AP News: విశాఖలో ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌

తాజా వార్తలు

Published : 20/07/2021 12:49 IST

AP News: విశాఖలో ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌

కృష్ణపట్నంలో ఎల్జీ పాలిమర్స్‌ ఏర్పాటు

ఈనాడు-అమరావతి: విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ స్థానంలో ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ గృహోపకరణాల తయారీ ప్లాంటును ఏర్పాటు చేయాలని ఆ సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వంతో సంప్రదింపులు కొలిక్కివచ్చినట్లు సమాచారం. 2020 మే 7న విశాఖపట్నంలోని ఎల్‌జీ పాలిమర్స్‌లో స్టైరీన్‌ గ్యాస్‌ ట్యాంక్‌ లీకేజీ దుర్ఘటనలో 13 మంది మృతి చెందటం జాతీయ స్థాయిలో సంచలనమైంది. అప్పటి నుంచి ప్లాంటు మూతపడింది. ఇందులో పనిచేస్తున్న సుమారు 500 మంది ఉపాధి ప్రశ్నార్థకంగా మారింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో మరో చోట భూములను కేటాయించేలా పరిశ్రమ యాజమాన్యంతో అధికారులు జరిపిన సంప్రదింపులు కొలిక్కివచ్చాయి.

విశాఖలో రిఫ్రిజిరేటర్ల తయారీ యూనిట్‌

ఎల్‌జీ పాలిమర్స్‌కు విశాఖలో సుమారు 200 ఎకరాల భూమి ఉంది. దీని చుట్టూ సుమారు 2 కి.మీల పరిధిలోనే అయిదారు గ్రామాలు ఉన్నాయి. హానికర రసాయనాలను వినియోగించే పరిశ్రమలను నివాస ప్రాంతాలకు దూరంగా తరలించాలని ఎల్‌జీ దుర్ఘటన తర్వాత ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల నుంచి కూడా తీవ్ర ఒత్తిడి వచ్చింది. ప్రమాద దుర్ఘటనపై విచారణ నిర్వహించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్‌ నేతృత్వంలోని ఉన్నతస్థాయి అధికారుల కమిటీ కూడా పరిశ్రమను ఊరికి దూరంగా తరలించాలని నివేదిక ఇచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని అక్కడ గ్రీన్‌ కేటగిరి పరిధిలోకి వచ్చే ఎల్‌జీ రిఫ్రిజిరేటర్ల తయారీ ప్లాంటును ఏర్పాటు చేయాలని యాజమాన్యం నిర్ణయించింది.

కృష్ణపట్నంపై ఆసక్తి 

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భూములను ఎల్‌జీ యాజమాన్యం పరిశీలించింది. ప్రధానంగా పోర్టుకు అనుసంధానంగా కనీసం 100 ఎకరాలను పరిశ్రమ కోసం కేటాయించాలని సంస్థ కోరింది. సంస్థ కోరిన విధంగా విశాఖలో భూములు ఇచ్చే పరిస్థితి లేదు. దీనికి ప్రత్యామ్నాయంగా కృష్ణపట్నంలో పాలిమర్స్‌ ప్లాంటు ఏర్పాటుకు సుముఖత చూపుతున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ప్రభుత్వంతో త్వరలో సంస్థ యాజమాన్యం సమావేశమై భూములపై ఒక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని ఒక అధికారి చెప్పారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని