close

తాజా వార్తలు

మోదీ Vs ఇమ్రాన్‌..కశ్మీర్‌ను ప్రస్తావిస్తారా? 

ఒకే వేదిక నుంచి ఇద్దరు ప్రధానుల ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి

ఇంటర్నెట్‌ డెస్క్‌: న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (యూఎన్‌జీఏ)లో ఈ రోజు అరుదైన సన్నివేశం చోటుచేసుకోబోతోంది. కశ్మీర్‌ అంశంపై ఉప్పూ నిప్పులా ఉన్న పాక్‌, భారత్‌ ప్రధానులు ఒకే వేదికపై నుంచి ప్రసంగించబోతున్నారు. కశ్మీర్‌లో శాంతి స్థాపన, అభివృద్ధిపై మోదీ దృష్టిసారిస్తుంటే.. పాక్‌ మాత్రం కశ్మీర్‌ అంశాన్నే ఆయుధంగా చేసుకొని మరోసారి భారత్‌పై విరుచుకుపడేందుకు సిద్ధమవుతోందని ప్రచారం జరుగుతోంది. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. న్యూయార్క్‌లో జరిగిన సార్క్‌ సమావేశంలో భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌ ప్రసంగాన్ని పాక్‌ విదేశాంగ మంత్రి మహ్మద్‌ ఖురేషీ బహిష్కరించడం గమనార్హం. భారత్‌ మంత్రితో వేదిక పంచుకోవడం తనకు ఇష్టంలేదని.. కశ్మీర్‌లో భారత ప్రభుత్వం చర్యలకు నిరసనగా తాను ఈ సమావేశాన్ని బహిష్కరించినట్టు ఆయన చెప్పుకొన్నారు. అయితే, ఈ అంశంపై జయశంకర్‌ను మీడియా ప్రశ్నించగా ఆయన స్పందించేందుకు నిరాకరించారు. ఈ పరిణామం చోటుచేసుకున్న మరుసటి రోజే యూఎన్‌జీఏలో ప్రధాని నరేంద్ర మోదీ రాత్రి 9గంటలకు (భారత కాల మానం ప్రకారం) ప్రసంగించనున్నారు. ఆ వెనువెంటనే పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రసంగిస్తారు. అయితే, ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు కేంద్రబిందువుగా ఉన్న కశ్మీర్‌ అంశాన్ని ఈ నేతలిద్దరూ ప్రస్తావిస్తారా? ఒకవేళ ప్రస్తావిస్తే ఏం మాట్లాడతారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

పాక్‌ అజెండా అదేనా?

ఇప్పటికే అమెరికా పర్యటనలో ఉన్న నరేంద్ర మోదీ.. పలు దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చల సందర్భంగా భారత్‌ ప్రాధాన్యతలను ప్రపంచ దేశాలకు వినిపించగా.. పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ మాత్రం కశ్మీర్‌ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ వచ్చారు. ఉగ్రవాద నిర్మూలన, ప్రపంచంలో శాంతి స్థాపన, వాతావరణంలో మార్పులు, పేదరిక నిర్మూలన తదితర అంశాలపై ప్రధాని మోదీ తన గళాన్ని విన్పించారు. ఐరాస సర్వసభ్య సమావేశంలో మోదీ.. వాతావరణ మార్పులు, ఆర్థిక అసమానతలు తదితర కీలక అంశాలపైనే ప్రధానంగా మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, కశ్మీర్‌ అంశంపై ప్రపంచ దేశాల మద్దతు కోరి భంగపాటుకు గురైనప్పటికీ పాకిస్థాన్‌ మరోసారి అదే అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

మరోవైపు, కశ్మీర్‌ వ్యవహారం పూర్తిగా తమ అంతర్గత వ్యవహారమని అన్నివేదికలపైనా భారత్‌ తేల్చి చెబుతోంది. అయితే, దీన్ని పాక్‌ మాత్రం అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడుతోంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో జరిగిన ద్వైపాక్షిక భేటీలో కూడా ప్రధాని నరేంద్ర మోదీ తేల్చి చెప్పారు. కశ్మీర్‌ విషయంలో మధ్యవర్తిత్వానికి తాను ముందుకొస్తానని నాలుగు సార్లు ట్రంప్‌ ఆసక్తి కనబర్చినా.. ఎవరి మధ్యవర్తిత్వమూ తమకు అవసరం లేదంటూ భారత్‌ స్పష్టంగా తిరస్కరించిన విషయం తెలిసిందే. పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోందని.. టెర్రరిస్థాన్‌గా మారిందంటూ మోదీ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదాన్ని వీడకుండా ఆ దేశంతో చర్చలు అసాధ్యమన్నారు. ఇస్లామిక్‌ ఉగ్రవాదాన్ని ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసన్నారు. మరోవైపు,  భారత్‌, అఫ్గానిస్థాన్‌, ఇరాన్‌ల నుంచి తమకు ఇబ్బందులు ఉన్నందున సహకరించాలంటూ ఇమ్రాన్‌ ఖాన్‌ అమెరికాను కోరిన విషయం తెలిసిందే.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.