close

తాజా వార్తలు

సుసంతాన యోగం!

గర్భధారణ అతి సున్నితమైన ప్రక్రియ. ఒక శరీరం నుంచి మరొక కొత్త శరీరం పుట్టుకొచ్చే సంక్లిష్టమైన ప్రక్రియ. మన కలల ప్రతిరూపాన్ని మన కళ్ల ముందు నిలిపే అద్భుతమైన ప్రక్రియ. ఇది కేవలం శరీరానికి సంబంధించిందే కాదు. మనసుతోనూ ముడిపడిన వ్యవహారం. మనసులో మెదిలిన సంతానేచ్ఛ.. శృంగారానుభూతితో ఉద్దీపితమై.. అండ, శుక్ర కణాల సంయోగంతో అంకురించి.. పిండ రూపాన్ని ధరిస్తుంది. కాబట్టే ఆయుర్వేదం గర్భధారణలో శరీరం, మనసుకు.. రెండింటికీ సమ ప్రాధాన్యమిస్తోంది. రైతు పంట పండించటానికి ఉద్యుక్తుడైనట్టుగానే దంపతులు కూడా సంతానోత్పత్తికి అత్యవసరమైన ‘సామగ్రి’ని జాగ్రత్తగా సిద్ధం చేసుకోవాలని నొక్కిచెబుతోంది. అలాగే యోగానుబంధంతోనూ శారీరకంగా, మానసికంగా సంపూర్ణ ఆరోగ్యంతో తొణికిసలాడే సంతానయోగాన్ని సఫలీకృతం చేసుకోవచ్చని ఆశీర్వదిస్తోంది.

అచ్చు(మూస)ను బట్టే ప్రతిమ. అచ్చు సరిగా లేకపోతే ప్రతిమ ఆకారమూ దెబ్బతింటుంది. అచ్చులో పోసే లోహం నాణ్యత దెబ్బతింటే ప్రతిమ దృఢత్వమూ తగ్గుతుంది. ఒకరకంగా గర్భధారణ కూడా ఇలాంటిదే! అండ, పిండాలకు ఆవాసమైన స్త్రీ.. శుక్ర కణాలకు నిలయమైన పురుషుల శారీరక, మానసిక అవస్థలు గర్భధారణ మీద, పుట్టబోయే పిల్లల మీద గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తాయి. అందరూ కోరుకునేది పండంటి బిడ్డ పుట్టాలనే. మంచి ఆరోగ్యంతో నిండిన, ఇంద్రియాలన్నీ సరిగ్గా ఉన్న, మంచి తెలివితేటలతో కూడిన శిశువును పొందాలనే. మరి సంతానోత్పత్తికి పూనుకునే దంపతులే బలంగా లేకపోతే? ఒత్తిడితో చిత్తవుతుంటే? మానసిక ప్రశాంతత కొరవడితే? ప్రస్తుతం ఎంతోమంది ఎదుర్కొంటున్న సంతాన సమస్యలకు ఇవే మూలం. అందుకే గర్భిణి శాస్త్రం గర్భధారణ విధి విధానాల గురించి ప్రత్యేకంగా చర్చించింది. వీటినే గర్భాదాన సంస్కారంగానూ పేర్కొంటారు. ఒకసారి గర్భం ధరించిన తర్వాత చేసేదేమీ లేదు. శిశువు శరీర సౌష్ఠవం వంటి వాటిని మార్చలేం. ఏవైనా అవకరాలు పొడసూపితే అలాగే స్వీకరించాల్సిందే. అందువల్ల ఇలాంటి ఇబ్బందులు కొని తెచ్చుకోకుండా.. సుసంతాన ప్రాప్తి కోసం గర్భధారణకు ముందు నుంచే తగు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. సంతానం కలగటానికి ఆయుర్వేదం పేర్కొంటున్న అవసరమైన ‘సామగ్రి’ గురించి తెలుసుకొని, అవగాహనతో మెలగటం అవసరం.

సంతాన వ్యవసాయం! 

