close

తాజా వార్తలు

ఈ గణకులకు గిరాకీ!

అంకెలతో ఆడుకోవడం ఇష్టమా.. సాంఖ్యకశాస్త్రం అంటే సరదానా.. మ్యాథ్స్‌ మీద మక్కువా.. అయితే ఈ కోర్సు మీ కోసమే. అందరికంటే భిన్నంగా అధిక ఆదాయంతో జీవించాలనుకుంటే యాక్చూరియల్‌ సైన్స్‌ చదవాలి. బీమా పాలసీల నిర్ణయంలోనూ, కంపెనీలు ఆర్థికంగా...

కెరియర్‌ గైడెన్స్‌ - యాక్చూరియల్‌ సైన్స్‌

అంకెలతో ఆడుకోవడం ఇష్టమా.. సాంఖ్యకశాస్త్రం అంటే సరదానా.. మ్యాథ్స్‌ మీద మక్కువా.. అయితే ఈ కోర్సు మీ కోసమే. అందరికంటే భిన్నంగా అధిక ఆదాయంతో జీవించాలనుకుంటే యాక్చూరియల్‌ సైన్స్‌ చదవాలి. బీమా పాలసీల నిర్ణయంలోనూ, కంపెనీలు ఆర్థికంగా నిలదొక్కుకొని మరింత పటిష్ఠం కావడానికి ఈ యాక్చూరియల్‌ నిపుణులు దోహదపడుతున్నారు. దేశవ్యాప్తంగా అత్యంత డిమాండ్‌ ఉన్న ఈ కెరియర్‌ ఇంటర్‌లో ఏ గ్రూప్‌ అభ్యర్థులకైనా మంచి అవకాశం.

బీమా పాలసీ ఎంత ఉండాలి? ఎక్కువమందిని ఆకర్షించాలంటే అందులో ఎలాంటి ఆప్షన్లు జోడించవచ్చు? కంపెనీలు ఆర్థికంగా నిలదొక్కుకుని, మరింత పటిష్ఠం కావాలంటే ఏం చేయాలి? వీటిని నిర్ణయించి దిశానిర్దేశం చేస్తారు యాక్చూరియల్‌ నిపుణులు. ఆ నైపుణ్యాన్ని సంపాదించాలంటే యాక్చూరియల్‌ సైన్స్‌ కోర్సు చదవాలి.  పలు విద్యా సంస్థలు యూజీ, పీజీ స్థాయుల్లో కోర్సులు అందిస్తున్నాయి. వీటిని పూర్తి చేసినవారిని యాక్చురీ (గణకుడు లేదా బీమా గణకుడు) అంటారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్చూరియల్‌ ఫెలోలు 400 కంటే తక్కువ మందే ఉన్నారు. మనదేశంలోనూ, విదేశాల్లోనూ వీరికి బాగా డిమాండ్‌ ఉంది.

గత అనుభవాలు, వర్తమాన పరిస్థితుల ఆధారంగా అంచనాలను జోడించి రేపటి ఆర్థిక చిత్రాన్ని విశ్లేషించేవారే యాక్చురీలు. ఆర్థిక సేవలు అందిస్తోన్న సంస్థలన్నీ యాక్చూరియల్‌ నిపుణుల నివేదికల ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటాయి. ఉదాహరణకు టర్మ్‌ పాలసీని తక్కువ ధరకే కంపెనీ అందించాలనుకుంటే దాని పరిణామాలను వీరు  వివరిస్తారు. పాలసీదారుల్లో ఏడాది వ్యవధిలో ఎంతమంది మరణించడానికి అవకాశం ఉంది, ఆ ఏడాదిలో కంపెనీ ఎంత బీమా మొత్తం చెల్లించాల్సి ఉంటుంది, ఎంత రాబడుతుంది...ఈ వివరాలన్నీ వీరు శాస్త్రీయంగా మదింపు చేస్తారు. ఊహకందని పరిణామాలనూ పరిగణనలోకి తీసుకుని సంస్థకు, పాలసీదారునికి అనువైన వివిధ స్కీములు, పాలసీలు రూపొందిస్తారు.
బీమా, ఆర్థిక సంస్థలే కాకుండా కార్పొరేట్‌ సంస్థలు సైతం రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ కోసం యాక్చురీలను నియమించుకుంటున్నాయి. సంక్లిష్టమైన ఆర్థిక సమస్యల చిక్కుముడులను  వీరు విప్పుతారు. ఆర్థిక నమూనాలను రూపొందిస్తారు. పరిష్కారాలను సంస్థల ముందు ఉంచుతారు. లైఫ్‌ ఇన్సూరెన్స్‌, హెల్త్‌ ఇన్సూరెన్స్‌, మార్ట్‌గేజ్‌, పెన్షన్‌, ఆటోమొబైల్‌ ఇన్సూరెన్స్‌ ఇలా అన్నింటికీ వీరి సేవలు కీలకం. రిస్క్‌ గురించి అధ్యయనం చేసి దాని స్థాయిని తగ్గించడమే యాక్చూరియల్‌ ముఖ్య విధి. మ్యాథ్స్‌లో అల్గారిథమ్స్‌, స్టాటిస్టిక్స్‌ మోడల్స్‌ ఉపయోగించి గణాంక విశ్లేషణ చేస్తారు.

