close

తాజా వార్తలు

నిద్ర మాత్రలు వేసుకున్నా

ఆయన యూనిఫాం వేసి, లాఠీ పట్టాడో - పోలీస్‌ అనే పదం కొత్త ఠీవీ ఒలకబోస్తుంది. ‘అక్కమొగుడు’ చూశాక ‘ఇలాంటి బావ మనకూ ఉండాలి’ అని మరదళ్లకు మొక్కాలనిపిస్తుంది. ‘గోరింటాకు’ గుర్తొస్తే ‘అన్న’దనంలోని ఆప్యాయత వర్షంలా కురుస్తుంది. ఇవన్నీ రాజశేఖర్‌ వల్లే సాధ్యమయ్యాయి. యాంగ్రీ యంగ్‌మ్యాన్‌ ఇమేజ్‌తో వెండి తెరపై తనదైన ఓ ముద్ర వేసిన రాజశేఖరుడు ‘కల్కి’గా అవతారమెత్తాడు. ఈ సందర్భంగా ‘హాయ్‌’ పలకరిస్తే...

నేను ఎన్‌సీసీ విద్యార్థిని. నా యూనిఫాం ఎప్పుడూ తళతళలాడిపోతుండేది. బూట్లు మెరుస్తుండేవి. నా డ్రస్సింగ్‌ స్టైల్‌ చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. ‘మీ నాన్నగారు పోలీస్‌ కదా.. నీకు సపర్యలు చేయడానికి చాలామంది ఉంటారు’ అనేవారు. నిజానికి మా నాన్నగారి బూట్లు నేనే పాలీష్‌ చేసేవాడ్ని. అద్దంలా మెరిసే ఆ బూట్లు చూసి ‘మాకూ ఆ ట్రిక్కు నేర్పవూ’ అని మానాన్నతోటి ఆఫీసర్లు అడిగేవాళ్లు. ‘అంకుశం’లో నా డ్రస్సింగ్‌ చాలామందికి స్ఫూర్తినిచ్చింది. కొంతమంది ఆఫీసర్లు నన్ను కలిసినప్పుడు ‘అంకుశం చూశాకే చేతికి కడియం పెట్టుకోవడం అలవాటు చేసుకున్నాం’ అన్నారు.

* రాజశేఖర్‌ కుటుంబానికి మంచి రోజులు వచ్చినట్టేనా?
(నవ్వుతూ) మొన్నే కొత్తింట్లోకి అడుగుపెట్టాం. మా అమ్మాయిలు కథానాయికలుగా మారారు. జీవిత ‘మా’ ఎన్నికల్లో గెలిచింది. నా సినిమా ‘కల్కి’కి మంచి ఆదరణ లభిస్తోంది. మీరన్నట్టు ఇవన్నీ మంచి శకునాలే. ఇన్ని ఆనందాల మధ్యా ఓ లోటు ఉంది. అదే.. ‘అమ్మ’. గతేడాది మమ్మల్ని వదిలి వెళ్లిపోయింది. ఇవన్నీ చూస్తే తను ఎంత సంతోషించేదో. అమ్మ ఫొటోకి దండం పెట్టుకుంటున్నప్పుడల్లా కన్నీరు ఆగడం లేదు. అప్పట్లో సినిమాలు పోయి, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇల్లు అమ్మేశాం. అమ్మ చాలా బాధపడింది. ‘సావిత్రిలాంటి వాళ్లు బాగా బతికి, చివరికి అప్పులపాలైపోయారు. వాళ్ల చివరి దశ చాలా దారుణంగా గడిచింది. మీకు అలా కాకూడదు’ అని హెచ్చరిస్తుండేది. ఇప్పుడు తనుంటే కచ్చితంగా ఆనందించేది.