విసర్గకాలంలోని హేమంతం, ఆదానకాలంలోని శిశిరం ఉత్తమ సంతాన యోగ కాలం. విసర్గలోని శరత్‌, ఆదానంలోని వసంతం మధ్యస్థ సంతాన యోగ కాలం. విసర్గలోని వర్ష, ఆదానలోని గ్రీష్మం అధమ సంతాన యోగ కాలం.  ఆసన యోగం!

సంతానోత్పత్తిని ఆయుర్వేదం వ్యవసాయంతో పోల్చి చెప్పటం విశేషం. రైతు పంట పండించటానికి ముందు వాతావరణం అనుకూలంగా ఉందా లేదా అనేది చూసుకొని.. దుక్కి దున్ని నేలను సిద్ధం చేసుకుంటాడు. నీటి వసతి చూసుకుంటాడు. మంచి విత్తనాలను ఎంచుకొని చల్లుతాడు. అలాగే గర్భధారణకూ అత్యవసరమైన అంశాలు కొన్ని ఉన్నాయని శాస్త్రకారులు స్పష్టంగా పేర్కొన్నారు.

‘ధ్రువం చతుర్ణాం సాన్నిధ్యాత్‌ గర్భస్యాద్విధి పూర్వకః।
రుతు క్షేత్రాంబు బీజానాం సామగ్య్రాదంకురోయథా।।

అంటే.. వ్యవసాయం మాదిరిగానే గర్భధారణకు కూడా అనుకూలమైన కాలం (రుతువు), సారవంతమైన నేల (శరీరం), మంచి విత్తనం (బీజం), సరిపడినంత నీరు (పోషకాలు) అత్యవసరమని అర్థం. ఈ అంశాలన్నీ కూడా విధి పూర్వకంగా ఉండాలి కూడా.

రుతువు (కాలం): గర్భధారణకు అనుకూలమైన సమయం చాలా కీలకం. ఆయుర్వేదం సంవత్సరాన్ని రెండు సమ భాగాలుగా.. ఆదాన కాలం, విసర్గ కాలంగా విభజించింది. ఆదాన కాలంలో ప్రకృతి జీవరాశుల్లోంచి శక్తిని లాగేసుకుంటుంది. విసర్గ కాలంలో జీవరాశులకు తన శక్తిని ప్రసాదిస్తుంది. కాబట్టి విసర్గ కాలంలో (వర్ష, శరత్‌, హేమంత రుతువులతో పాటు శిశిరంలో కొంత, వసంతంలో కొంత భాగం) గర్భధారణకు ప్రయత్నించటం మంచిది. అలాగే శరీరంలోని ‘కాలం’ కూడా ముఖ్యమే. రుతుక్రమం నెలనెలా సరిగా వచ్చేవారిలో నెలసరి మొదలైనప్పట్నుంచి 12-16 రోజుల మధ్యలో గర్భం ధరించే అవకాశం ఎక్కువ. అండం విడుదల కావటానికి ముందు గర్భాశయంలో శుక్రకణాలకు అనువైన వాతావరణం ఏర్పడుతుంది. దీని మూలంగానే అవి రెండు మూడు రోజుల వరకు చురుకుగా ఉంటాయి. అదే అండం జీవనకాలం కేవలం 24 గంటలే. ఆ లోపున ఫలదీకరణ జరగకపోతే అండం విచ్ఛిన్నమవుతుంది. కాబట్టి బహిష్టు ఆగిన తర్వాత.. అంటే 4వ రోజు నుంచి గర్భధారణకు ప్రయత్నిస్తే మెరుగైన ఫలితం కనబడుతుంది. నెలసరి ఆరంభమయ్యాక 12-18 రోజులను ఉత్తమ సంతాన యోగ కాలంగా చెప్పుకోవచ్చు.

క్షేత్రం (శరీరం): సారవంతమైన నేలలో పంట ఏపుగా ఎదుగుతుంది. అలాగే ఆరోగ్యవంతమైన గర్భాశయంలోనే సంతానం వృద్ధి చెందుతుంది. జీవులన్నింటికీ తల్లి గర్భమే తొలి ఆవాసం. తల్లి గర్భంలో పెరిగే తీరు మీదనే బిడ్డ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. 20 ఏళ్ల లోపు స్త్రీ శరీరం గర్భధారణకు అనువుగా తయారు కాదు. ఇక 40 ఏళ్ల తర్వాత శరీరం క్షీణిచటం ఆరంభిస్తుంది. కాబట్టి 20 ఏళ్ల లోపు, 40 ఏళ్ల తర్వాత గర్భం ధరిస్తే పుట్టబోయే పిల్లలకు సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువ. అందుకే 25-35 ఏళ్లలో గర్భం ధరించటం ఉత్తమమని శాస్త్రం చెబుతోంది. అలాగే గర్భాశయంలో ఏవైనా సమస్యలున్నా గర్భధారణను దెబ్బతీయొచ్చు. సంభోగం ద్వారా యోనిలోకి ప్రవేశించిన శుక్రకణాలు గర్భాశయం వైపు వెళ్తుంటాయి. మరోవైపు అండాశయం నుంచి నెల నెలా ఒక్క అండ కణం విడుదలవుతూ బీజవాహినుల (ఫలోపియన్‌ ట్యూబులు) ద్వారా గర్భాశయానికి చేరుకోవటం ఆరంభిస్తుంది. ఈ రెండూ జతకలిసి ఫలదీకరణ చెంది.. గర్భాశయం గోడకు అతుక్కుంటుంది. వీటిల్లో ఎలాంటి సమస్య తలెత్తినా గర్భధారణ మీద ప్రభావం పడుతుంది.

అంబు (పోషకాలు): అంబు అంటే నీరు. గర్భధారణ పరంగా చూస్తే దీన్ని పోషకాలని చెప్పుకోవచ్చు. రజస్సు నెల నెలా గర్భాశయాన్ని ప్రక్షాళన చేస్తుంటుది. అదే గర్భం ధరించిన తర్వాత పిండానికి అవసరమైన పోషణ అందిస్తుంది. పిండం అన్ని అవసరాలకు తల్లి మీదే ఆధారపడుతుంది. జరాయు (మాయ) ద్వారా తల్లి నుంచి పిండానికి రక్తసరఫరా అవుతుంది. దీన్నుంచే అవసరమైన పోషకాలు అందుతాయి. తిన్న ఆహారం అన్నరసంగా మారి రక్తంలో కలిసి పిండాన్ని పోషిస్తుంది. సరైన పోషణ లభించకపోతే పిండం ఎదుగుదల కుంటుపడుతుంది.

బీజం (వీర్యం): బీజం అంటే విత్తనం. ఇక్కడ వీర్యమే బీజం. ఇది ఆరోగ్యంగా ఉంటే గర్భధారణ సజావుగా సాగుతుంది. పుట్టబోయే శిశువు ఆరోగ్యమూ మెరుగ్గా ఉంటుంది. మన శరీరంలో ఏడు ధాతువులు (రస, రక్త, మాంస, మేధ, అస్థి, మజ్జ, శుక్ర) ఉంటాయి. శుక్ర ధాతువు (వీర్యం) మిగతా ఆరు ధాతువుల గుణాలకు సంబంధించిన అంశాలను కలిగుంటుంది. ఇది అండంతో జత కలిశాక ఏర్పడే పిండంలో అలాంటి ధాతువులు పుట్టుకురావటానికి తోడ్పడుతుంది. వీటి నుంచే శరీర భాగాలు ఏర్పడతాయి. కాబట్టి సంతానోత్పత్తి ఫలప్రదం కావటానికి వీర్యం ఆరోగ్యంగా ఉండటం ఎంతైనా అవసరం.

ఆసన యోగం !