ఏ గ్రూప్‌వారైనా..!

ఇంగ్లిష్‌ ఒక సబ్జెక్టుగా ఇంటర్మీడియట్‌ (10+2) లేదా తత్సమాన అర్హత ఉన్న వారెవరైనా యాక్చూరియల్‌ సైన్స్‌ కోర్సు చేయవచ్చు. అయితే మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌, ఎకనామిక్స్‌ సబ్జెక్టులపై పట్టున్నవారికి యాక్చూరియల్‌ సైన్స్‌ అర్థం చేసుకోవడం సులువవుతుంది. ఇంటర్లో మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌, ఎకనామిక్స్‌ కోర్సులు చదివినవారికి యూజీ స్థాయిలోని మేటి ఆప్షన్లలో యాక్చూరియల్‌ సైన్స్‌ ఒకటి. యాక్చురీలకి అనలిటికల్‌ స్కిల్స్‌, బిజినెస్‌ పరిజ్ఞానం, మనుషుల ప్రవర్తన, ప్రస్తుత సమాజానికి ఎదురవుతోన్న ఇబ్బందులు, సంఘటనలపై అవగాహన ఉండాలి. సమస్యలను పరిష్కరించే నైపుణ్యం, తర్కం ఉన్నవారు ఈ రంగంలో వేగంగా రాణిస్తారు. క్వాంటిటేటివ్‌ మెథడ్స్‌, డేటా అనలిటిక్స్‌పై పట్టు పెంచుకోవాలి.

ప్రవేశపరీక్ష - ఏసెట్‌

సీఏ, సీడబ్ల్యుఏ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సుల నిర్వహణకు జాతీయ స్థాయిలో సంస్థలు ఉన్నట్లుగానే యాక్చూరియల్‌ సైన్స్‌ కోసం ఇన్‌స్ట్టిట్యూట్‌ ఆఫ్‌ యాక్చురీస్‌ ఆఫ్‌ ఇండియా (ఐఏఐ) ఏర్పాటైంది. ఈ సంస్థ ఆధ్వర్యంలో యాక్చూరియల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏసెట్‌) నిర్వహిస్తారు. ఇందులో యాక్చూరియల్‌/ మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
ఆన్‌లైన్‌లో వంద మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 70 ప్రశ్నలు వస్తాయి. సెక్షన్‌-ఎలో 45 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు. సెక్షన్‌-బిలో 20 ప్రశ్నలు. ప్రశ్నకు రెండేసి మార్కులు ఇస్తారు. సెక్షన్‌-సిలో 5 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కోదానికి 3 మార్కులు. మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌, డేటా ఇంటర్‌ప్రిట్రేషన్‌ విభాగాలకు 55 శాతం; ఇంగ్లిష్‌, లాజికల్‌ రీజనింగ్‌కు 45 శాతం వెయిటేజీ ఉంటుంది. హైదరాబాద్‌, విశాఖపట్నం సహా దేశవ్యాప్తంగా 24 కేంద్రాల్లో ఒకే రోజు, ఒకే స్లాట్‌లో పరీక్ష నిర్వహిస్తారు. ఏడాదికి రెండు సార్లు పరీక్ష ఉంటుంది. ఫిబ్రవరి, ఆగస్టుల్లో పేర్లు నమోదు చేసుకోవాలి. జూన్‌, డిసెంబరుల్లో పరీక్షలు నిర్వహిస్తారు. కనీసం 50 శాతం మార్కులు సాధిస్తే అర్హులుగా పరిగణిస్తారు. అర్హత సాధించినవారు యాక్చూరియల్‌ కోర్సులో నిర్దేశిత పేపర్లను పూర్తిచేయాల్సి ఉంటుంది.

