close

తాజా వార్తలు

అవును, నేనెన్నో తప్పులు చేశా: విరాట్‌

డ్రస్సింగ్‌ రూమ్‌లో అరుచుకోవడం, తిట్టుకోవడం ఉండదు

ముంబయి: టీమిండియా డ్రస్సింగ్‌ రూమ్‌లో అరుచుకోవడం, ఒకర్నొకరు తిట్టుకోవడం వంటి సంస్కృతి లేదని సారథి విరాట్‌ కోహ్లీ స్పష్టం చేశాడు. కుల్‌దీప్‌ యాదవ్‌తో ఎంత స్నేహపూర్వకంగా ఉంటానో సీనియర్‌ ఎంఎస్‌ ధోనీతోనూ అలాగే ఉంటానని వెల్లడించాడు. అక్కడ ఎవరైనా ఎవరితోనైనా తమ ఉద్దేశాలను స్పష్టంగా చెప్పొచ్చని పేర్కొన్నాడు. కెరీర్‌ తొలినాళ్లలో తాను ఎన్నో పొరపాట్లు చేశానని వెల్లడించాడు. ప్రపంచకప్‌లో సెమీస్‌ ఓటమి తర్వాత తొలిసారి అతడు టైమ్స్‌ వార్తా సంస్థకు ముఖాముఖి ఇచ్చాడు.

అవును. ఎదుగుతున్నప్పుడు నేనెన్నో తప్పులు చేశా. మొదట్లో ఇంత తీవ్ర ఏకాగ్రత లేదు. స్వల్ప విషయాలకే దారిమళ్లేవాడిని. ఆ తర్వాత దారిలోకి వచ్చా. నేనిప్పుడున్న స్థితికి కృతజ్ఞుడిగా ఉంటా. మనతో ఎప్పటికీ ఉండేది మనం చేసిన కష్టమే. 

కుర్రాళ్లు తప్పులు చేయొద్దని..

‘డ్రస్సింగ్‌ రూమ్‌లో అందరితోనూ సరదాగా మాట్లాడతాను. వారి వద్దకు వెళ్లి కెరీర్‌ తొలినాళ్లలో నేను చేసిన తప్పులు చెప్పి అలాంటివి చేయొద్దని సూచిస్తాను. కుర్రాళ్ల కెరీర్‌ రెండు మూడేళ్లలో మెరుగవుతుంది. వారు సాధికారత సాధించాలని కోరుకుంటాను. తమను తాను నిరూపించుకొనేందుకు తగిన అవకాశం ఇస్తాను. ఒక దశకు వచ్చి ఆందోళన పడుతున్నప్పుడు వారితో మాట్లాడతాను. మీరిప్పుడు ఈ దారితో వెళ్తున్నారు. ఇలా వెళ్లాలని చెప్తా. ఈ పొరపాట్లను ఇప్పుడు సరిద్దిద్దుకో లేకుంటే మొదట్లో నాలాగే బాధపడాల్సి వస్తుందని చెప్తాను. వాళ్లు రెండు మూడేళ్లు కెరీర్‌ను వృథా చేసుకోవడం నాకిష్టం ఉండదు. నాకన్నా వారు ఎక్కువ ఆడాలని కోరుకుంటా’ అని కోహ్లీ అన్నాడు.

ముచ్చటేస్తున్న ఆత్మవిశ్వాసం

రిషభ్‌పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌, శుభ్‌మన్‌గిల్‌ వంటి యువ ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం చూస్తుంటే ముచ్చటేస్తుందని విరాట్‌ వెల్లడించాడు. ‘19-20 ఏళ్ల వయసులో నేనిలా లేను. ఐపీఎల్‌ వంటి టోర్నీల ద్వారా యువకులు అనుభవం సంపాదిస్తున్నారు. ఆత్మవిశ్వాసంతో అంతర్జాతీయ వేదికపై సత్తా చాటుతున్నారు. త్వరగా తప్పులు తెలుసుకుంటున్నారు. ఎందుకంటే వారు ఇంతకు ముందే వేలాది ప్రేక్షకుల ముందు ఆడారు. అయితే ఈ వేదికను నా దేశం కోసం ఆడేందుకు ఉపయోగించుకుంటున్నాను అన్న ఉద్దేశం వారిలో ఉండాలి’ అని విరాట్‌ వెల్లడించాడు.

ఓటములను చూసే నా జీవితంలో ఎన్నో నేర్చుకున్నాను. ఒక వ్యక్తిగా మెరుగయ్యేందుకు అవి ప్రేరణనిస్తాయి. విజయం కన్నా వైఫల్యాలకే ఎందుకు ఎక్కువ విలువ ఇవ్వాలో అర్థం చేసుకున్నా. కూర్చొని పరిస్థితి మెరుగయ్యేందుకు ఏం చేయాలో ఆలోచిస్తాను. భవిష్యత్‌ ప్రణాళిక సిద్ధం చేస్తాను. మనతో ఎవరుంటారు? ఎవరు ఓడ దూకేస్తారో ఇలాంటి సందర్భాల వల్లే తెలుస్తుంది. - ప్రపంచకప్‌ సెమీస్‌ నిష్ర్కమణ తర్వాత విరాట్‌

అప్పుడు గుర్తించా

ఆస్ట్రేలియాలో 2012లో ఆడేటప్పుడు ఫిట్‌నెస్‌ విలువ తెలుసుకున్నానని కోహ్లీ చెప్పాడు. ప్రత్యర్థి జట్టు ఒక్క చెత్త బంతి వేయడం లేదు, బ్యాట్స్‌మన్‌ రోజుల తరబడి ఎలా ఆడుతున్నారో ఆలోచించానని పేర్కొన్నాడు. తాము బ్యాటింగ్‌ చేయాలంటే మూడు రెట్లు కష్టపడాల్సి వస్తుందన్నాడు. అప్పుడే తాను ఇలాగే ఉంటే ఆడలేనని తెలుసుకున్నట్టు విరాట్‌ చెప్పాడు.

ఎవరికీ చెప్పను

‘నా ఫిట్‌నెస్‌ స్థాయి మెరుగుపరుచుకోకుంటే ఆసీస్‌ ఆటగాళ్ల స్థాయిలో ఆడలేనని మా ఫిట్‌నెస్‌ శిక్షకుడు శంకర్‌ బసు తొలిసారి నాకు చెప్పాడు. ఆయనకు అప్పుడు దీని గురించి తెలుసు. బసుతో కలిసి కొన్నేళ్లు పనిచేశాను. ఆ తర్వాత ఆయన మొత్తం సన్నివేశం మార్చేశాడు. జట్టులో ఆడాలంటే మీరిలా చేయండని సహచరులకు ఎప్పుడూ చెప్పను. నా పని నేను చేసుకుంటా. జిమ్‌లో ఎక్కువ కష్టపడతా. 120% ప్రయత్నిస్తా. 11 ఏళ్లుగా నేను కష్టపడుతున్నానని వారు గుర్తించారు. తామెందుకు కష్టపడొద్దని గుర్తించారు. ఇప్పుడు ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టారు. దేహం సహకరిస్తేనే మనసు తమ మాట వింటుందని వారికి స్పష్టత వచ్చింది’ అని కోహ్లీ అన్నాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.