close

తాజా వార్తలు

ఓటమైనా.. గెలుపైనా... దేశం మీ వెంటే..

ఇస్రో, శాస్త్రవేత్తలకు వెల్లువెత్తుతున్న అండదండలు

ఓటమి కాదిది ఓ కఠిన పాఠం. జాబిల్లిని అందుకొనే క్రమంలో ఓ సోపానం. నిద్రాహారాలు మాని ఏళ్ల తరబడి పడ్డ కష్టం. వృథా అయిపోదులే మీ ప్రయత్నం. పండు వెన్నెలతో పచ్చదనం పరుచుకున్న భూమి అందాన్ని మరింత పెంచే చందమామను చేరుకోవాలన్నది ఇస్రో కల. అక్కడ పరిశోధనలు చేసి మానవాళికి ఉపయోగపడాలన్నది ఆశయం. అనుకున్నదే తడవుగా చంద్రయాన్‌-2 మొదలైంది.

అంచెలంచెల్లో ఆసక్తి
ఆదిలోనే హంసపాదులా ఓ సాంకేతిక సమస్య. దానిని జయించి వారం రోజుల్లో ప్రయోగం చేపట్టింది. 48 రోజుల ఓ అద్భుత ప్రయాణం అంతరిక్షంలో చంద్రయాన్‌ గమనం. ముందుగా భూ కక్ష్యలో పరిభ్రమణం. ఆ తర్వాత చంద్రుడి కక్ష్యలోకి మార్పు. వేగంలో మార్పులు. చివరికి విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రమండలంపై అతికష్టమైన దక్షిణ ప్రాంతంలో ల్యాండింగ్‌. ఒక్కో దశ విజయవంతం అవుతోంటే శాస్త్రవేత్తల కళ్లల్లో ఆనందం. 130 కోట్ల భారతీయుల గుండెల్లో విజయ గర్వం ఉప్పొంగ్గింది. ఆఖరి 15 నిమిషాలు అత్యంత సంక్లిష్టం. అసాధ్యాలను సుసాధ్యం చేసే ఇస్రో విజయం సాధిస్తుందా? అని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనించాయి.

ఎదురుచూపులు
నిద్ర ముంచుకొస్తున్నా తమ జీవిత కాలంలో ఆవిష్కృతం అయ్యే ఓ అద్భుత దృశ్యం చూడాలని శతకోటి ప్రజలు ఎదురుచూశారు. రఫ్‌ బ్రేకింగ్‌ విజయవంతం అవ్వగానే అందరి మొహాల్లో అనిర్వచనీయ ఆనందం. కానీ ఫైన్‌ బ్రేకింగ్‌ గురించి తలచుకోగానే తెలియని ఓ దిగులు ఆవహించింది. 6000 కి.మీ వేగంతో దూసుకొచ్చిన విక్రమ్‌ ల్యాండర్‌ జాబిల్లి ఉపరితలం చేరుకోవడానికి ఇంకా 2.1 కిలోమీటర్ల దూరం ఉందనగా సిగ్నల్స్‌ ఆగిపోయాయి. అప్పటి వరకు ప్రయోగాన్ని ఆసక్తిగా వీక్షిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ సహా కోట్లాదిమందికి ఏం జరుగుతుందో అర్థంకాలేదు. చివరికి ప్రయోగం సశేషం అని తెలియడంతో శాస్త్రవేత్తల కళ్లు చెమ్మగిల్లాయి. ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ కళ్ల నుంచి ఉబికి వస్తున్న నీరు చూసి ప్రధాని మోదీ ఆయన్ను హత్తుకున్నారు. ఊరడించారు. ‘మున్ముందు మీరు గొప్ప విజయాలు సాధిస్తారన్న నమ్మకం ఉంది’ అని వెన్నుతట్టారు. ఉదయం 8 గంటలకు మీడియా సమావేశంలో శాస్త్రవేత్తలకు అండగా నిలిచారు. ఆయనతో మొదలైన ఈ వెల్లువ ఆగలేదు. దేశాధినేతలు, రాజకీయ నాయకులు, సినీ తారలు, క్రీడాకారులు, అసంఖ్యాక జనం ఇస్రో వెన్నంటే నిలిచారు. క్లుప్తంగా చెప్పాలంటే భారత జాతి వారి వెనక నిలిచింది.

