివారికైనా సవాళ్లతో కూడుకున్నదే. అటువంటి స్థానంలో నిలిచిన మోదీని.. నేను గొప్ప దార్శనికునిగా భావిస్తాను. 2014 సార్వత్రిక ఎన్నికల సందర్బంగా ఆయనతో కలసి అనేక సభలలో ప్రచారం చేసే అవకాశం నాకు లభించింది. ఆయనలోని ఆకర్షణ శక్తిని  సునిశితంగా గమనించడానికి ఆ ప్రయాణం నాకు దోహదపడింది. 71వ జన్మదినం జరుపుకొంటున్న ప్రధానికి శుభాకాంక్షలు. ఆయనకు ఆయురారోగ్యాలతో కూడిన దీర్ఘాయువును ఆ ఆదిపరాశక్తి ప్రసాదించాలని కోరుకుంటున్నాను’’ అని పవన్ కల్యాణ్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.







Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని