close

తాజా వార్తలు

38 వేల హరిత సైన్యం!

వెయ్యి వృక్షాల కోసం

అసలు వారసత్వ సంపద అంటే ఏమిటి..?
వందేళ్ల కిందటి కట్టడాలు మాత్రమేనా..!!
మరి అదే వందేళ్ల కింద మొలకెత్తి..
మనిషికి ప్రాణవాయువు పంచుతూ.. నీడను అందిస్తూ..
ఎన్నో రకాల జీవులు, పక్షులకు ఆవాసంగా మారిన చెట్లు వారసత్వ సంపద కాదా..?
ఆ సంపద కోసమే వారు గొంతెత్తారు...
అభివృద్ధి మాటున సాగిస్తున్న హరితమేధంపై పోరాడారు.
ఒకటి.. రెండు కాదు.. ఏకంగా వేయికిపైగా వందేళ్ల నాటి చెట్లను నరికివేసేందుకు సిద్ధమవుతున్న అధికారుల్లో చలనం తీసుకువచ్చారు.
ఇదంతా చేసింది ఓ వాట్సాప్‌ గ్రూపు. అదే నేచర్‌ లవర్స్‌ ఆఫ్‌ హైదరాబాద్‌..!!

గ్లోబల్‌ ఫారెస్ట్‌ వాచ్‌ సర్వే ప్రకారం గత ఐదేళ్లలో మన దేశంలో ఎంత మేర అడవుల విస్తీర్ణం తగ్గిపోయిందో తెలుసా.. అక్షరాలా 1.20లక్షల హెక్టార్లు. రహదారుల విస్తరణ, ఇతర అభివృద్ధి కార్యక్రమాలతో చెట్లను నరికివేస్తుండటంతో పచ్చదనం కరిగిపోతోంది.
హైదరాబాద్‌ శివారులోని మొయినాబాద్‌ నుంచి మన్నెగూడ వరకు 163 నంబరు జాతీయ రహదారి విస్తరించేందుకు జాతీయ రహదారి సంస్థ నిర్ణయించింది. 46 కిలోమీటర్ల రహదారి విస్తరణ కారణంగా సుమారు 9300 చిన్న, పెద్ద చెట్లను తొలగించాల్సి ఉంటుందని లెక్కతేల్చారు. ఇందులో వెయ్యికి పైగా మర్రిచెట్లు ఉన్నాయి. ఇవి వందేళ్లకు పైగా వయసున్న మహా వృక్షాలు. ఆ దారికి నీడనిస్తూ... బాటసారులకు ప్రాణవాయువును అందిస్తూ.. ఎన్నో రకాల పక్షులు, జీవజాతులకు ఆశ్రయం కల్పిస్తున్నాయి. చెట్ల నీడలో చాలామంది చిరు వ్యాపారులూ పొట్టపోసుకుంటున్నారు. రహదారి విస్తరణ కారణంగా ఈ వృక్షాలన్నింటినీ తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయం తెలుసుకున్న కొందరు ప్రకృతి ప్రేమికులు నేచర్స్‌ లవర్స్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ పేరిట వాట్సాప్‌ గ్రూపు పెట్టుకున్నారు. అప్పటివరకు వేర్వేరు సంస్థలు, వేర్వేరుగా పచ్చదన పరిరక్షణకు పోరాడిన వారందరూ ఒకే గొడుగు కిందకు చేరారు. చేవెళ్ల దారిలోని చెట్లను కాపాడేందుకు ఉద్యమించాలని నిర్ణయించారు. కానీ ఉద్యమం ఎలా మొదలుపెట్టాలి..? ఎవరిని కలవాలి..? ఇవన్నీ ప్రశ్నలే. ఇందుకు సోషల్‌మీడియాను వేదికగా చేసుకుని ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. 130 మందితో వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటు చేసుకుని తమ అభిప్రాయాలు పంచుకున్నారు.
savebanyansofchevella పేరిట ఫేస్‌బుక్‌ పేజీని క్రియేట్‌ చేశారు. ఇదే హ్యాష్‌టాగ్‌తో change.org లో పిటిషన్‌ పెట్టారు. అలాగే రహదారిపై బ్యానర్లు ప్రదర్శిస్తూ ఆందోళనలు చేపట్టారు. మొదటి వారంలోనే 35వేల మంది సంతకాలు చేశారు. ఇప్పటివరకు 38వేల మంది పిటిషన్‌కు అనుకూలంగా సంతకాలు చేశారు.
* ‘నేను, కొబితాదాస్‌ కొల్లి కలిసి ట్రీవాక్‌ చేస్తుంటాం. చెట్ల విశిష్టతను వివరిస్తుంటాం. చేవెళ్ల రహదారి విస్తరణలో వందలాది మర్రిచెట్లు తీసివేయబోతున్నారని తెలిసి ఎంతో బాధపడ్డాం. దీనిపై పిటిషన్‌ను ఛేంజ్‌.ఆర్గ్‌లో పెట్టగా మంచి స్పందన వచ్చింది’ అని గ్రూపు సభ్యురాలు సాధన రాంచందర్‌ తెలిపారు.

అలా ఆగింది...:
చెట్లను పరిరక్షించాలనే డిమాండ్‌ను అటవీ శాఖాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి కార్యాలయం ముందు పలుమార్లు నిరసన తెలిపారు. వారి నుంచి ఆశించిన స్పందన రాలేదు. దీంతో జాతీయ రహదారుల సంస్థ అధికారులను కలిశారు. వృక్షాలను ట్రాన్స్‌లొకేషన్‌ ద్వారా వేరొక చోటుకు మారుస్తామని చెప్పారు. ట్రాన్స్‌లొకేషన్‌ ద్వారా వేరొక చోటుకు మార్చడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ఈ పద్ధతి ప్రకారం వందల ఏళ్ల నాటి చెట్లను వేరొకచోటుకు తరలించి నాటినా.. వాటి పెరుగుదల అంతంతే. అధికారులు చాలా సందర్భాల్లో వాటిని వేరొక చోటుకు తీసుకెళ్లి నాటడమే తప్ప తిరిగి పట్టించుకోవడం లేదు. ట్రాన్స్‌లొకేషన్‌ చేసిన సందర్భాల్లో చెట్లు చనిపోతున్నాయి. ఇదే విషయాన్ని సంస్థ సభ్యులు అధికారులకు వివరించారు. అదీగాక ఇటీవల చేగుంట-మెదక్‌, ఆలేరు-వరంగల్‌ రహదారుల్లో ట్రాన్స్‌లొకేషన్‌ చేసినా పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. దాదాపు 2000 మర్రిచెట్లు రోడ్డు విస్తరణలో బలయ్యాయి. ఇలా సమస్య వివరించడంతోపాటు ప్రత్యామ్నాయ దారిని సూచించారు. వేరొక మార్గంలో రహదారిని నిర్మిస్తే వృక్షాలు కాపాడినట్లు అవుతుందని వివరించారు. తమ ఉద్యమానికి 38వేల మంది మద్దతు ఇస్తున్నట్లు వివరించారు. వారి కృషి ఫలితంగా జాతీయ రహదారుల సంస్థ ప్రస్తుతం రహదారి నిర్మాణాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

*‘ఒక జాతీయ రహదారి పక్కన వందల ఏళ్లనాటి వృక్షాలు ఇంత పెద్దసంఖయలో ఉండడం చాలా అరుదుగా కనిపిస్తుంది. విస్తరణ పేరిట వాటిని తొలగించడం ఎంతవరకు సమంజసం. ట్రాన్స్‌లొకేషన్‌ చేసినా అవి బతికే అవకాశాలు తక్కువగా ఉంటాయి. చెట్లు తొలగించడం ద్వారా అక్కడ ఉన్న చిరువ్యాపారులు వేరొకచోటుకు మారతారేమో..? కానీ వాటిపై జీవించే పక్షులు, ఇతర జీవులు ఎక్కడికి వెళతాయి..? అందుకే చెట్లను కాపాడాలని మా ఉద్యమం చేపట్టాం. సోషల్‌ మీడియాను ఆశ్రయించాం. మా పిటిషన్‌కు వారం వ్యవధిలోనే 35వేల మంది సంతకాలు చేశారు. అనంతరం అధికారులను కలిసి వివరించాం. ప్రత్యామ్నాయ మార్గం చూపించాం. మా పోరాటంతో ప్రాజెక్టును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.’ అని గ్రూపులోని కీలక సభ్యురాలు అసియాఖాన్‌ వివరించారు.
 

- అమరేంద్ర యార్లగడ్డ, ఈనాడు, హైదరాబాద్‌


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.