మీ వెంటే మేమంతా: మోదీ
‘మనం దాదాపు చేరుకున్నాం. మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలి. ఈ రోజు నేర్చుకున్న పాఠం మనల్ని మరింత బలవంతుల్ని చేస్తుంది. మన అంతరిక్ష పరిశోధనలను, శాస్త్రవేత్తలను చూసి జాతి గర్విస్తోంది. భారతదేశం మీ మీవెన్నంటే ఉంది’ అని ప్రధాని మోదీ శాస్త్రవేత్తలకు అభయమిచ్చారు. ‘చంద్రయాన్‌-2 మిషన్‌లో ఇస్రో మొత్తం అకింతభావం, ధైర్యసాహసాలను ప్రదర్శించింది. దేశం మిమ్మల్ని చూసి గర్విస్తోంది. మున్ముందు అంతా మంచే జరుగుతుంది’ అని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పేర్కొన్నారు. ‘నిరాశకు తావులేదు. ఇస్రో కేవలం ల్యాండర్‌తో భావప్రసారం కోల్పోయింది. 130 కోట్ల మంది భారతీయుల ఆశలతో కాదు. శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, ప్రతి ఒక్కరికీ ప్రణామం చేస్తున్నాను’ అని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వారికి అండగా నిలిచారు.

మీ కష్టం వృథా కాదు: రాహుల్‌
‘చంద్రయాన్‌-2 మిషన్‌లో అద్భుతంగా పనిచేసిన ఇస్రో జట్టుకు అభినందనలు. మీ అంకితభావం, అభిరుచి దేశంలోని ప్రతిఒక్కరికీ స్ఫూర్తి. మీ కష్టం వృథా పోదు. మరిన్ని విజయాలకు ఇది పునాది’ అని కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఊరడించారు. భాజపా అధ్యక్షుడు అమిత్‌షా, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, సీపీఎం జనరల్‌ సెక్రటరీ సీతారాం ఏచూరి, స్మృతి ఇరాని సహా కేంద్రమంత్రులు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు శాస్త్రవేత్తలకు ధైర్యం చెప్పారు. ‘భారతదేశాన్ని, ఆ దేశ శాస్త్రవేత్తలను చూసి మేం గర్విస్తున్నాం. ఆఖరి నిమిషంలో చంద్రయాన్‌-2కి కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి. కానీ మీ ధైర్య, సాహసాలు అసమానం, చారిత్రకం. ప్రధాని నరేంద్రమోదీ గురించి నాకు తెలుసు. ఆయన, ఇస్రో జట్టు ఏదో ఒకరోజు విజయం సాధిస్తారు’ అని భూటాన్‌ ప్రధానే ట్వీట్‌ చేయడం గమనార్హం.