గర్భం ధరించటానికి కొన్ని రకాల ఆసనాలు.. ముఖ్యంగా కటి భాగానికి రక్త ప్రసరణను మెరుగుపరచేవి బాగా ఉపయోగపడతాయి. జననావయవాలు కటిభాగంలోనే ఉంటాయి. వీటికి రక్తప్రసరణ సరిగా జరిగితే పోషకాలు తగినంతగా లభిస్తాయి. ఆరోగ్యంగా ఉంటాయి. కూర్చుని చేసే ఆసనాలు కటి భాగానికి రక్తం బాగా అందేలా చేస్తాయి. వీటిల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది..
* సుఖాసనం
* వజ్రాసనం
* బద్ధకోణాసనం
* పద్మాసనం
* అర్ధమత్స్యేంద్రాసనం
* పశ్చిమోత్తానాసనం
* బద్ధ పద్మాసనం
* వీటిని గర్భధారణకు ముందు నుంచే క్రమం తప్పకుండా సాధన చేస్తే మంచి ఫలితం కనబడుతుంది.

ఆనంద యోగం!

యోగాకు, ఆయుర్వేదానికి అవినాభావ సంబంధముంది. ఆయుర్వేదంలో చెప్పిన దిన చర్య, రుతు చర్యలు ఒకరకంగా యోగాలో పేర్కొన్న యమ, నియమాలే అనుకోవచ్చు. యమలో బ్రహ్మచర్యం పాటించటం కూడా ఒకటి. ఇక్కడ బ్రహ్మచర్యమంటే గృహస్థ ధర్మాన్ని పాటించటం. విచ్చలవిడితనం లేకపోవటం. దీంతో శుక్ర, అండ కణాల నాణ్యత పెరుగుతుంది, సంభోగ (సుఖ) వ్యాధులు దరిజేరవు. అలాగే సత్యం (దాపరికం లేకుండా ఉండటం), అహింస (అన్యోన్యత) కూడా గర్భధారణ సఫలీకృతం కావటానికి తోడ్పడతాయి. నియమలో పేర్కొన్న శుచి, సంతోషం, స్వాధ్యాయ (విషయ అవగాహన), ఇంద్రియ నిగ్రహం, తపస్సు (ఆసక్తి) వంటివి శరీరం, మనసు శుచిగా ఉండటానికి తోడ్పడతాయి. ఉల్లాసం, ఆనందం కలిగిస్తాయి. ఇవన్నీ సంతాన సామర్థ్యాన్ని మెరుగుపరచేవే.

* ఒత్తిడి, ఆందోళన వంటివి గర్భధారణ సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. వీటి బారినపడకుండానూ యోగా కాపాడుతుంది. ‘యోగః చిత్తవృత్తి నిరోధకః’.. అంటే యోగా మనసును నియంత్రించే సాధనమన్నమాట. ఇందుకు శారీరక ఆరోగ్యం కూడా ముఖ్యమే. శరీర రథానికి మనసే సారథి. మనసు నిలకడగా సాగకపోతే శరీరమూ గతి తప్పుతుంది. అలాగే రథం సరిగా లేకపోతే సారథికీ ప్రమాదం తప్పదు. శరీరం ఆరోగ్యంగా ఉంటే దాన్ని ఆశ్రయించుకొని ఉన్న మనసూ ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టే యోగా మనసుకు, శరీరానికి సమ ప్రాధాన్యమిస్తుంది. అసలు యోగా అంటేనే శరీరం, మనసు కలయికని అర్థం. శరీరాన్ని నియంత్రించటం ద్వారా మనసును.. మనసును నియంత్రించుకోవటం ద్వారా శరీరాన్ని నియంత్రించుకోవచ్చని యోగా చెబుతుంది. అష్టాంగ యోగలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహరణ, ధారణ, ధ్యానం, సమాధి అని విభాగాలు కనబడతాయి. వీటి ద్వారా మోక్షాన్ని సాధించటం యోగా ఉద్దేశం. ఇహలోక దృష్టితో చూస్తే మోక్షమంటే లక్ష్యాన్ని సాధించటమనే చెప్పుకోవచ్చు. గర్భధారణ దృష్టితో పరికిస్తే మంచి సంతానాన్ని పొందటమే లక్ష్యం.

ఆహార యోగం!

అండకణాలు ఒక సముదాయంలా ఉంటాయి. కాబట్టి అలా ఒక గుత్తిలా  కనబడే పదార్థాలు సంతానం కలగటానికి తోడ్పడతాయి. వీటిల్లో ప్రధానమైంది మేడిపండు (అంజీర). అలాగే శతపుష్పి (సోంపు, జిలకర), ద్రాక్షపండ్లు, వెల్లుల్లి (లసున), బాదం వంటి గింజపప్పులూ మేలు చేస్తాయి. ఇవి ఒంట్లో ఉష్ణాన్ని కలిగించి అండం విడుదలయ్యేలా చేస్తాయి. అలాగే మినుములు, ఉలవలు, నువ్వులు, కాసింత పులిసిన పెరుగు/మజ్జిగ, చేపలు కూడా ఉష్ణాన్ని పుట్టించేవే. వీటిని అండకణం విడుదలయ్యే రోజుల్లో తీసుకోవాలి. అయితే అండం విడుదలయ్యి.. ఫలదీకరణ చెందాక ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. మినుములు, నెయ్యి, పాలు పురుషుల్లో శుక్రధాతు వృద్ధికి తోడ్పడతాయి.

శ్వాస యోగం.. ప్రాణాయామం

శరీరానికి వాయువే (ఆక్సిజన్‌) ప్రాణం. శ్వాస ద్వారా తీసుకున్న వాయువు రక్తంలో కలిసి అన్ని కణాలకు చేరుకుంటుంది. ఫలితంగా అవయవాలన్నీ ఆరోగ్యంతో తొణికిసలాడతాయి. అందుకే ప్రాణాయామం, ధ్యానానికి అంత ప్రాధాన్యం. ప్రాణాయామం శ్వాసను లయబద్ధంగా సాగేలా చేస్తే.. ధ్యానం లక్ష్యం మీద మనసు లగ్నమయ్యేలా చేస్తుంది. ఇవి రక్తాన్ని పంప్‌ చేసే గుండె, రక్తంలోకి ఆక్సిజన్‌ను చేరవేసే ఊపిరితిత్తులను బలోపేతం చేస్తాయి. వీటిని ఒక సమన్వయంతో పనిచేయించే మనసు (మెదడు) కుదురుగా ఉండటానికీ ఉపయోగపడతాయి. ప్రాణాయామంతో అన్ని అవయవాలకు ప్రాణశక్తి అందుతుంది. ప్రతికూల భావనలు తొలగిపోయి సంపూర్ణ మానసిక ఆరోగ్యం చేకూరుతుంది. ఫలితంగా సంభోగ సామర్థ్యమూ పెరుగుతుంది.

* ప్రాణాయామంలో నాడీ శోధన పద్ధతి ఒకటి. ఇందులో ముందుగా ఎడమ ముక్కుతో శ్వాసను తీసుకొని, కుడి ముక్కుతో వదలాల్సి ఉంటుంది. తర్వాత ఈ క్రమాన్ని మార్చాలి. అంటే కుడి ముక్కుతో శ్వాసను తీసుకొని, ఎడమ ముక్కుతో వదలాలన్నమాట. ఇది అండాశయం, బీజవాహినులతో పాటు ఒంట్లోని అన్ని మార్గాలను శుద్ధి చేస్తుంది. ఫలితంగా అండకణాలు సకాలంలో విడుదలవుతాయి. ఒకేసారి రెండు ముక్కు రంధ్రాలతో గాఢంగా, నెమ్మదిగా శ్వాసను తీసుకుని, వదిలే ‘ఉజ్జయిని ప్రాణాయామ’ పద్ధతినీ పాటించొచ్చు. ఈ రెండింటినీ తేలికగా సాధన చేయటం అబ్బిన తర్వాత లైంగిక అవయవాలపై మరింత ప్రభావాన్ని చూపే ‘భస్త్రిక ప్రాణాయామం’ కూడా చేయొచ్చు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.