
తాజా వార్తలు
తరలి వచ్చిన భక్తులు
భువనేశ్వర్ (ఒడిశా): పూరీ జగన్నాథ రథయాత్ర ప్రారంభమైంది. తొమ్మిది రోజుల పాటు రథయాత్ర వేడుకలు జరగనున్నాయి. లక్షలాది మంది భక్తులు హాజరయ్యే ఈ వేడుకలో ఎటువంటి ప్రతికూల ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. గర్భాలయంలో ఉండే జగన్నాథుడిని, ఆయన సోదరి, సోదరులు సుభద్ర, బలభద్రుల విగ్రహాలను అలంకరించి వాటిని రథాలపై నిలిపారు. జగన్నాథ ఆలయం మౌసిమా మందిరం వరకు ప్రతి ఏడాది ఈ రథయాత్ర కొనసాగుతుంది. గుండీచ మందిరంలో బసచేసి.. తొమ్మిదో రోజున జగన్నాథుడు, సుభద్ర, జలభద్రుల విగ్రహాలను తిరిగి జగన్నాథ ఆలయానికి తీసుకొస్తారు. పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి.
పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘రథయాత్ర సందర్భంగా దేశ పౌరులకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. జగన్నాథుడి ఆశీస్సులతో ప్రతి ఒక్కరు శాంతి, సంతోషాలతో ఉంటారని ఆశిస్తున్నాను’’ అని రాష్ట్రపతి కోవింద్ ట్వీట్ చేశారు. జగన్నాథుడి ఆశీస్సులతో భక్తులు సంతోషంగా జీవిస్తారని ఆశిస్తున్నట్లు మోదీ, పట్నాయక్ పేర్కొన్నారు. జగన్నాథ రథయాత్ర సందర్భంగా సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ పూరీ బీచ్ వద్ద దీనికి సంబంధించిన సైకత శిల్పాన్ని రూపుదిద్దారు.
పూరీ జగన్నాథ రథయాత్ర విశేషాలు..
* సాధారణంగా ఏ హిందూ ఆలయంలోనైనా ఊరేగింపు నిమిత్తం మూలవిరాట్టును కదిలించరు. ఊరేగింపుకోసం ఉత్సవ విగ్రహాలుంటాయి. ప్రతి ఏడాది ఒకే రథాన్ని వినియోగిస్తారు. అయితే, ఒడిశాలోని పూరీ జగన్నాథాలయం వీటన్నింటికీ విభిన్నం. బలభద్ర, సుభద్రలతో పాటు ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడిని ఏడాదికొకసారి గుడిలోంచి బయటికి తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు. ఊరేగించేందుకు ప్రతి ఏడాది కొత్తరథాలను నిర్మిస్తారు.
* ఆషాఢ శుద్ధ విదియ రోజున పూరీ క్షేత్రంలో ఈ పండుగ జరుగుతుంది.
* జగన్నాథ రథయాత్ర జరిగేది ఆషాఢ శుద్ధ విదియనాడే అయినా అందుకు రెండు నెలల ముందు నుంచే ఏర్పాట్లు మొదలవుతాయి.
* వైశాఖ బహుళ విదియనాడు రథనిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు పూరీ రాజు. అందుకు అవసరమైన వృక్షాలను 1072 ముక్కలుగా ఖండించి పూరీకి తరలిస్తారు.
* ప్రధాన పూజారి, తొమ్మిది మంది ముఖ్య శిల్పులు, వారి సహాయకులు మరో 125 మంది కలిసి అక్షయతృతీయనాడు రథ నిర్మాణం మొదలుపెడతారు. 1072 వృక్ష భాగాలనూ నిర్మాణానికి అనువుగా 2188 ముక్కలుగా ఖండిస్తారు. వాటిలో 832 ముక్కల్ని జగన్నాథుడి రథం తయారీకీ, 763 కాండాలను బలరాముడి రథనిర్మాణానికీ, 593 భాగాలను సుభద్రాదేవి రథానికీ వినియోగిస్తారు.
* ఆషాఢ శుద్ధ పాడ్యమినాటికి రథనిర్మాణాలు పూర్తయి యాత్రకు సిద్ధమవుతాయి. జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారు.
* 45 అడుగుల ఎత్తున ఈ రథం పదహారు చక్రాలతో మిగతా రెండిటికన్నా పెద్దదిగా ఉంటుంది. ఎర్రటిచారలున్న పసుపువస్త్రంతో ‘నందిఘోష’ను అలంకరిస్తారు. బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అంటారు. దీని ఎత్తు 44 అడుగులు. పద్నాలుగు చక్రాలుంటాయి. ఎర్రటి చారలున్న నీలివస్త్రంతో ఈ రథాన్ని కప్పుతారు.
* సుభద్రాదేవి రథం పద్మధ్వజం. ఎత్తు 43 అడుగులు. పన్నెండు చక్రాలుంటాయి. ఎర్రటి చారలున్న నలుపు వస్త్రంతో పద్మధ్వజాన్ని అలంకరిస్తారు. ప్రతిరథానికీ 250 అడుగుల పొడవూ ఎనిమిది అంగుళాల మందం ఉండే తాళ్లను కడతారు. ఆలయ తూర్పుభాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా నిలబెడతారు.
* విదియనాడు... మేళతాళాలతో గర్భగుడిలోకి వెళ్లిన పండాలు (పూజరులు) ఉదయకాల పూజాదికాలు నిర్వహిస్తారు. శుభముహూర్తం ఆసన్నమవగానే ‘మనిమా(జగన్నాథా)’ అని పెద్దపెట్టున అరుస్తూ రత్నపీఠం మీద నుంచి విగ్రహాలను కదిలిస్తారు.
* ఆలయ ప్రాంగణంలోని ఆనందబజారు, అరుణస్తంభం మీదుగా వాటిని వూరేగిస్తూ బయటికి తీసుకువస్తారు. ఈ క్రమంలో ముందుగా... దాదాపు ఐదున్నర అడుగుల ఎత్తుండే బలరాముడి విగ్రహాన్ని తీసుకువస్తారు. బలభద్రుడ్ని చూడగానే జై బలరామా, జైజై బలదేవా అంటూ భక్తులు చేసే జయజయధ్వానాలతో బోడోదండా మారుమోగిపోతుంది.
* బలరాముడి విగ్రహాన్ని ఆయన రథమైన తాళధ్వజంపై ప్రతిష్ఠింపజేస్తారు. అనంతరం ఆ స్వామి విగ్రహానికి అలంకరించిన తలపాగా ఇతర అలంకరణలను తీసి భక్తులకు పంచిపెడతారు. వాటి కోసం భక్తులు ఎగబడతారు. అనంతరం ఇదే పద్ధతిలో సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా బయటికి తీసుకువచ్చి పద్మధ్వజం అనే రథం మీద ప్రతిష్ఠిస్తారు.
* ఇక ఆ జగన్నాథుడిని దర్శించుకునే క్షణం ఎప్పుడెప్పుడా అని తహతహలాడిపోతుంటారు భక్తులు. దాదాపు ఐదడుగుల ఏడంగుళాల ఎత్తుండే జగన్నాథుడి విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో నుంచి బయటికి తీసుకువస్తుండగానే జయహో జగన్నాథా అంటూ భక్తిపారవశ్యంతో జయజయధ్వానాలు చేస్తారు.
* ఇలా మూడు విగ్రహాలనూ రథాలపై కూర్చుండబెట్టే వేడుకను పహాండీ అంటారు. ఈ దశలో కులమత భేదాలు లేకుండా అందరూ జగన్నాథుడి విగ్రహాన్ని తాకవచ్చు. ఈ మూడు విగ్రహాలనూ తీసుకువచ్చేవారిని దైత్యులు అంటారు. వీరు... ఇంద్రద్యుమ్న మహారాజుకన్నా ముందే ఆ జగన్నాథుడిని నీలమాధవుడి రూపంలో అర్చించిన సవరతెగ రాజు విశ్వావసు వారసులు. ఆలయ సంప్రదాయాల ప్రకారం... వూరేగింపు నిమిత్తం మూలవిరాట్టులను అంతరాలయం నుంచి బయటికి తీసుకువచ్చి రథాల మీద ప్రతిష్ఠింపచేసే అర్హత వీరికి మాత్రమే ఉంటుంది.
* సుభద్ర, జగన్నాథ, బలభద్రులు రథారూఢులై యాత్రకు సిద్ధంగా ఉండగా... పూరీ సంస్థానాధీశులు అక్కడికి చేరుకుంటాడు. జగన్నాథుడికి నమస్కరించి రథం మీదికి ఎక్కి స్వామి ముంగిట బంగారు చీపురుతో శుభ్రం చేస్తాడు. ఈ వేడుకను చెరా పహారా అంటారు. అనంతరం స్వామిపై గంధం నీళ్లు చిలకరించి కిందికి దిగి రథం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణం చేస్తాడు. ఇదే తరహాలో బలరాముడినీ, సుభద్రాదేవినీ అర్చించి వారి రథాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తాడు. అనంతరం రథాలకు తాత్కాలికంగా అమర్చిన తాటిమెట్లను తొలగిస్తారు.
* ఇక యాత్ర మొదలవడమే తరువాయి. జగన్నాథుడి రథం మీదుండే ప్రధాన పండా నుంచి సూచన రాగానే కస్తూరి కళ్లాపి చల్లి హారతిచ్చి... జై జగన్నాథా అని పెద్దపెట్టున అరుస్తూ తాళ్లను పట్టుకుని రథాన్ని లాగడం మొదలుపెడతారు.
* విశాలమైన బోడోదండ (ప్రధానమార్గం) గుండా యాత్ర మందగమనంతో సాగుతుంది. లక్షలాది భక్తజనం నడుమ జగన్నాథుడి రథం అంగుళం అంగుళం చొప్పున చాలా నెమ్మదిగా కదులుతుంది. దీన్నే ఘోషయాత్ర అంటారు.
* భక్తుల తొక్కిసలాటలో చక్రాలకింద ఎవరైనా పడినా, దారిలో ఏ దుకాణమో అడ్డువచ్చినా రథం వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. అడ్డొచ్చిన దుకాణాలను కూలగొట్టైనా సరే ముందుకే నడిపిస్తారు. ఈ యాత్ర ఎంత నెమ్మదిగా సాగుతుందంటే... జగన్నాథుడి గుడి నుంచి కేవలం మూడు మైళ్ల దూరంలో ఉండే గుండీచా గుడికి చేరుకోవడానికి దాదాపు పన్నెండుగంటల సమయం పడుతుంది.
* గుండీచా ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి బయటే రథాల్లోనే మూలవిరాట్లకు విశ్రాంతినిస్తారు. మర్నాడు ఉదయం మేళతాళాలతో గుడిలోకి తీసుకువెళతారు. వారం రోజులపాటు గుండీచాదేవి ఆతిథ్యం స్వీకరించిన అనంతరం దశమినాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. దీన్ని బహుదాయాత్ర అంటారు. ఆ రోజు మధ్యాహ్నానికి మూడు రథాలూ జగన్నాథ ఆలయానికి చేరుకుని గుడిబయటే ఉండిపోతాయి.
