ఉత్తర హిందూ మహాసముద్రంలో భీకరంగా మారుతున్న తుపాన్లు

ప్రధానాంశాలు

Updated : 01/08/2021 05:59 IST

ఉత్తర హిందూ మహాసముద్రంలో భీకరంగా మారుతున్న తుపాన్లు

భూతాపం కారణంగానే వాతావరణంలో మార్పులు

ఐఐటీ-ఖరగ్‌పుర్‌ పరిశోధన

దిల్లీ: ఉత్తర హిందూ మహాసముద్ర ప్రాంతంలో భీకర తుపాన్ల తీవ్రత నాలుగు దశాబ్దాలుగా క్రమంగా పెరుగుతున్నట్టు ఐఐటీ-ఖరగ్‌పుర్‌ అధ్యయనం వెల్లడించింది. ఈ పరిణామం కారణంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత పెరుగుతోందని, మధ్య వాయు మండలంలో తేమ ఎక్కువవుతోందని, వాతావరణంలో వాయు వేగం, గమనాలు బలహీనపడుతున్నాయని పేర్కొంది. ఫలితంగా తీవ్ర సామాజిక, ఆర్థిక సమస్యలు తలెత్తుతున్నాయని వివరించింది. భూతాపం కారణంగానే ఇదంతా చోటుచేసుకుంటోందని హెచ్చరించింది. వెల్లూరులోని వీఐటీ విశ్వవిద్యాలయం కూడా పాల్గొన్న ఈ అధ్యయనానికి కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగం తోడ్పాటు అందించింది. ‘‘లా నినా రుతుపవన సీజన్లకు ముందు- బలమైన మధ్యస్థాయి సాపేక్ష తేమ (ఆర్‌హెచ్‌), గాలి దిశలో మార్పులు (వీడబ్ల్యూఎస్‌) తదితర విలువలు విభిన్నంగా ఉంటున్నాయి. వీటి కారణంగానే తుపాన్లు భీకరంగా మారుతున్నాయి. ఎల్‌ నినో, లా నినా దశల్లో తలెత్తే తుపాన్లు తీవ్రతరం కావడానికి సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత, తేమ, వాయు వేగాల్లో మార్పులు చోటుచేసుకోవడం వంటివి దోహదపడుతున్నాయి. గత 38 ఏళ్లలో ట్రోపోస్పియర్‌లోని నీటి ఆవిరి 1.93 రెట్లు పెరగడం, ఉష్ణమండల సముద్ర మట్ట పీడనంలో మార్పులు చోటుచేసుకోవడం వల్ల ఉష్ణ మండల తుపాన్లు పెరుగుతున్నాయి. 2000-2020 మధ్య ఎల్‌ నినో సంవత్సరాలతో పోల్చితే, అదే సమయంలోని లా నినా సంవత్సరాల్లో దాదాపు రెట్టింపు సంఖ్యలో తీవ్రమైన తుపాన్లు సంభవించాయి’’ అని పరిశోధకులు చెప్పారు. ఉత్తర హిందూ మహాసముద్రంలో తుపాన్లు భీకరంగా మారుతుండటంతో అక్కడి తీర ప్రాంతాలు ప్రమాదాలకు లోనవుతున్నాయని కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగం తెలిపింది.

150% పెరిగిన భారీ తుపాన్లు..

భారత ఉష్ణమండల వాతావరణ సంస్థ (ఐఐటీఎం), పుణెలోని సావిత్రిబాయి ఫులే యూనివర్సిటీ చేపట్టిన మరో అధ్యయంలోనూ విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. 1982-2019 మధ్య అరేబియా సముద్రంలో తుపాన్లు 52%, భీకర తుపాన్లు 150% పెరిగినట్టు అధ్యయనకర్తలు తెలిపారు. అదే సమయంలో బంగాళాఖాతంలో తుపాన్లు సంభవించే వేగం స్వల్పంగా తగ్గినట్టు వారు గుర్తించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన