close

తాజా వార్తలు

చందాకారులు మీరే!
డౌన్‌ పేమెంట్‌ ఊసులేదు... ఈఎంఐల గోల లేదు... సమయానికి సర్వీసింగ్‌ చేయించాలన్న బెంగ అక్కర్లేదు... దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగినా బాధ్యత తీసుకునేది వాళ్లే... కారు సబ్‌స్క్రిప్షన్‌తో ఎన్ని ప్రయోజనాలో... నెలకింతని కట్టేస్తే చాలు.. ఎంచక్కా ఆర్నెళ్ల నుంచి ఏళ్లపాటు కారుకి ఓనరైపోవచ్చు...

సొంత ఇంటి తర్వాత మధ్యతరగతి జనం ఎక్కువమంది కోరుకునేది కారు ఓనరు కావాలనుకోవడమే. కానీ అది అందరికీ సాధ్యం కాదు. అంత మొత్తం భరించడం చాలామందికి భారం. మరికొందరికి వాహనం కొద్దిరోజులపాటే అవసరం. ఇంకొందరైతే కారుని ఒక స్టేటస్‌ సింబల్‌లా భావించి కొన్నాళ్లపాటైనా వాడాలనుకుంటారు. కారు తాలూకు సౌకర్యాలు అనుభవించాలని ఉంటుందిగానీ దాన్ని నిర్వహించడం చాలామందికి బద్ధకం. ఇలా రకరకాల వ్యక్తులందరికీ ఓ ఛాయిస్‌లా మారుతోంది నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌. నెలనెలా కొద్దిమొత్తం చెల్లిస్తే నచ్చిన బ్రాండ్‌ న్యూ మోడల్‌ కారు నుంచి పాతదేదైనా సొంతం చేసుకోవచ్చు. అదీ ఎలాంటి డౌన్‌పేమెంట్‌ కట్టకుండానే. నిమిషాల్లో ఆన్‌లైన్‌లో లాగిన్‌ అవడం ద్వారా.

ఏంటీ సబ్‌స్క్రిప్షన్‌?
ఆర్నెళ్లు, ఏడాది నుంచి కావాల్సినన్నాళ్లు పొడిగించుకుంటూ వెళ్లడమే సబ్‌స్క్రిప్షన్‌. కారుని కొన్నాళ్లు వాడాలనుకునేవారు జూమ్‌కార్‌ ‘జాప్‌’ ద్వారాగానీ రెవ్‌ ‘ఆప్షన్‌’ ద్వారా గానీ ఎంచుకోవచ్చు. కారు బ్రాండ్‌, సెగ్మెంట్‌, మోడల్‌నిబట్టి నెల ఛార్జీలు రూ.8వేల రూ.50వేల మధ్యలో ఉంటాయి. మనదగ్గర ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉంటే చాలు. ఆన్‌లైన్‌ ద్వారానే ప్రక్రియ అంతా పూర్తి చేయొచ్చు. ముందుగా పదివేలు డిపాజిట్‌ చేయాలి. వాటిని తర్వాత తిరిగి ఇచ్చేస్తారు. కారు నిర్వహణ ఖర్చులు, బీమా, రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌, ప్రమాదాలపుడు అంతా వాళ్లే చూసుకుంటారు. హాచ్‌బ్యాక్‌, సెడాన్‌, ఎస్‌యూవీ, ఎలక్ట్రిక్‌ ఏ కారైనా ఎంచుకోవచ్చు. సబ్‌స్క్రిప్షన్‌ కూడా లీజు లాంటిదే. కానీ లీజింగ్‌లో చాలా నిబంధనలుంటాయి. లీజు తీసుకున్నవారు సంస్థతో కనీసం మూడేళ్లైనా ఒప్పందం చేసుకోవాలి. ఇక్కడలా కాదు. ఆర్నెళ్లైనా ఓకే. ఈ సబ్‌స్క్రిప్షన్‌ ట్రెండ్‌ మొదట అమెరికాలో మొదలైంది. లగ్జరీ కార్ల కంపెనీలు పోర్షె, బీఎండబ్ల్యూ, ఆస్టన్‌మార్టిన్‌, మెర్సిడెస్‌ బెంజ్‌లాంటివి అక్కడ ప్రారంభించాయి. జూమ్‌కార్‌ ఏడాదిన్నర కిందట బెంగళూరు, ముంబయి, దిల్లీల్లో ఈ రకమైన సబ్‌స్క్రిప్షన్‌ మొదలుపెట్టి ఇతర నగరాలకు విస్తరించింది. రెవ్‌ కూడా ఆరు నగరాల్లో సేవలు అందిస్తోంది. 25 రకాల మోడళ్లు అందుబాటులో ఉంచింది. మహీంద్రా సంస్థ ఈ మధ్యే లీజింగ్‌ ప్రారంభించింది. అయితే ఇందులో వినియోగదారులు నెలలో ఎనిమిది వేల కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయొచ్చు. దాని తర్వాత అదనంగా తిరిగితే కిలోమీటరుకు రూపాయి చొప్పున ఛార్జ్‌ చేస్తారు.

కొనడం కన్నా ఇదే మేలు

మా సొంత నగరం చెన్నై. ఉద్యోగరీత్యా హైదరాబాద్‌కొచ్చాను. రెండేళ్ల కోసం జాప్‌ నుంచి ఫోర్డ్‌ ఫ్రీస్టైల్‌ కారు సబ్‌స్క్రైబ్‌ చేసుకున్నాను. నెలకి 20 వేలు అద్దె చెల్లిస్తున్నాను. వారంలో ఐదురోజులు సొంత అవసరాల కోసం వాడుకుంటూ మిగిలిన రెండ్రోజులు లిస్టింగ్‌ చేసి క్యాబ్‌గా తిప్పుతాను. దాంతో పదివేల వరకు సంపాదిస్తున్నాను. ముందు సొంతంగా కారు కొనాలనుకున్నాను. డౌన్‌ పేమెంట్‌, రుణం మీద వడ్డీ, టాక్సులు, నిర్వహణ.. ఇవన్నీ లెక్కలు వేశాక సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవడమే లాభదాయకం అనిపించింది. సబ్‌స్క్రిప్షన్‌ ప్రక్రియ కూడా తేలిగ్గా ఉంది. ఆన్‌లైన్‌లోనే వివరాలు పూర్తిచేసి ఇంటి దగ్గరికే కారు తెప్పించుకున్నాను. నెలకి ఇరవై వేల చొప్పున నా బ్యాంకు ఖాతా నుంచి సబ్‌స్క్రిప్షన్‌ ఫీజు తగ్గించుకుంటున్నారు. సర్వీసింగ్‌ ఇతర నిర్వహణ వాళ్లే చూసుకుంటున్నారు. కారుపై మనం ఒక పదిలక్షలు పెట్టుబడి పెడితే కాలం గడిచినకొద్దీ దాని విలువ తగ్గిపోతుంటుంది. నాలాంటి అభిప్రాయం ఉన్నవాళ్లు ఇలాంటి సర్వీసులు వాడుకుంటే బాగుంటుంది. ఎన్నాళ్లు కావాలంటే అన్నిరోజులు శుభ్రంగా వాడుకొని అవసరం లేదనుకున్నపుడు వెనక్కి తిరిగి ఇచ్చేయొచ్చు. 
- ఎన్‌.మనోజ్‌, డెలాయిట్‌ ఉద్యోగి

జోరు ఎందుకంటే..

మొదలైన కొన్నాళ్లకే ఈ ట్రెండ్‌ టాప్‌గేర్‌లో దూసుకెళ్తోంది. భవిష్యత్తులో ఇలాంటివి మరింత విస్తరించే అవకాశం ఉందంటున్నారు వాహన రంగ విశ్లేషకులు. ఎందుకు ఇది జోరు మీదుందంటే..

* అదనపు అవసరం: సబ్‌స్క్రిప్షన్‌ తీసుకునేవాళ్లలో ఎక్కువమంది ఇంతకుముందు ఒక కారు ఉన్నవారే అంటున్నారు జూమ్‌కార్‌ ప్రతినిధి. రెండో కారుకు వెళ్లడం ఇష్టం లేక.. వెళ్తే అధిక పన్నులు కట్టాలనే ఉద్దేశంతో సబ్‌స్క్రిప్షన్‌ ఎంచుకుంటున్నారని అంటారాయన. 

* ఫ్లెక్సిబిలిటీ: నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ చేసుకోవడం చాలా తేలిక. స్మార్ట్‌ఫోన్‌ యాప్‌ ద్వారా లేదా వెబ్‌సైట్‌ ద్వారా కొన్ని నిమిషాల్లోనే ప్రక్రియ ముగించి కోరుకున్న కారును మన ఇంటికి రప్పించుకునే వెసులుబాటు దీంట్లో ఉంటుంది. అదే మనం కారుకి ఓనరవ్వాలంటే దానికి ముందు చేయాల్సిన కసరత్తు చాలా ఉంటుంది. 

* వ్యయప్రయాసల్లేవు: ఒక్కసారి సబ్‌స్క్రిప్షన్‌ కడితే కారు నిర్వహణ, ఏదైనా ప్రమాదానికి గురైతే మరమ్మతులు, బీమా తదితర తలనొప్పులన్నీ సంస్థే చూసుకుంటుంది. వీటికోసం మనం ప్రత్యేకంగా ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సిన పన్లేదు. సమయానికి వర్క్‌షాప్‌కి తీస్కెళ్లడం, సర్వీసింగ్‌ చేయించడం, బీమా పునరుద్ధరించడం  ఇలాంటి బెంగలేం అక్కర్లేదు. 

* నగరం మారినా: ఒక నగరంలో సబ్‌స్క్రిప్షన్‌ తీసుకొని వేరే నగరానికి మారినా ఎలాంటి అదనపు మొత్తం వసూలు చేయకుండానే మనం వెళ్లిన చోటికి మరో కారు పంపిస్తారు. 

* లిస్టింగ్‌తో డబ్బులు: ఇందులో ఉన్న మరో వెసులుబాటు మనం సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్న కారుని అద్దెకు తిప్పుకొని కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఉదాహరణకు మనకు కారుతో నెలలో అన్నిరోజులు అవసరం ఉండకపోవచ్చు. అప్పుడు నెలలో పదిరోజులు అద్దెకు తిప్పుకున్నా మనం కట్టాల్సిన నెలవారీ డబ్బుల్లో సగం మిగుల్చుకోవచ్చు.

ఎలాంటి చెల్లింపులు అక్కర్లేదు: కారు కొంటే ఇన్సురెన్స్‌, రోడ్‌టాక్స్‌, లైఫ్‌టాక్స్‌ అంటూ నానారకాల పన్నులు కట్టాలి. ఎంతలేదన్నా లక్షన్నర వరకు భరించాల్సి ఉంటుంది. సబ్‌స్క్రిప్షన్‌తో ఏ బాధా అక్కర్లేదు. నామమాత్రపు రిఫండబుల్‌ సెక్యూరిటీ చెల్లిస్తే చాలు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.