అయితే ఏంటీ?
తమ సినీ ప్రాజెక్టులతో తీరకలేకుండా ఉన్నప్పటికీ సినీతారలూ ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేశారు. వారి అంకితభావాన్ని కొనియాడారు. ఎత్తుపల్లాలు సహజమని పేర్కొన్నారు. బాలీవుడ్‌ సహా అన్ని భాషల నటీనటులు వారికి అండగా నిలిచారు. ‘కంటిలో నీటి చెమ్మ. గొంతులో ఆరిపోయిన తడి. ఏదో జరిగిందని కాదు. ఆశలు, ఆశయాలతో జాతి మొత్తాన్ని ఎంతో అందంగా ఏకతాటిపైకి తెచ్చినందుకు. ఎక్కువ దూరం దూకే క్రమంలో కొన్ని అడుగులు వెనక్కి పడితే ఫర్వాలేదు. ఇస్రో నువ్వు మా హీరో’ అని మిషన్‌ మంగళ్‌యాన్‌లో శాస్త్రవేత్తగా నటించిన తాప్సి చేసిన ట్వీటిది. ఇక అమితాబ్‌ అయితే ‘గర్వం ఎప్పుడూ ఓటమిని చూడదు. మా గర్వం.. మా విజయం ఇస్రో’ అని అన్నారు. ‘ప్రయోగాలు చేయకుండా సైన్స్‌ లేదు. కొన్ని సార్లు మనం విజయం సాధిస్తాం. కొన్నిసార్లు పాఠాలు నేర్చుకుంటాం. ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రణామం. చంద్రయాన్‌-2 కచ్చితంగా చంద్రయాన్‌-3కు దారితీస్తుందని మాకు విశ్వాసం ఉంది. మనం మళ్లీ విజయంతో నిలబడతాం’ అని అక్షయ్‌ కుమార్‌ అన్నాడు.

‘గర్వం ఎప్పుడూ ఓటమిని చూడదు. మా గర్వం.. మా విజయం ఇస్రో’-అమితాబ్‌

 

ఇదే మన గమ్యం కాదు
జాతి మొత్తం మీ వెంట నిలబడిందని అనుష్కశర్మ పేర్కొంది. ఏదో ఒక రోజు మనం సాధిస్తామని సోనాక్షి సిన్హా ఊరడించింది. ‘కొన్నిసార్లు మనం కోరుకున్న గమ్యాన్ని చేరుకోలేం. కానీ నమ్మకంతో, ఆత్మవిశ్వాసంతో ప్రయాణించాలి. మన ప్రస్తుత పరిస్థితి మన తుది గమ్యం కాదు. మనం మన లక్ష్యాన్ని చేరుకుంటాం’ అని బాద్షా షారుఖ్‌ చెప్పాడు. ‘ఇది ఓటమి కాదు. పరిశోధన, అభివృద్ధిలో నేర్చుకొనే అంశాలుంటాయి. ఇది అలాంటి సందర్భమే. మనం త్వరలోనే చంద్రుడిని చేరకుంటాం. జాతి మొత్తం మిమ్మల్ని విశ్వసిస్తోంది. అభినందిస్తోంది’ అని కమల్‌ హాసన్‌ ధైర్యం చెప్పారు. ‘పోయింది భావప్రసారమే.. నమ్మకం కాదు’ అని సన్నీ దేవోల్‌ అన్నాడు. ఇషా కొప్పికర్‌, శేఖర్‌ కపూర్‌, కరన్‌ జోహార్‌, ఫర్హాన్‌ అక్తర్‌, అనుపమ్‌ ఖేర్‌, పరేశ్‌ రావల్‌, అనిల్‌ కపూర్‌ ఇస్రోకు అండగా నిలిచారు. ‘ఇస్రోను చూసి గర్విస్తున్నాం. చంద్రుడిపై దక్షిణప్రాంతంలో అడుగుపెట్టడం అంత సులభం కాదు. భారత్‌ ధైర్యంగా ఆ సాహసం చేపట్టింది. ఇది మన భవిష్యత్తు అంతరిక్ష పరిశోధనలకు మార్గం చూపిస్తుంది. మనకే కాదు ప్రపంచ దేశాలకూ మార్గనిర్దేశం చేస్తుంది’ అని తెలుగు నటుడు సుధీర్‌ బాబు అన్నాడు.

‘‘సక్సెస్‌ ఈజ్‌ నాట్‌ ఎ డెస్టినీ. ఇట్స్‌ ఎ జర్నీ’ చంద్రయాన్‌-2తో ఇస్రో చరిత్రాత్మక ప్రయాణం మొదలు పెట్టింది. ఈ ప్రాజెక్టులో పనిచేసిన ప్రతి శాస్త్రవేత్తకు సెల్యూట్‌ చేస్తున్నా. మీరే మా నిజమైన హీరోలు. మీతో మేమున్నాం. మన విజయ గాథకు ఇదే ఆరంభం. ఇదే మార్గం.’’ -మహేశ్‌బాబు

 

చిన్నారులకు ప్రేరణ
జయాపజయాలు క్రీడాకారులకు సహజాతాలు. అవెప్పుడూ వారివెన్నంటే ఉంటాయి. ఓటమి పాలైన ప్రతిసారీ కసితో శ్రమించి మళ్లీ విజయం సాధిస్తారు. ఇస్రోది సైతం ప్రస్తుతం అదే పరిస్థితి. అందుకే వారి ఆవేదనను అర్థం చేసుకున్నారు. శాస్త్రవేత్తలకు అండగా నిలిచారు. ‘అంతరిక్ష శాస్త్రంలో భారత్‌ను అగ్రగామిని చేసిన ఇస్రో శాస్త్రవేత్తలను చూసి గర్విస్తున్నాం. చంద్రయాన్‌-2 కోట్లాది భారతీయ చిన్నారులకు ప్రేరణనిస్తుంది. జైహింద్‌’ అని టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి ట్వీట్‌ చేశాడు. ‘సైన్స్‌లో వైఫల్యాలేమీ ఉండవు. ప్రయోగాలు చేస్తాం. నేర్చుకుంటాం. రాత్రీ పగలు కష్టపడ్డ ఇస్రో శాస్త్రవేత్తలను మేమెంతో గౌరవిస్తాం. దేశం మిమ్మల్ని చూసి గర్విస్తోంది. జైహింద్‌’ అని టీమిండియా సారథి కోహ్లీ ధైర్యం చెప్పాడు. ‘మన అడ్డంకుల నుంచి నేర్చుకోనప్పుడే అది వైఫల్యం అవుతుంది. మనం మరింత శక్తిమంతంగా తిరిగొస్తాం. కోట్లాది భారతీయల కలలన ఏకతాటిపైకి తీసుకొచ్చిన ఇస్రో శాస్త్రవేత్తల అపూర్వ కృషికి వందనం చేస్తున్నా. మనం కచ్చితంగా సాధిస్తాం’ అని గౌతమ్‌ గంభీర్‌ శాస్త్రవేత్తల్లో ఆవేశం నింపాడు.

ఓటమే తొలి మెట్టు
‘విజయానికి ఓటమే తొలిమెట్టు. మన చంద్రయాన్‌కు ఏం కాలేదు. అత్యుత్తమంగా పోరాడాం. ఇస్రో శాస్త్రవేత్తలు ఎంతో కృషి చేశారు’ అని రైనా అన్నాడు. ‘ఒక జాతిగా ఇస్రో జట్టును చూసి ఎంతో గర్విస్తున్నాం. చంద్రయాన్‌-2  కోసం అహర్నిశలు పనిచేశారు. గుండెల నిండా ఆశలు, ఆశయాలతో మళ్లీ మనం పైకిలేద్దాం. సాధిద్దాం’ అని యువీ అన్నాడు. ధవళ్‌ కుల్‌కర్ణి, సిద్ధార్థ కౌల్‌, రమేశ్‌ పొవార్‌, హార్దిక్‌ పాండ్య, కృనాల్‌ పాండ్య, అజింక్య రహానె, ఇషాంత్‌ శర్మ, హర్భజన్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, శిఖర్‌ ధావన్‌, రిషభ్‌పంత్‌ సహా మరెంతో మంది క్రికెటర్లు ఇస్రోకు అండగా నిలిచారు. సైనా నెహ్వాల్‌, మిథాలీ రాజ్‌ సైతం శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజలు ఇస్రోకు మద్దతు తెలుపుతున్నారు. రంగంపేటలో ఓ యువకుడు ‘ఐ లవ్‌ ఇస్రో. వీ ఆర్‌ ప్రౌడ్‌ ఆఫ్‌ యు’ అని ఓ సైకత శిల్పం రూపొందించాడు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.