close

తాజా వార్తలు

ప్రేమ.. పెళ్లి.. హత్య!

 అనుమానాస్పదంగా వెలుగులోకి..

 హత్యగా తేలిన వివాహిత మృతి

 విచారణ వేళ రాజకీయ ఒత్తిళ్లు

ఒకరికొకరు ప్రేమించుకున్నారు.. పెద్దలు తిరస్కరించారు.. ఆ యువతికి మరొకరితో వివాహం.. కొన్నాళ్లకు పండంటి బిడ్ఢ. అయినా.. ప్రేమను కొనసాగించారు.. పేగు బంధాన్ని వదులుకొని.. భర్తను వద్దనుకొని.. ప్రియుడి వెంటే నడిచిందామె.. ప్రియుడిని వివాహమాడింది. వీరి ప్రేమకు గుర్తుగా ఓ బుజ్జాయి.. వారి జీవనంలో ఏ కలహాలు వచ్చాయో?.. ఎలాంటి అపార్థాలు ముప్పిరిగొన్నాయో.. ఆరు నెలల కిందట విగతజీవిగా ఇల్లాలు.. అనుమానాస్పద మృతిగా వెలుగు చూసి.. ప్రియుడే హతమార్చిన తీరు తాజాగా తేలిన దయనీయమిది. సాంకేతికతే అస్త్రంగా కర్నూలు జిల్లా పోలీసులు నిక్కచ్చిగా విచారణ జరుపుతుండగా.. నిందితుడిని కాపాడేందుకు కొందరు పెద్దలు ఒత్తిళ్లు తెస్తున్న దారుణమిది.

న్యూస్‌టుడే, అనంత నేరవార్తలు: విడపనకల్లు మండలం కరకముక్కలకు చెందిన ఓ యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. అయితే ఆ యువతి కుటుంబ సభ్యులు ఆమెకు అనంతపురానికి చెందిన మరో వ్యక్తితో పెళ్లి చేశారు. అయినప్పటికీ.. వీరు తరచూ ప్రేమ పేరుతో కలుసుకొనేవారు. ఈవిషయం కొన్నాళ్ల తర్వాత ఆమె భర్తకు తెలిసింది. అది కాస్తా గొడవగా మారింది. దీంతో అప్పటికే కడుపున పుట్టిన బిడ్డను వదిలేసి ప్రేమించిన యువకుడితో ఆ వివాహిత ఇల్లు వదిలింది. ఆ తర్వాత వారిద్దరు పెళ్లి చేసుకుని కర్ణాటకలోని బళ్లారిలో కాపురం పెట్టారు. వారికి ఒక బాబు కూడా పుట్టాడు.

ప్రియుడే హంతకుడు...

ఇదిలా ఉండగా.. కొన్నాళ్ల కిందట బిడ్డతో స్వస్థలానికి వచ్చిన ప్రియుడు తన ప్రియురాలు బళ్లారిలోనే ఉందనీ, కొన్ని రోజుల తర్వాత మరొకరితో వెళ్లిపోయిందని ప్రచారం సాగించాడు. ఇదేక్రమంలో ఈ ఏడాది మార్చి 22న కర్నూలు జిల్లా హాలహర్వి సమీపంలోని ఓ జలాశయంలో ఓ మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. లోతుగా విచారణ చేయడంతో హత్య చేసి ఆమెను అక్కడ పడేసినట్లు నిర్ధారణకు వచ్చారు. హత్య కేసు నమోదు చేసి నిందితులను, హతురాలి వివరాలను సేకరించడాన్ని సవాల్‌గా తీసుకున్నారు. విచారణలో భాగంగా హతురాలి మృతదేహం లభించిన జలాశయం ప్రాంతంలో ఆ సమయంలో వినియోగించిన చరవాణి సంఖ్యల ఆధారంగా వారు విచారణ కొనసాగించారు. ఇందులో భాగంగా అందులో లభ్యమైన ఓ చరవాణి సంఖ్య ఉరవకొండ మండలం వెలిగొండ, విడపనకల్లు మండలం కరకముక్కలలో వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ఆ వివరాల ఆధారంగా ఉరవకొండ, పాల్తూరు పోలీసుల సహకారంతో ఆ చరవాణిని వాడింది కరకముక్కల వాసిగా గుర్తించారు. అతడు.. ఆమెను తీసుకెళ్లిన ప్రియుడే అని నిర్ధరించారు. అలాగే హతురాలి ఫొటోను స్థానిక పోలీసులకు చరవాణిలో పంపగా వారు ఆ గ్రామంలో విచారించి వివాహితదే అని గుర్తించారు.

పోలీసులపై ఒత్తిడి...

ఆ వివరాల ఆధారంగా అనుమానితుడిని, అతడి తల్లిని, వారికి సహకరించాడని అభియోగం ఎదుర్కొంటున్న పాల్తూరుకు చెందిన ప్రముఖ వ్యక్తిని హాలహర్వి పోలీసులు రెండు రోజుల కిందట అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిసింది. ఆ సమయంలో అనుమానితుడి తల్లిని వదిలేసి మిగతా ఇద్దరు వ్యక్తులను వారు హాలహర్వికి తరలించి విచారిస్తున్నట్లు సమాచారం. అయితే ఆ కేసు నుంచి వారు బయటపడటానికి కర్నూలు జిల్లాలో ఓ ముఖ్య ప్రజాప్రతినిధితో అక్కడి పోలీసులపై ఒత్తిడి తెచ్చినట్లు చర్చ నడుస్తోంది.

వెనక్కి తగ్గకుండా విచారణ...

సాధారణంగా గుర్తుతెలియని మృతదేహాల పక్షాన ఎవరూ రాకపోయినా, ఫిర్యాదు చేయకపోయినా దానిని గుర్తు తెలియని శవంగానే కేసు నమోదు చేసి, అలాంటి కేసులను అంతటితో వదిలేస్తున్న సందర్భాలు అనేకం. ఈ కేసులో వివాహిత హత్యకు గురై ఆరు నెలలు గడిచినా ఆమె తరఫున ఎవరూ ఫిర్యాదు చేయలేదు. మా అమ్మాయి కన్పించలేదని కూడా కేసు పెట్టలేదు. అయితే ఆ మృతదేహాన్ని గుర్తు తెలియనిదిగా భావించకుండా అక్కడ పని చేస్తున్న మహిళా ఎస్సై కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆమె చరవాణి సంకేతాల ఆధారంగా నిందితుల వివరాలను సేకరించారు. అనుమానితులు పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు పూర్తి వివరాలను సిబ్బందికి కూడా తెలియకుండా గోప్యత పాటించారు. రాజకీయ ఒత్తిళ్లను కూడా లెక్క చేయకుండా కేసు విచారణ కొలిక్కి తెస్తున్నారని సమాచారం.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.