పదిహేను పేపర్లు

స్టేజ్‌-1 కోర్‌ టెక్నికల్‌ (సీటీ), స్టేజ్‌-2 కోర్‌ అప్లికేషన్‌ (సీఏ) ఈ రెండూ అందరికీ ఉమ్మడిగా ఉంటాయి. సీటీలో 9, సీఏలో 3 పేపర్లు ఉంటాయి. ఈ రెండు దశలనూ పూర్తిచేసినవారిని అసోసియేట్‌గా పరిగణిస్తారు. స్టేజ్‌-3 స్పెషలిస్ట్‌ టెక్నీషియన్‌ (ఎస్టీ), స్టేజ్‌-4 స్పెషలిస్ట్‌ అప్లికేషన్‌ (ఎస్‌ఏ). ఎస్టీలో 8 నుంచి 2 పేపర్లు ఎంచుకుని పూర్తిచేయాలి. ఎస్‌ఏలో ఆరింటిలో ఏదో ఒకటి రాసుకోవచ్చు. నాలుగు దశలూ (15 పేపర్లు) పూర్తిచేసుకుంటే ఫెలోగా వ్యవహరిస్తారు. అయితే ఒక్క స్టేజ్‌-1 పాసైనా కొలువు లభిస్తుంది. 15 పేపర్లూ పూర్తిచేసుకున్న వారికి నెలవేతనం ఏడంకెల్లో ఉంటుంది. మూడు పేపర్లు పూర్తిచేసుకున్న గ్రాడ్యుయేట్లు సైతం అవకాశాలు దక్కించుకుంటున్నారు.

భారతీయ విద్యార్థులు ఇన్‌స్ట్టిట్యూట్‌ ఆఫ్‌ యాక్చురీస్‌ ఇండియా (ఐఏఐ)తోపాటు  యూకేలోని ఇన్‌స్ట్టిట్యూట్‌  అండ్‌ ఫ్యాకల్టీ ఆఫ్‌ యాక్చురీస్‌ (ఐఎఫ్‌ఓఏ) నిర్వహించే పరీక్షలను ఎక్కువగా రాస్తున్నారు. ఐఏఐతో పోలిస్తే ఐఎఫ్‌ఏఐలో ఉత్తీర్ణత శాతం ఎక్కువ. అయితే పరీక్ష కోసం పెద్ద మొత్తంలో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పలు దేశాల్లోని యాక్చూరియల్‌ సంస్థలన్నింటికీ కలిపి అంతర్జాతీయ యాక్చూరియల్‌ అసోసియేషన్‌ సైతం ఏర్పడింది. ఇప్పటివరకు ఐఏఐ 15 పేపర్లు పూర్తిచేసివారు భారతదేశం మొత్తంమీద 400 మందే ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. వీటిని పూర్తిచేసినవారికి విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. ఈ కోర్సు తక్కువ వ్యవధిలో పూర్తికావడం చాలా కష్టం. అందుకే ఏదైనా డిగ్రీ చదువుతూ పేపర్లు పూర్తిచేసుకోవడం మంచిది. విద్యార్థులకు మరింత సౌలభ్యం కోసం పలు సంస్థలు ఇప్పుడు యూజీ, పీజీ స్థాయిలో యాక్చూరియల్‌ సైన్స్‌ కోర్సులు అందిస్తున్నాయి. ఈ సంస్థలు తమ కోర్సుల కరిక్యులమ్‌ ఐఏఐ పేపర్లకు అనుగుణంగా రూపొందించాయి. అందువల్ల ఒకవైపు డిగ్రీ, పీజీలు చదువుకుంటూ వాటిని పూర్తిచేసుకోవచ్చు.