* ‘గరుడవేగ’, ‘కల్కి’... ఈ సినిమాలతో మళ్లీ మీరు ఫామ్‌లోకి వచ్చినట్టు అనిపిస్తోందా?
నేను ఎదురుచూస్తున్న రోజులు వచ్చాయి. నా తొలి సినిమా ‘వందేమాతరం’కి ఎంత కష్టపడ్డానో.. ప్రతీ సినిమాకీ అలానే కష్టపడుతూ ఉంటా. ఫలితాలు అన్నిసార్లూ మనకు అనుకూలంగా రాకపోవొచ్చు. ‘గరుడవేగ’ నుంచి మళ్లీ నా టైమ్‌ మొదలైంది. ‘కల్కి’ సినిమా విషయంలో చాలా టెన్షన్‌ పడ్డాను. విడుదలకు ముందు ఈ సినిమాని కొంతమందికి చూపించాô. ‘బాగుంది..’ అన్నారంతే. ‘అదేంటి? అంత సింపుల్‌గా అనేశారు. ఈ సినిమా పోయిందా’ అని భయం వేసింది. జీవిత, మా పిల్లలు ధైర్యం చెప్పారు. విడుదలకు ముందు రోజు నిద్రమాత్రల డోసు ఎక్కువ వేసుకుని పడుకుండి పోయాను. పొద్దున్నే పిల్లలు, జీవిత బలవంతంగా లేపారు. ‘సినిమా హిట్టయ్యింది’ అనే శుభవార్త చెప్పారు.

* ఇన్ని సినిమాలు చేశారు. అందులో ఎన్నో హిట్లున్నాయి. అయినా సరే.. విడుదలకు ముందు ఈ టెన్షన్‌ తప్పదా?
సినిమావాళ్ల జీవితం బాణంలా దూసుకెళ్తూనే ఉండాలి. ప్రతీసారి ఈ ఒత్తిడి తప్పదు. పెద్ద పెద్ద దర్శకులతో పనిచేస్తున్నప్పుడు ఇలానే భయపడుతూ ఉండేవాడ్ని. సెట్లో చాలా సిన్సియర్‌గా ఉంటాను. నాకంటే పెద్ద నటులతో పనిచేస్తున్నప్పుడే కాస్త ఒత్తిడికి గురయ్యేవాడ్ని. నాకు బాగా గుర్తు. ‘మమతల కోవెల’ కోసం సుహాసినితో కలసి నటించాలి. ‘సుహాసిని చాలా గొప్ప నటి. నువ్వు కాస్త తగ్గినా తేలిపోతావ్‌’ అని ముత్యాల సుబ్బయ్యగారు భయపెట్టారు. నేను కూడా ఒళ్లు దగ్గర పెట్టుకుని నటించాను. ఫస్ట్‌ కాపీ చూసిన వెంటనే సుహాసిని నా దగ్గరకు వచ్చి ‘మీరు చాలా బాగా నటించారు.. నేనే మీ దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండాలి’ అని చెప్పింది.

* ‘కల్కి’లో సన్నగా కనిపిస్తున్నారు. బరువు తగ్గారా?
ఈ సినిమాలో పోలీస్‌ దుస్తుల్లో కనిపించాలి కదా? యూనిఫాం అనగానే అటెన్షన్‌ మొదలైపోతుంది. యూనిఫాం వేసుకున్నప్పుడు పొట్ట కనిపిస్తే నేను ఓడిపోయినట్టే లెక్క.  వ్యాయామం ఎక్కువ చేశాను. విందు, వినోదాలకు దూరంగా గడిపాను. ఆహారం పరిమితంగా తీసుకున్నా. అందుకే సన్నగా మారిపోయా.

* ‘అంకుశం’ సినిమా విడుదలైనప్పుడు యువతరం పోలీస్‌ శాఖపై ప్రేమ పెంచుకుంది. ఆ సినిమా చూస్తున్నప్పుడో, యూనిఫాం వేసుకున్నప్పుడో ‘నేనూ పోలీస్‌ అయితే బాగుండేది’ అనిపించిందా?
నిజానికి నేను పోలీస్‌ ఆఫీసర్‌నే అవుదామనుకున్నా. మా నాన్న పెద్ద పోలీస్‌ ఆఫీసర్‌. ఆయనకు నన్ను డాక్టర్‌ని చేయాలని ఉండేది. ‘అదేంటి నాన్న పోలీస్‌ ఆఫీసర్‌ కొడుకు పోలీస్‌ అవ్వాలి కదా’ అనేవాడ్ని. ‘పోలీస్‌ అయితే కొంతమందినే రక్షించగలవు. డాక్టర్‌ అయితే అందరినీ రక్షిస్తావు’ అని సర్దిచెప్పేవారు. ఓసారి నాన్నగారికి ప్రమాదం జరిగింది. అప్పుడు ‘ఓ పోలీస్‌నీ డాక్టరే కాపాడాడు చూశావా’ అంటూ నన్ను ప్రోత్సహించారు.

* డాక్టర్‌ వృత్తిని పక్కనపెట్టి యాక్టర్‌ అయ్యానన్న బాధ లేదా?
నేను డాక్టర్‌ వృత్తిని ఎప్పుడూ వదల్లేదు. ఇప్పటికీ వైద్యానికి సంబంధించిన పుస్తకాలు సేకరిస్తూనే ఉంటా. వాటిని అధ్యయనం చేస్తుంటా. నాతో పాటు ఎంబీబీఎస్‌ చేసిన స్నేహితులంతా కలసి ఓ వాట్సప్‌ గ్రూప్‌ని కొనసాగిస్తున్నాం. మా మధ్య ఎప్పుడూ మెడిసిన్‌కి సంబంధించిన విషయాలే చర్చకు వస్తుంటాయి. మా అమ్మాయి శివానీ ఎలాగూ ఎంబీబీఎస్‌ చేస్తోంది. శివాత్మిక మనసూ ఇటువైపు మళ్లింది. భవిష్యత్తులో వైద్యం మరింత ఖËరీదైపోతుంది. చిన్న చిన్న ఆరోగ్య ఇబ్బందులు వస్తే, మనమే పరిష్కరించుకోవాలి. ప్రాథమిక స్థాయిలోనే పిల్లలకు వైద్యం గురించి కనీస అవగాహన కలిగించేలా సబ్జెక్టులు తయారు చేయాలి. మనకొచ్చిన రోగం ఏమిటి? దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? అనే విషయాలైనా తెలుస్తాయి. డాక్టర్లు ఏం చెబుతున్నారనేది అర్థమైపోతుంది.

* ‘ఏం చేస్తిరి ఏం చేస్తిరి’ అంటూ ‘గబ్బర్‌సింగ్‌’లో మీ డైలాగ్‌ డెలివరీని పేరడీ చేశారు. ‘కల్కి’లో అదే డైలాగ్‌ని మీరూ వాడారు. ఈ ఆలోచన ఎవరిది?
దర్శకుడిదే. నిజానికి ‘గబ్బర్‌సింగ్‌’ సినిమాని నేను చూడలేదు. ‘మిమ్మల్ని పేరడీ చేశారు’ అని చెప్పేసరికి ఆ సన్నివేశం  చూశాను. చాలా బాధపడ్డాను. తర్వాత మరిచిపోయాను. ప్రశాంత్‌ వర్మ స్క్రిప్టు ఇచ్చినప్పుడు ‘ఏం చెప్తిరి ఏం చెప్తిరి’ అనే డైలాగ్‌ చదివి... ‘ఈ డైలాగ్‌ బాగుంది కదా జీవిత’ అన్నాను. ‘అది మిమ్మల్ని ఏడిపించడానికి ‘గబ్బర్‌ సింగ్‌’లో వాడిన డైలాగే’ అని జీవిత గుర్తు చేసింది. టీజర్‌లో ‘ఏం చెప్తిరి’ డైలాగ్‌ చూసి కొంతమంది పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌ తిడుతూ ట్రోల్‌ చేయడం మొదలెట్టారు. ఎందుకొచ్చిన గొడవ అనిపించి ఆ సీన్‌ని సినిమాలోంచి తీసేద్దామనుకున్నాం. ప్రశాంత్‌ వర్మ ‘ఈ సీన్‌ బాగుంటుంది.. ప్రేక్షకులు బాగా ఆస్వాదిస్తారు’ అని చెప్పేసరికి ఉంచాల్సివచ్చింది. అంతే తప్ప పవన్‌ కల్యాణ్‌పై నాకు వ్యక్తిగతంగా ఎలాంటి కోపం లేదు. నటుడిగా ఆయనంటే నాకు చాలా ఇష్టం.

* చాలా మంది తమ ఇంట్లోంచి కథానాయికల్ని రానివ్వరు. మీరేమో శివానిని కథానాయికగా చేయడానికి కారణం ఏమిటి?
ముందు నేనూ వద్దునుకున్నాను. ‘చూడండి సినిమా ఫీల్డ్‌ వేరు. ఇక్కడ అవకాశం రావడం సులభమే. నిలదొక్కుకోవడం కష్టం. సినిమాలు లేకపోయినా మరో వృత్తి ఎంచుకోగలం అనుకున్నప్పుడే ఈ రంగంలోకి రండి. ప్లాన్‌ బీ రెడీ చేసుకోండి’ అని చెప్పాను. వాళ్లూ నా మాట అర్థం చేసుకున్నారు. శివానీ, శివాత్మిక ఇద్దరూ ప్రతిభావంతులే.

* మీకెప్పుడూ దర్శకత్వం చేయాలన్న ఆలోచన రాలేదా?
‘ఓం’ సినిమా చేస్తున్నప్పుడు దర్శకుడిగా ఉపేంద్ర స్టైల్‌ చూసి ‘నేను డైరెక్టర్‌ అవ్వాలి’ అని బలంగా అనుకున్నాను. ‘ఎవడైతే నాకేంటి’ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే నావే. అప్పట్లో ‘రచయితలకు కోట్లకు కోట్లు ఎందుకు ఇచ్చేస్తారు’ అనిపించేది. నేనూ రాయడం మొదలెట్టాక వాళ్ల కష్టం తెలిసొచ్చింది. ‘ఇక నాకు నటుడిగా సినిమాలు రావు’ అనుకున్నప్పుడు దర్శకత్వం గురించి ఆలోచిస్తానేమో.

నాకు ఓటమంటే భయం. చిన్నప్పుడు స్పోర్ట్స్‌లో అస్సలు కనిపించేవాడ్ని కాదు. ఓడిపోతే ఎక్కడ ఎగతాళి చేస్తారో అనే భయం. ‘ఒరేయ్‌.. కాలేజీ ఛాంపియన్‌ కంటే నువ్వే బాగా పరుగెడుతున్నావ్‌. ఈసారి స్పోర్ట్స్‌ మీట్‌లో పాల్గొనాలి’ అని స్నేహితులు బలవంతం చేయడంతో ఇంటర్‌లో కాస్త ధైర్యం చేశా. ఆ ఏడాది స్పోర్ట్స్‌లో నేనే ఛాంపియన్‌గా నిలిచా. 
విలన్‌ పాత్రలు చేయాలని నాకూ ఉంది. ఎవ్వరూ మంచి పాత్రలతో రావడం లేదు. రొటీన్‌ విలన్‌ పాత్రలు చేయడం కంటే ఖాళీగా ఉండటం నయం.
నాకు రాజకీయాలంటే ఇష్టమే. నన్ను చూసి జీవితా ఇష్టం పెంచుకుంది. జీవితకు ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఇస్తామని చాలామంది ముందుకొచ్చారు. తనే ఆసక్తి చూపించలేదు. నాకు కుటుంబం అంటే ఇష్టం. వాళ్లతో కలసి ఉండటం ఇష్టం. సెట్లో కంటే.. నేను నా భార్యా, పిల్లలతోనే ఎక్కువ గడిపాను అని గర్వంగా చెప్పుకొంటాను. జీవిత ఎమ్మెల్యేనో, ఎంపీనో అయిపోతే తన నియోజక వర్గం చుట్టూ తిరగాల్సివస్తుంది. అందరూ కలిసి సరదాగా ఉండే క్షణాలు తగ్గిపోతాయని నా స్వార్థం.
- మహమ్మద్‌ అన్వర్‌, ఫొటో : మధు

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.