close

తాజా వార్తలు

సఫారీలపై భారత్‌ జోరు

ద్విశతకంతో చెలరేగిన విరాట్‌ కోహ్లీ
601/5 వద్ద భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌
రెండో రోజు ఆట ముగిసేసరికి దక్షిణాఫ్రికా 36/3

పుణె: రెండో టెస్టులోనూ దక్షిణాఫ్రికాపై భారత్‌ పట్టుబిగిస్తోంది. సారథి విరాట్‌ కోహ్లీ (254*; 336 బంతుల్లో 33×4, 2×6) అజేయ ద్విశతకంతో చెలరేగాడు. అసాధ్యమైన రికార్డులను సుసాధ్యం చేస్తూ తన కెరీర్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరుని అందుకున్నాడు. కోహ్లీకి తోడుగా జడేజా (91; 104 బంతుల్లో 8×4, 2×6 ) కూడా మెరవడంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ను 601/5 భారీ స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. అనంతరం బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఆదిలోనే ఓపెనర్లను కోల్పోయింది. ఉమేశ్‌ యాదవ్‌ (2/16), షమి (1/3), ధాటికి సఫారీ బ్యాట్స్‌మెన్‌ విలవిలలాడారు. దీంతో రెండో రోజు ఆట ముగిసేసరికి దక్షిణాఫ్రికా మూడు వికెట్ల నష్టానికి 36 పరుగులు చేసింది. ఇంకా భారత్‌ కంటే 565 పరుగుల వెనుకంజలో ఉంది.  క్రీజులో డి బ్రూయిన్ (20), నోర్జె (2) ఉన్నారు. 

భారత్‌దే ఆధిపత్యం
అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 273/3తో ఆటను ప్రారంభించిన రహానె (59), కోహ్లీ సఫారీ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. వీరిద్దరు కలసి నాలుగో వికెట్‌కు 178 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరి భాగస్వామ్యం ప్రమాదకరంగా మారుతున్న సమయంలో రహానెను మహారాజ్‌ బోల్తా కొట్టించాడు. అప్పటికే భారత్‌ 376/4తో పటిష్ఠ స్థితిలో ఉంది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన జడేజాతో కలిసి కోహ్లీ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో 26వ శతకం అందుకున్న కోహ్లీ తర్వాత దూకుడుగా ఆడాడు. దీంతో 295 బంతుల్లోనే ద్విశతకాన్ని అందుకున్నాడు. తన కెరీర్‌లో ఇది ఏడో డబుల్‌ సెంచరీ కావడం విశేషం. అనంతరం జడేజా కూడా గేర్‌ మార్చడంతో పరుగులు పోటెత్తాయి. వీరిద్దరు కలసి ఆఖరి సెషన్‌లో ఎనిమిది రన్‌ రేటుతో పరుగులు చేయడం విశేషం. శతకం దిశగా సాగుతున్న జడేజాను ముత్తుసామి ఔట్‌ చేయడంతో భారత్ 601/5 స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది.

రికార్డుల రారాజు
రెండో రోజు ఆటంతా విరాట్‌ కోహ్లీదే. రహానెతో కలిసి 178 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన కోహ్లీ.. జడేజాతో కలిసి 225 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. సఫారీ బౌలర్లను చక్కగా ఎదుర్కొంటూ జట్టును ముందుండి నడిపించాడు. బౌలర్లను నిస్సహాయుల్ని చేస్తూ ద్విశతకాన్ని అందుకున్నాడు. దీంతో భారత్‌ తరఫున అత్యధిక డబుల్‌ సెంచరీలు బాదిన ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా భారత సారథుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు కోహ్లీదే. ఈ మ్యాచ్‌లో పరుగుల యంత్రం తన అత్యధిక వ్యక్తిగత స్కోరును కూడా నమోదు చేసుకున్నాడు. అంతకుముందు శ్రీలంకపై చేసిన 243 పరుగులే తన అత్యధిక స్కోరు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ టెస్టుల్లో 7వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. 138 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధిచాడు. కోహ్లీ సారథ్యంలో భారత్‌ 600 మార్క్‌ను అందుకోవడం ఇది పదోసారి. 

స్కోరు వివరాలు:
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 601/5 డిక్లేర్‌ (కోహ్లీ 254*, మయాంక్‌ 108; రబాడ 3/93)
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌: 36/3 (డి బ్రూయిన్‌ 20*, బవుమా 8; ఉమేశ్‌ 2/16)


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.