* మర్నాడు ఏకాదశినాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. సునావేషగా వ్యవహారించే ఈ వేడుకను చూసేందుకు బారులు తీరుతారు భక్తులు. ద్వాదశినాడు విగ్రహాలను మళ్లీ గర్భగుడిలోని రత్నసింహాసనంపై అలంకరించడంతో యాత్ర పూర్తయినట్లే. యాత్రపేరిట పదిరోజులుగా స్వామి లేని ఆలయం నూతన జవజీవాలు పుంజుకుని కొత్తకళ సంతరించుకుంటుంది.
స్థలపురాణం ఏంటంటే..
* ఇంద్రద్యుమ్నుడనే మహారాజుకు విష్ణుమూర్తి కలలో కనిపించి చాంకీ నదీ తీరానికి ఒక కొయ్య కొట్టుకు వస్తుందనీ దాన్ని విగ్రహాలుగా మలచమనీ ఆజ్ఞాపించాడట. కానీ అలా నదీతీరంలో లభ్యమైన దారువును విగ్రహాలుగా మలిచేందుకు ఎవరూ ముందుకు రాలేదట. అప్పుడు దేవశిల్పి విశ్వకర్మ రాజు వద్దకు మారువేషంలో వచ్చి... ఆ కొయ్యను తాను విగ్రహాలుగా మలచగలనన్నాడట. కానీ తాను తలుపులు మూసుకుని ఈ పని చేస్తానని తన పనికి మధ్యలో ఆటంకం కలిగించకూడదనీ షరతు పెడతాడు. కానీ 15 రోజుల తర్వాత... ఉత్సుకతను ఆపుకోలేని రాజు తలుపులు తెరిపించాడట. అప్పటికి విగ్రహాల నిర్మాణం పూర్తికాలేదు. దాంతో వాటిని అలాగే ప్రతిష్ఠించారనీ ఇప్పటికీ జగన్నాథుడు అదే రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడనీ స్థలపురాణం.
* రథయాత్ర నేపథ్యం గురించి రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ద్వాపర యుగంలో కంసుడిని వధించడానికి బలరామకృష్ణులు బయలుదేరిన ఘట్టాన్ని పురస్కరించుకుని ఈ యాత్ర జరుపుతారని ఒక కథనం.
* ద్వారకకు వెళ్లాలన్న సుభద్రాదేవి కోరిక తీర్చే ముచ్చటే ఈ రథయాత్ర అని మరొకొందరు చెబుతారు. ఇక గుండీచాదేవి మందిరం విషయానికొస్తే... పూరీ జగన్నాథ ఆలయాన్ని నిర్మించిన ఇంద్రద్యుమ్న మహారాజు భార్య గుండీచా. ఆవిడ కూడా జగన్నాథబలభద్రుల కోసం ప్రధానాలయానికి మూడు కి.మీ. దూరంలో ఒక మందిరం నిర్మించింది. అదే గుండీచా ఆలయం. రథయాత్రలో భాగంగా అక్కడికి తీసుకువెళ్లిన మూడు విగ్రహాలనూ ఈ గుడిలోని రత్నసింహాసనంపై కూర్చుండబెట్టి గుండీచాదేవి పేరిట ఆతిథ్యం ఇస్తారు. ఒకరకంగా చెప్పాలంటే గుండీచామందిరం జగన్నాథుడి అతిథిగృహం అన్నమాట.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- మాకొద్దీ ఉద్యోగం!
- ఆయనే లోకమన్నది.. అంతలోనే అంతమైంది
- నిత్యానందా.. నీ దేశానికి వీసా ఎలా?
- నోట్లో దుస్తులు కుక్కి వివాహితపై అత్యాచారం
- విండీస్ వీరులారా.. ఓ విన్నపం!
- ఎందుకా పైశాచికం?
- కదులుతున్న కారులోనే లైంగిక దాడి
- ఆ పాట నా ఇమేజ్ను పూర్తిగా మార్చేసింది!
- ‘బుమ్రా నా ముందొక బేబీ బౌలర్’
- పార్లమెంట్‌కు చిదంబరం..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
