కనకం లేదు.. ఇక కంచు కోసమే

ప్రధానాంశాలు

Published : 05/08/2021 03:04 IST

కనకం లేదు.. ఇక కంచు కోసమే

 సెమీస్‌లో భారత్‌కు పరాజయం

అర్జెంటీనా చేతిలో ఓటమి

బ్రిటన్‌తో కాంస్య పోరు

వరుస పరాజయాలను దాటి.. అంచనాలను మించి.. టోక్యోలో భారత అమ్మాయిలు సాగించిన అద్భుత ప్రయాణం.. పసిడి పోరును చేరలేకపోయింది. తొలి సారి ఒలింపిక్స్‌లో సెమీస్‌ చేరి చరిత్ర సృష్టించిన మన జట్టు.. అదే ఊపులో ఫైనల్‌కు అర్హత సాధిస్తుందనే ఆశలు నెరవేరలేదు. క్వార్టర్స్‌లో మూడు సార్లు ఒలింపిక్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాకు షాకిచ్చిన రాణి రాంపాల్‌ సేన.. సెమీస్‌లో మాత్రం ఆ ప్రదర్శనను పునరావృతం చేయలేకపోయింది. బలమైన అర్జెంటీనాతో పోరాడినా.. పరాజయం తప్పలేదు. ఓ వైపు జట్టు ఫైనల్‌ చేరలేదనే బాధ కలిగినప్పటికీ.. కాంస్యం గెలిచేందుకు మరో అవకాశం మిగిలే ఉండడం కాస్త సంతోషాన్ని కలిగించే విషయమే. కంచు పతకం కోసం భారత్‌.. శుక్రవారం బ్రిటన్‌తో తలపడనుంది.

టోక్యో

లింపిక్స్‌లో తొలిసారి ఫైనల్‌ చేరాలనే భారత హాకీ జట్టు ఆశలపై అర్జెంటీనా నీళ్లు చల్లింది. టోక్యోలో పోరాట స్ఫూర్తితో సాగుతోన్న మన అమ్మాయిలు జోరుకు ప్రత్యర్థి అడ్డుకట్ట వేసింది. బుధవారం సెమీస్‌లో భారత్‌ 1-2 తేడాతో అర్జెంటీనా చేతిలో ఓడింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న ప్రత్యర్థితో మ్యాచ్‌లో ఏడో ర్యాంకర్‌ భారత్‌ గట్టిగానే పోరాడినప్పటికీ విజయాన్ని అందుకోలేకపోయింది. మ్యాచ్‌ను గొప్పగా ఆరంభించిన భారత్‌ మధ్యలో పట్టు విడిచింది. పోరు మొదలైన రెండు నిమిషాలకే గోల్‌ చేసి ప్రత్యర్థిని షాక్‌లోకి నెట్టింది. క్వార్టర్స్‌లో గెలుపు గోల్‌తో జట్టుకు చారిత్రక విజయాన్ని అందించిన గుర్జీత్‌ కౌర్‌.. సెమీస్‌లోనూ లభించిన తొలి పెనాల్టీ కార్నర్‌ను సద్వినియోగం చేసింది. తనదైన డ్రాగ్‌ఫ్లిక్‌తో ప్రత్యర్థి డిఫెండర్లు, గోల్‌కీపర్‌ను తప్పించి బంతిని లోపలికి పంపించింది. ఆ గోల్‌ ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో భారత్‌ జోరు ప్రదర్శించింది. బలమైన ప్రత్యర్థి అటాకింగ్‌ విభాగాన్ని సమర్థంగా నిలువరించింది. తొలి క్వార్టర్‌ ముగిసేసరికి భారత్‌ ఆధిక్యంలో ఉండడంతో.. మరో మూడు క్వార్టర్స్‌నూ ఇలాగే పూర్తి చేస్తే మ్యాచ్‌ మనదే అనిపించింది. కానీ..

అక్కడి నుంచి..: రెండో క్వార్టర్‌ నుంచి అర్జెంటీనా ఆటే మారిపోయింది. ఆ జట్టు కెప్టెన్‌ మారియా (18వ, 36వ నిమిషాల్లో) రెండు పెనాల్టీ కార్నర్స్‌ను గోల్స్‌ చేసి మ్యాచ్‌ను లాగేసుకుంది. రెండో క్వార్టర్‌ ఆరంభమైన రెండు నిమిషాలకే ప్రత్యర్థికి రెండు పెనాల్టీ కార్నర్‌ అవకాశాలు వచ్చాయి. అందులో రెండోదాన్ని గోల్‌గా మలచిన మారియా స్కోరు సమం చేసింది. రెండో క్వార్టర్‌ ముగిసేసరికి రెండు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. మూడో క్వార్టర్‌లో గోల్స్‌ కోసం దాడులు పెంచిన అర్జెంటీనా మరో పెనాల్టీ కార్నర్‌తో గోల్‌ సాధించి ఆధిక్యంలోకి వెళ్లింది. మారియా కొట్టిన బంతి సుశీలా కాళ్లకు తాకుతూ వెళ్లి గోల్‌పోస్టులో పడింది.  చివరి క్వార్టర్‌లో స్కోరు సమం చేసేందుకు భారత్‌ ఎంతగానో ప్రయత్నించినా ప్రత్యర్థి డిఫెన్స్‌ను దాటలేకపోయింది. నిమిషాలు గడుస్తుండడంతో భారత్‌కు ఓటమి ఖాయమనే ఆందోళన పెరిగింది. 51వ నిమిషంలో మరో పెనాల్టీ అవకాశం దక్కడంతో.. జట్టు గోల్‌ చేసి స్కోరు సమం చేస్తుందనే ఆశలు కలిగాయి. కానీ గుర్జీత్‌ డ్రాగ్‌ఫ్లిక్‌ను అడ్డుకున్న ప్రత్యర్థి గోల్‌కీపర్‌.. మ్యాచ్‌ ముగిసేందుకు 17 సెకన్ల ముందు భారత్‌కు మరో గోల్‌ కాకుండా మళ్లీ ఆపింది. దీంతో ఓటమి తప్పని అమ్మాయిలు నిరాశలో మునిగిపోయారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన