అంతరాయం సభా ధిక్కరణే

ప్రధానాంశాలు

Updated : 19/09/2021 09:46 IST

అంతరాయం సభా ధిక్కరణే

రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్య నాయుడు

ఈనాడు, దిల్లీ: ‘‘చట్టసభలకు అంతరాయం కలిగించడం సభా ధిక్కరణే. అలాచేసే ప్రత్యేక అధికారాలేమీ సభ్యులకు లేవు. పార్లమెంటు సభ్యులకున్న ప్రత్యేక అధికారాలన్నీ పరోక్షంగా ప్రజల హక్కులే’’ అని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ‘‘పార్లమెంటరీ కార్యక్రమాలకు అంతరాయం కలిగించడం ఎంపీల ప్రత్యేక అధికారమా? లేదంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో భాగమా?’’ అన్న అంశంపై జరిగిన దివంగత రామ్‌జఠ్మలానీ రెండో స్మారకోపన్యాస కార్యక్రమంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. సభలో సభ్యులు ఉన్నతంగా ప్రవర్తించే విధంగా నిబంధనలు అమలు చేయాల్సిన అవసరం గురించి చెప్పారు. అంతరాయాలు కలిగించడం వల్ల సభలు ఉమ్మడిగా, సభ్యులు వ్యక్తిగతంగా సమర్థŸమైన పనితీరు ప్రదర్శించే అవకాశం లేకుండా పోతోందని పేర్కొన్నారు. ‘‘ఒకవేళ ఎంపీలు ప్రత్యేక హక్కులు కోరుకొనేట్లయితే వారు సభా నిబంధనలు, ప్రవర్తనా నియమావళి, పార్లమెంటరీ మర్యాదలకు కట్టుబడి ఉండాలి. తమను ఎన్నుకున్న ప్రజల గొంతుకలను నిర్భయంగా వినిపించేందుకు ఈ ప్రత్యేక హక్కులు ఇచ్చారు. అందువల్ల వీటిని ప్రజల పరోక్ష హక్కులుగానే భావించాల్సి ఉంటుంది.అన్ని రాజకీయ పార్టీలు, కార్యనిర్వాహక వ్యవస్థ ఆత్మపరిశీలన చేసుకొని నిరంతరంగా సాగుతున్న చట్టసభల అంతరాయాలకు మంగళం పాడాల్సిన అవసరం ఉంది’’ అని ఆయన పిలుపునిచ్చారు.

ప్రశ్నించే సీజేఐ వచ్చారు: టీఎంసీ ఎంపీ

ఈ సమావేశంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణను ప్రశంసించారు. ఇన్నాళ్లకు ప్రశ్నించే ప్రధాన న్యాయమూర్తి వచ్చారని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వానికి కఠిన ప్రశ్నలు వేస్తూ జస్టిస్‌ రమణ మంచి పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ‘‘ఈరోజు నిస్సిగ్గుతనం కొత్త విధానంగా మారిపోయింది. మన నాయకులు కనీసం సుప్రీంకోర్టు జారీచేసే నిర్దేశాలను లెక్కచేయని పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు మనకు దేవుడి దయవల్ల వ్యవస్థల మధ్య అధికారాల విభజనను అర్థం చేసుకొని, ప్రభుత్వాన్ని కఠినంగా ప్రశ్నించే ప్రధాన న్యాయమూర్తి వచ్చారు’’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు, అటార్నీ జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌, సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, పార్లమెంటు సభ్యుడు మహేష్‌ జెఠ్మలానీ, మాజీ సొలిసిటర్‌ జనరళ్లు గోపాల్‌ సుబ్రమణియన్‌, రంజిత్‌ కుమార్‌ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

మహిళలపై వివక్ష తగదు

మహిళలపై వివక్ష చూపడాన్ని ఆపాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. పార్లమెంటు ప్రాంగణంలో జరిగిన మహాకవి సుబ్రహ్మణ్య భారతి శత వర్ధంతి కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. భారతీయ సంస్కృతిలో మహిళలకు ఎంతో ప్రముఖ స్థానం ఉందని, దాన్ని కాపాడుకోవాలని అన్నారు. మహిళల సమానత్వం కోసం మహాకవి రాసిన కవిత్వాన్ని, చేసిన కృషిని ప్రస్తావించారు.
Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన