ఉగ్రవాద నిరోధ చట్టాన్ని అందుకు వాడొద్దు..!

తాజా వార్తలు

Published : 13/07/2021 23:25 IST

ఉగ్రవాద నిరోధ చట్టాన్ని అందుకు వాడొద్దు..!

దిల్లీ: ఉగ్రవాద నిరోధ చట్టాన్ని అసమ్మతి అణచివేతకు ఉపయోగించొద్దని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డాక్టర్‌ ధనంజయ యశ్వంత్‌ చంద్రచూడ్‌ సూచించారు. అమెరికా, భారత్‌ మధ్య న్యాయపరమైన సంబంధాలపై సోమవారం నిర్వహించిన ఇండో-యూఎస్‌ సంయుక్త సదస్సులో ఆయన మాట్లాడారు. ఆ చట్టం సహా  ఇతర క్రిమినల్‌ చట్టాలనూ ప్రజలను హింసించేందుకు దుర్వినియోగం చేయొద్దని సూచించారు. ఆర్నాబ్‌ గోస్వామి వర్సెస్‌ స్టేట్ కేసులో తాను తీర్పు ఇచ్చినట్టుగా పౌరుల స్వేచ్ఛను కాపాడేందుకు న్యాయస్థానాలు ప్రాధాన్యమివ్వాలని పేర్కొన్నారు.  పౌరులు ఒక్కరోజు స్వేచ్ఛను  కోల్పోయినా అది తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని చెప్పారు.

భారత్‌-అమెరికా సంబంధాలపై ఈ సందర్భంగా  జస్టిస్‌ చంద్రచూడ్‌  పలు అంశాలు వెల్లడించారు. స్వేచ్ఛ, వాక్‌ స్వాతంత్ర్యం, భావవ్యక్తీకరణ స్వేచ్ఛలను ప్రోత్సహించడంలో అమెరికా దిక్సూచిలా వ్యవహరిస్తోందని తెలిపారు. భారత్‌ను పురాతన, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఆయన అభివర్ణించారు.  విభిన్న సంస్కృతులు సహా బహుళవాద సమాజ ఆదర్శాలను  ఈ దేశం సూచిస్తుందన్నారు. మానవహక్కుల పరిరక్షణకు భారత రాజ్యాంగం అత్యంత ప్రాధాన్యమిస్తుందని నొక్కి చెప్పారు. భారత్, అమెరికాల్లోని సర్వోన్నత న్యాయస్థానాలను  తమ సొంత దేశాల్లో అత్యంత శక్తివంతమైన కోర్టులుగా పరిగణిస్తారని పేర్కొన్నారు. భారత న్యాయశాస్త్రంపై అమెరికా ప్రభావాన్ని తక్కువ చేయలేమని ఆయన వివరించారు.  భారత్‌లో స్వలింగ సంపర్కానికి సంబంధించిన కేసులో అమెరికా సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఆధారంగా తాను నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.

చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధ చట్టం(యూఏపీఏ) కింద అరెస్టయిన ఫాదర్‌ స్టాన్‌ స్వామి(84) గత వారం ముంబయిలో మరణించి సంగతి తెలిసిందే.  అయితే ఆయన మృతి పట్ల వ్యక్తమవుతున్న భిన్నాభిప్రాయాల నేపథ్యంలో ఈ చట్టాల అమలు తీరుపై  జస్టిస్‌ చంద్రచూడ్‌ పై విధంగా స్పందించారు.  యూఏపీఏ చట్టం కింద నమోదు చేసిన పలు ఇతర కేసులు సైతం ఇటీవల వార్తల్లో నిలిచాయి. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పోరాడుతున్న అసోం నేత అఖిల్‌ గొగొయ్‌ను ఇదే చట్టం కింద అరెస్టు చేశారు. సుమారు ఏడాదిన్నర తర్వాత ఆయన జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని