close

తాజా వార్తలు

అందుకే కృష్ణానదికి వరదలొచ్చాయి‌: చంద్రబాబు

గుంటూరు: తన ఇల్లు ముంచాలనే ఉద్దేశంతో కృష్ణా నదీపరివాహక ప్రాంతాలన్నీ ముంచారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఇటీవల కృష్ణానదికి సంభవించిన వరదలు ప్రకృతి వైపరీత్యం వల్ల కాదని.. ప్రభుత్వ వైపరీత్యమే అని ఎద్దేవా చేశారు. తన ఇంటిని ముంచే కుట్రతో ప్రజలను నిండా ముంచారని ఆవేదన వ్యక్తం చేశారు. వరద పరిస్థితిని నియంత్రించడానికి అవకాశం ఉన్నప్పటికీ అలా చేయలేదని.. రాజధానిని వరద నీటితో ముంచాలన్న తప్పుడు ఆలోచనతో వైకాపా ప్రభుత్వం ఉందని ఆయన ఆరోపించారు. 

ఇటీవల సంభవించిన వరద పరిస్థితులపై గుంటూరులోని పార్టీ కార్యాలయంలో చంద్రబాబు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 19 గ్రామాల్లో పర్యటించానని, వరద పరిస్థితిని సమీక్షించానని చంద్రబాబు చెప్పారు. ఎక్కడ చూసినా హృదయ విదారక పరిస్థితులు కనిపించాయన్నారు. దాదాపు 53 వేల ఎకరాల పంటభూములు నీట మునిగాయని వివరించారు. వరదలపై ఏనాడూ ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష చేయలేదని చంద్రబాబు ఆరోపించారు. 

అందుకే వరదలు
నీటి ప్రవాహం వివరాలన్నీ ప్రభుత్వం, అధికారుల దగ్గర ఉంటాయని చంద్రబాబు అన్నారు. ఏ రిజర్వాయర్‌లో ఎన్ని నీళ్లు ఉన్నాయో చూసుకోకుండా, వాటిని నింపే ప్రయత్నం చేయకుండా దిగువకు వదిలేశారని, అందుకే ప్రకాశం బ్యారేజీ దిగువ లంక గ్రామాలు వరదలో మునిగిపోయాయని వివరించారు. ఆల్మట్టి నుంచి నారాయణ్‌పూర్‌కు నీరు రావాలంటే 12 గంటల సమయం పడుతుందని చంద్రబాబు చెప్పారు. మహారాష్ట్ర నుంచి సముద్రంలో కలిసే వరకు కృష్ణానది 1400కి.మీ  ప్రయాణిస్తుందని గుర్తు చేశారు. సీడబ్ల్యూసీ లెక్కల వివరాలు పూర్తిగా తన దగ్గర ఉన్నాయని చంద్రబాబు పేర్కొన్నారు.

ప్రజలను మభ్యపెట్టాలని చూశారు

ప్రకాశం బ్యారేజీలో నీళ్లు నేరుగా తన ఇంటి వద్దకు రావాలనేది వైకాపా నాయకుల ఆలోచన అని చంద్రబాబు ఆరోపించారు. ‘రాష్ట్రంలో ఎవ్వరికీ నోటీసులు ఇవ్వలేదు. కానీ, మా ఇంటికి మాత్రం వచ్చి ఇచ్చారు’ అని మండిపడ్డారు. ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకుండా, ఆఖరికి తన  నివాసంపైనా డ్రోన్‌ ఎగురవేశారని దుయ్యబట్టారు. ఇలాంటి తప్పుడు విధానాలు ఎందుకు అవలంబించారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. తప్పుడు విధానాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూశారన్నారు. వచ్చిన నీళ్లు సక్రమంగా ఎలా వదలాలో తెలిస్తే చాలని, 20 రోజులు వరద నీరు ప్రవహిస్తుంటే ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు.

53 వేల ఎకరాలు మునిగిపోయాయి
మొత్తం 53 వేల ఎకరాల భూమి వరద ముంపునకు గురైందని చంద్రబాబు అన్నారు. 30 వేల ఎకరాల్లో వాణిజ్య పంటలున్నాయని, రూ.3 నుంచి రూ.4 వేల కోట్లు రైతులకు నష్టం కలిగిందని వివరించారు. ఐఎండీ, ఇస్రో హెచ్చరికలు ఉంటే ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. రైతులకు పూర్తి నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. నెలకు సరిపడా రేషన్‌ సరకులు ఇవ్వాలని, దెబ్బతిన్న ఇళ్లకు సంబంధించి పరిహారం ఇవ్వాలని కోరారు. పొలాల్లో, ఇళ్లలో బురద తొలగించుకునేందుకు ఆర్థిక సాయం అందజేయాలని డిమాండ్‌ చేశారు.

వరదలు వచ్చాయని రాజధాని మారుస్తారా?

వరదలు వచ్చాయని రాజధానిని మారుస్తారా అని చంద్రబాబు ప్రశ్నించారు. తెలంగాణతో సంబంధాలు బాగున్నాయని ప్రభుత్వం చెబుతోందని, అలాంటప్పుడు సముద్రంలో పోయే నీటిని పోతిరెడ్డిపాడుకు మళ్లిస్తే తెలంగాణ ఎందుకు ఫిర్యాదు చేసిందని ప్రశ్నించారు. కృష్ణా వాటర్‌ రివర్స్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేయడం ప్రభుత్వానికి తెలియదా?అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఇచ్చిన ఫిర్యాదుపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. సముద్రంలోకి పోయే నీటిని రాయలసీమకు ఎందుకు తీసుకెళ్లలేకపోయారని ప్రశ్నించారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.