ఉద్యోగాలు ఎక్కడ?

లైఫ్‌ ఇన్సూరెన్స్‌, హెల్త్‌ ఇన్సూరెన్స్‌, జనరల్‌ ఇన్సూరెన్స్‌, ఫైనాన్స్‌, ఇన్వెస్టిమెంట్‌, ఎంటర్‌ప్రైజ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, అకడమిక్స్‌, రెగ్యులేటరీ, రీ-ఇన్సూరెన్స్‌ కంపెనీలు, కన్సల్టింగ్‌ సంస్థల్లో ఉద్యోగాలుంటాయి. అకౌంటింగ్‌ సంస్థలు, ఇన్వెస్ట్ట్‌మెంట్‌ సంస్థలు, మ్యూచువల్‌ ఫండ్స్‌,  క్రెడిట్‌ రిస్క్‌ అండ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు, స్టాక్‌ మార్కెట్లు, సోషల్‌ సెక్యూరిటీ స్కీంల్లోనూ వీరి సేవలు వినియోగించుకుంటారు. కన్సల్టెంట్లుగా పనిచేయవచ్చు. ప్రభుత్వ విభాగాల్లోనూ ఉద్యోగాలు ఉంటాయి. ప్రొడక్ట్‌ అనలిస్ట్‌, యాక్చూరియల్‌ అనలిస్ట్‌, రిస్క్‌ అనలిస్ట్‌ హోదాలతో బ్యాంకులు, ఇన్సూరెన్స్‌ సంస్థలు, బిజినెస్‌ కన్సల్టెన్సీల్లో తీసుకుంటున్నారు.

కోర్సులు అందిస్తున్న సంస్థలు

మిటీ యూనివర్సిటీ బీ యూనివర్సిటీ ఆఫ్‌ మద్రాస్‌ బీ డీఎస్‌ యాక్చూరియల్‌ ఎడ్యుకేషన్‌ సర్వీసెస్‌ బీ బిషాప్‌ హెబర్‌ కాలేజ్‌ బీ అన్నామలై యూనివర్సిటీ బీ ఇన్సూరెన్స్‌ ఇన్‌స్ట్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా బీ యూనివర్సిటీ ఆఫ్‌ పుణే, బీ క్రిస్ట్‌ యూనివర్సిటీ బీ మహాత్మాగాంధీ యూనివర్సిటీ బీ యశ్వంతరావ్‌ చవాన్‌ మహారాష్ట్ర ఓపెన్‌ యూనివర్సిటీ బీ ఐఐఆర్‌ఎం హైదరాబాద్‌ ఏడాది వ్యవధితో పీజీ డిప్లొమా ఇన్‌ యాక్చూరియల్‌ సైన్స్‌, పీజీ డిప్లొమా ఇన్‌ అనలిటిక్స్‌ అండ్‌ యాక్చూరియల్‌ సైన్స్‌ కోర్సులు అందిస్తోంది. రెండేళ్ల వ్యవధితో పీజీ డిప్లొమా కోర్సు డ్యూయల్‌ స్పెషలైజేషన్‌ విధానంలో అందిస్తోంది. ఇందులో యాక్చూరియల్‌ సైన్స్‌ ఒక స్పెషలైజేషన్‌గా తీసుకోవచ్చు. గ్రాడ్యుయేట్లు ఎవరైనా ఈ కోర్సుల్లో చేరవచ్చు.రాజమండ్రిలోని గవర్నమెంట్‌ కళాశాల (అటానమస్‌) యాక్చూరియల్‌ సైన్స్‌, గణితం, స్టాటిస్టిక్స్‌ సబ్జెక్టులతో బీఎస్సీ డిగ్రీని అందిస్తోంది.

Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.